నల్లగొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినాతన గెలుపును అడ్డుకోలేరన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఒంటరిగానే తీన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడాడని .. కాంగ్రెస్ పార్టీ తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. మే 25వ తేదీ శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని MNR గార్డెన్ లో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లతో కాంగ్రెస్ ఎన్నికల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న , జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీగా తరలి వచ్చిన ఓటర్లు ... తీన్మార్ మల్లన్నకు ఉద్యోగ, నిరుద్యోగ సంఘాలు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమన్నారు. రెండవ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉండేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారని చెప్పారు. గత పది సంవత్సరాల్లో ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు తనపై పెట్టని కేసులు లేవన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడానని చెప్పారు. ఇప్పుడు కొంతమంది తన ఓటమి కోసం శాయశక్తుల కృషి చేస్తున్నారని అన్నారు. తీన్మార్ మల్లన్న గెలిస్తే మళ్లీ ప్రజల పక్షాన పోరాడుతాడని ... మా బండారాలు బయటపడతాయని కోపంతో కొంతమంది వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది తీన్మార్ మల్లన్న ప్రజల మనిషి గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు. అందరికంటే ముందుగా గ్రాడ్యుయేట్స్ ఓటర్ల దీవెనలు తనపై ఉన్నాయన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరానని.. మళ్ళీ సొంత పార్టీలోకి వచ్చానని.. దీన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తీన్మార్ మల్లన్న పై ఎలాంటి ఆరోపణలు చేయాలో తెలియక దిగజారి వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తన జీవితం మొత్తం ప్రజాసేవ కోసమే అంకితమని.. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా తీన్మార్ మల్లన్న కొట్లాడుతూనే ఉంటాడని అన్నారు.