తెలంగాణ కల్చర్ ఇదే! చక్కెర కుడుకలు, గంగదర్వాజ

ఒక మంచి పుస్తకం చదివితే చెప్పలేనంత సంతోషం, డా॥మట్టా సంపత్​కుమార్ రెడ్డి రాసిన ‘గంగదర్వాజ’ మంచి పుస్తకం మాత్రమే కాదు. తెలంగాణ జాతి జీవనసారం.

‘గంగదర్వాజ’ ఎంత మంచి పేరు! మనిషి జీవితం నీళ్ళతోనే ముడిపడి ఉంది. తెలంగాణాలో ‘గంగ’ అంటే నీళ్ళకు పర్యాయపదం. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు నదులు ఉత్తరం వైపునే ఉంటాయి. అందుకే ఇంటికి ఉత్తర ద్వారాన్ని ‘గంగదర్వాజ’ అంటారు. ఇంటికి గంగదర్వాజ వల్ల కలిగే ఉపయోగాలను ఈ పుస్తకంలో చదివి ఆశ్చర్యపోతాం. తెలంగాణ తిండ్లు, పండుగలు, ఆచారాలు, వ్యవహారాలు, కష్టాలు, సుఖాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతలు, అనుబంధాలు, సామెతలు మొదలైనవెన్నో ఇందులో ఉన్నాయి. అవన్నీ తెలంగాణ తెలుగు భాషలో ఉండడం, అన్నీ ముచ్చట పెట్టినట్లే ఉండడం విశేషం. అందుకే దీనికి ‘తెలంగాణ సంస్కృతి మురిపాల ముచ్చట్లు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.

మనదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం. మగడు దున్నుతూ ఉంటే... భార్య విత్తనాలు వేసుకుంటూ పోతుంటే ఆ దృశ్యం నయనానందకరం. చద్ది అన్నం తెచ్చి ఒకరికొకరు తినిపించుకుంటుంటే- ఎంతటి అనురాగం. వాళ్ళు పండించే పంట వాళ్ళకోసమేనా? జాతికోసం. ‘‘కాపు అంటే పంటను కాపాడే సంరక్షకుడు. కాపు కాసేది ఒక్క పంటనేనా? కాదు. ప్రకృతిని, ప్రాణికోటిని, మానవ సమూహాన్నీ సమస్తంగా కాపు కాస్తడు. కర్షకుడు లోక రక్షకుడు” అంటూ రచయిత కర్షకునికి కనకాభిషేకం చేశాడు.

ఏరు అంటే అరుక/నాగలి. వాక అంటే చాలు/ ప్రవాహం.

ఏరువాక అంటే నాగలికట్టి మొదటి చాలు వేసుడన్నట్టు. దీన్నే సాగువాటు అంటారు.ఊరు ఊరంతా ఏకమై నడుంకట్టి పని చేసుడు, అంతరాలు మరిచి కష్టసుఖాలు కలబోసుకునుడు, అందరు కలిసి పంచుకు తినుడు... ఎంత మంచి సంబురం. సంపత్ మనల్ని ‘చేసుకాడికి పొయ్యద్ధం వస్తరా’ అని తీసుకుపోతడు.

వరి కోసినప్పుడు- కోతవట్టుడు, కోసుడు, మెదేసుడు, కల్లం చెక్కుడు, కట్టలు కట్టుడు, కుప్పేసుడు, బంతిగొట్టుడు, గడ్డి దులుపుడు, రాశివోసుడు ఇన్ని పనులుంటే మిగతా పంటల పనులు ఇంకెన్ని ఉండాలి? ‘‘మన నాగరికతలన్నీ నాగలి కథలేనాయె’’. ఈ ఒక్క మాటలో నాగరికత సారాంశాన్ని చెప్పాడు సంపత్. తల్లంత ఆత్మ లేదు. కొత్తంత పండుగ లేదు. కొత్త పండుగ (కొత్త చెట్టుకొనుడు) ఎప్పటికీ పాతవడని మన ఎవుసపు పండుగ. పంట ఇంటికి రాంగనే చేసుకునే పంటల పండుగ. భూమికి, ఎద్దుకు, ఎవుసానికి, ధాన్యపురాశికి మనం చెల్లించే కృతజ్ఞత.

“ఎత్తేదా ఈ పెండ ఎన్నా ముద్దోలె/ చేసేదా ఈ పెండ చెండుబంతోలె/ చరిసేదా ఈ పెండా చందామామోలే’’

అని పాడడం, పెండను ఎన్న ముద్దతో, బంతితో, చందమామతో పోల్చడం. యతిప్రాసలు వాటంతటవే పడడం జానపదులకే సాధ్యం.
కనుమ పండుగ రోజు కాయకష్టం చేసే మూగ జీవాలను పూజిస్తారు. ఎన్నో పండుగలలో పనివాళ్ళను ఆదరిస్తారు. ‘కాముని పున్నమి’ ఆటపాటల తోటి సృష్టి పండుగ. మగవారికి కోలలు, ఆడవారి చేతుల వాయిద్యాలు, పిల్లల జాజిరి పాటలు విజ్ఞానదాయకాలు. అన్నదానమే తెలంగాణ బోనాలకు పరమార్ధం. 
ఇండ్లల్లకు వోయినప్పుడు అన్నదమ్ములకు ఆడబిడ్డ పెట్టేది తొలి కూరాడు.

కూరాడు దేవతగ పూజలందుకుంటుంది. కుటుంబ విలువలల్ల ‘చక్కెర కుడుకలు’ గొప్ప సంప్రదాయం. తోడబుట్టిన తోడు నెనరును నెత్తికెత్తుకునే సుందరమైన సువర్ణమైన వేడుక. ‘గరిగబుడ్డి’ భువన భాండపు సృష్టి చిత్రానికి ఒకానొక తాత్విక ముఖచిత్రం.

