అసైన్ మెంట్ భూమిని పట్టా చేసిన తహసీల్దార్ నరేందర్​

  • రూ. 2.5 లక్షలు తీసుకుని పట్టా చేశాడని ఆరోపణలు 

లింగంపేట, వెలుగు: సర్కార్​(అసైన్​మెంట్​) భూములను పట్టాలు చేయవద్దని  ప్రభుత్వ ఆదేశాలుండగా దానికి వ్యతిరేకంగా రెండెకరాల ప్రభుత్వ భూమిని లింగంపేట తహసీల్దార్​ నరేందర్​ పట్టా(రిజిస్ట్రేషన్​) చేశారు.  లింగంపేట మండలంలోని రాంపూర్​ శివారులో సర్వే నంబర్16 లో 8 ఎకరాల సర్కార్ ​భూమి ఉంది. ఇందులో 2 ఎకరాల భూమిని భవానీపేట తండాకు చెందిన లంబాడీ చాంగీ పేరిట గతంలో రెవెన్యూ ఆఫీసర్లు అసైన్​ చేశారు.  సదరు అసైన్​మెంట్​ భూమిని చాంగీ హైదరాబాద్​కు చెందిన పులిపాటి మమతకు విక్రయించారు.  ఈ నెల 7న తహసీల్దార్​లంబాడీ చాంగీ పేరిట ఉన్న రెండు ఎకరాల అసైన్​మెంట్​ భూమిని​ పులిపాటి మమత  పేరిట పట్టా చేశారు.​ అసైన్​మెంట్​ భూమిని స్థానిక తహసీల్దార్​ రూ.2.5 లక్షల ముడుపులు తీసుకుని రిజిస్ర్టేషన్​ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

పొరపాటు జరిగింది..  పట్టా రద్దు చేస్తా.. తహసీల్దార్​

లింగంపేట మండలం రాంపూర్​ శివారులోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేయడంపై స్థానిక తహసీల్దార్​ నరేందర్​ను ప్రశ్నించగా అసైన్​మెంట్​ భూమి అని ఆన్​లైన్​లో  లేనందున పట్టా చేశానని , పొరపాటు జరిగిందన్నారు.  జిల్లా కలెక్టర్​కు లెటర్​ పెట్టి పట్టాను రద్దు చేస్తానని చెప్పారు.