‘బియ్యమిచ్చుడు’ మనకు అనాది సంప్రదాయం. అన్నప్రసాదాలను అద్దానికి సమర్పించుకునుడు పరంపర. అద్దంలో ఆత్మను దర్శించడం గొప్ప తాత్వికత. మనం పూర్వీకుల నీడల వంటివాళ్ళమే. పితృదేవతలు ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. బియ్యం ఇచ్చుడు, నలుగురికి తిండివెట్టుడు మన విధి. పోయినవారి ఆత్మలు అట్లుండనీ, కొనసాగింపు వారసులమైన మనం వారికి ఇష్టమైన పదార్థాలను పంచుడన్నది ఎంత ఆనందకరం! ఎంత ఉమ్మడితనం!
మన అలవాట్లలో జీవనశైలిలో నాటికీ, నేటికీ ఎంత తేడా ఉందో చెప్తడు రచయిత.

ఇప్పటి పిల్లలకు సరైన బాల్యమెక్కడిది? ఎన్కటి తిండి ఎంత మంచి తిండి? ఇప్పటిది మందుల తిండి. తల్లి పాలటువంటి తిండి తినుకుంట, చేదబాయిల నీళ్ళు తాగుకుంట పెరిగిన అప్పటి పిల్లలు... ఎత్తేస్తే పలుగని చిట్టెపురాళ్ళ లెక్కన గట్టిగుందురు. ఇప్పటి మన తిండి వట్టి సొప్పబెండు నమిలినట్లుగ సప్పటిది. కనుక శరీరమూ సొప్పబెండ్ల పల్లాకే. ఇప్పటోళ్ళు సెల్​ఫోన్లల్ల ఆర్డరిచ్చుడు. పార్శిల్లు ఇంటికచ్చుడు. డబ్బలల్ల వెట్టుడు. ఇంటినిండ డబ్బలు. ఒంటి నిండ జబ్బులు. షాని ఎక్కువైనంక పరేశాని ఎక్కువైంది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. మెతుకు లేకుంట ఊడ్సుకతినుడు తిండి పద్ధతి. ఒకప్పుడు చలి అన్నం పారేసేటోళ్ళే కాదు. చెత్తల కుమ్మరించే ఆలోచనే అసలు పుట్టని రోజులవి. ఇప్పుడు తిన్నదానికంటె పడేసుడే ఎక్కువ.

మనిషికి బతుకు తెరువే తరువులు. శ్రమైక జీవనంలో మమేకమైన మన సంస్కృతిలో పచ్చని చెట్లకూ, పర్యావరణానికీ మహోన్నత స్థానం. పొట్లచెట్టుకు తొలిపువ్వు పూసి పుష్పవతి అయిందని వేడుక జరపడం ఎంత సంబురం! మరి చెట్లతో పెనవేసుకున్న మన మమత లెటువాయె?

ఒకప్పుడు ఆడపిల్లకు అవసరం పడితేనే పలారాలు తీసుకపోదురు. ఇప్పుడు మగపిలగానికి వరపూజైనా పలారం ప్యాకింగే. ఇంకా మారింది. పెండ్లి రేపనంగ పిలగాడు విమానం దిగవట్టే. పసుపు బట్టలతోనే పెండ్లిపిల్ల విమానం ఎక్కవట్టే. ఏ పలారాలైనా ఆర్డరిచ్చుడు. బోర్డరు దాటిచ్చుడు. ఇగ ఇంకో పలారాలుంటయ్... తిరుపతి, కొండగట్టు, ఎములాడ, కొత్తకొండకు వొయ్యి దేవునికి మొక్కి పలారాలు తెచ్చి, ఇంటిముందట నిలవడి ‘పలారముల్లో’ అంటె ఆ వీధివాళ్ళు వచ్చి సంబురంగ తీసుకుందురు. పంచిపెట్టడంలోని ఆనందం అప్పటోళ్ళకు తెలుసు.

ఒకప్పుడు పిల్లలు ప్రయోజకులు కావడానికి పెద్దలు సుద్దులు చెప్పెటోళ్ళు. కథలు వినిపించెటోళ్ళు. ఇప్పుడు ఇనుటానికి పెద్దల పక్కన పిన్నలున్నరా? చెప్పుటానికి పిన్నల పక్కన పెద్దలున్నరా? మన సంసారాలెప్పుడో ఇచ్చుల్లారమాయె! మళ్ళీ మనలో మంచి అలవాట్లు పెంపొందించేలా, ప్రకృతినీ వ్యవసాయాన్ని సాటి మనుషులను గౌరవించేలా, తెలంగాణ తెలుగుభాష మాధుర్యాన్ని చాటేలా, జానపదుల కష్టసుఖాలు తెలుసుకొని ఆదరింపజేసేలా ‘గంగదర్వాజ’ రచన సాగింది.


ఈ పుస్తకంలో తగినంత హాస్యం ఉంది. అక్కడక్కడ వ్యంగ్యం ఉంది. తెలంగాణ జీవం ఉంది. పుస్తకం నిండా రచయిత మనసు ఉంది. తెలంగాణల ఆత్మగల్ల మనుషులు, కవులు కొందరున్నరు. అందులో మట్టా సంపత్​కుమార్ రెడ్డి ఒకరు. ఆ ఆత్మను ఆలింగనం చేసుకోవాలంటే ‘గంగదర్వాజ’ చదవాలి.

- ఎ. గజేందర్ రెడ్డి