స్టడీ : పిల్లల నిద్రపై టెక్నాలజీ ఎఫెక్ట్..టెక్నాలజీ డిటాక్స్​

పిల్లలకు నిద్ర సరిపోవట్లేదని చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటారు. అయితే పిల్లల హెల్త్ విషయంలో ఎంతో జాగ్రత్తపడే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి పొరపాట్లలో పిల్లలకు డిజిటల్ టెక్నాలజీ అలవాటు చేయడం కూడా ఒకటి. అవును మరి స్మార్ట్​ ఫోన్లు, ట్యాబ్​,  ల్యాప్​ టాప్ వంటి వాటిని అవసరం మేరకే వాడాలి. కానీ, పిల్లలు అలా కాదు.. వాళ్లకు ఆట లేదా పని ఏదైనా నచ్చిందంటే చాలు.. ఎంతసేపైనా దాంతోనే గడుపుతారు. అలాగే, స్క్రీన్ చూడడం అలవాటైన పిల్లలు దాన్ని వదలకుండా గంటల తరబడి చూస్తున్నారు. అదే పిల్లల నిద్రకు చేటు చేస్తోంది. 

స్క్రీన్ టైం పెరిగింది. శారీరక శ్రమ తగ్గింది. దాంతో ఈజీగా అనారోగ్యం బారిన పడుతున్నారు. స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల నిద్ర సరిగా పట్టదు. పోయిన నిద్ర సరిపోదు. దాంతో అలసట, చిరాకు వంటివి వస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. ఇదే స్థితి దీర్ఘకాలం ఉంటే... ఆరోగ్య, సామాజిక అంశాల్లో ప్రభావం చూపిస్తుంది. అయితే పిల్లల నిద్ర మీద టెక్నాలజీ ఎలా ప్రభావం చూపుతుంది అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ, ఈ అంశంపై స్టడీలు మాత్రం బాగానే జరుగుతున్నాయి. అలానే క్వీన్స్ లాండ్​ యూనివర్సిటీలోని చైల్డ్ హెల్త్ రీసెర్చ్​ సెంటర్లో కమ్యూనిటీ స్లీప్​ హెల్త్ అనే గ్రూప్​ ఒక రీసెర్చ్ చేసింది. న్యూరో సైకాలజిస్ట్​, స్లీప్​, బ్రెయిన్ ఎక్స్​పర్ట్ ప్రొఫెసర్ సైమన్ స్మిత్​ ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్​ చేశారు. అందులో వెల్లడైన కొన్ని విషయాల గురించి చెప్పేదే ఈ స్టోరీ.

ఇంట్లో టెక్నాలజీ పాత్ర!

టెక్నాలజీ అనేది కొత్తగా ఇంట్లోకి వచ్చింది కాదు. పైగా అది గెస్ట్​ కాదు వచ్చి వెళ్లిపోవడానికి. ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చేరిందంటే కంటిన్యూ అవుతుంటుంది. ఉదాహరణకు రేడియో, టీవీ వంటివి కనిపెట్టకముందు.. కనిపెట్టాక ఎలాంటి మార్పులు వచ్చాయో అందరికీ తెలిసిందే. పూర్వం ఏ ఇంట్లోనూ టెక్నాలజీకి సంబంధించిన వస్తువు ఉండేది కాదు. టెక్నాలజీ జనాలకు కాస్త దగ్గరగా వచ్చాక కూడా టీవీ అనేది డబ్బు ఉన్నవాళ్లు కొనే వస్తువుగా ఉండేది. 

అదే ఇప్పుడు చూస్తే.. ఇంట్లో టీవీ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది​. ఇంతగా టెక్నాలజీకి అలవాటు పడడం వల్ల రాత్రిపూట పడుకునే ముందు బుక్స్ చదివే అలవాటు దాదాపు మర్చిపోయారు. నిద్ర టైం దాటినా టీవీలు, స్మార్ట్ ఫోన్లలో పడి మునకలేస్తున్నారు. ఈ అలవాటు ఇప్పటి జనరేషన్​ పిల్లలకు మరీ ఎక్కువైంది. అలా వాళ్ల నిద్రకు భంగం కలుగుతోంది. ఈ విషయం తల్లిదండ్రులను టెన్షన్​ పెడుతోంది.

వయసు పెరిగే కొద్దీ నిద్ర పోయే టైం కూడా మారుతుంది. అయినా, పెద్దల కంటే పిల్లలకు నిద్ర చాలా ఎక్కువ అవసరం. కానీ, ఈ రోజుల్లో తగినంత నిద్ర పోవడం అనేది సవాలుగా మారింది. పిల్లలు, యువత.. అన్ని రకాల వాతావరణాల్లో,  ప్రదేశాల్లో,  పరిస్థితుల్లో పెరుగుతారు. వాళ్లకి సొంత వ్యక్తిత్వం, ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. అలాగే కొవిడ్ టైంలో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. 

వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ల అలవాట్లపై ఎఫెక్ట్ చూపించింది. అందులో ముఖ్యమైనది టెక్నాలజీ అలవాటు చేసుకోవడమే. అలాగని కొత్త విషయాల గురించి తెలుసుకోవడం తప్పేం కాదు. కానీ, దాన్ని వాడే విషయంలో లిమిట్స్ తప్పనిసరి. దానికంటే ముందు పిల్లల ఎదుగుదల కోసం పోషకాహారం, లైఫ్ స్కిల్స్ నేర్పించడం, వ్యాయామాలు, శారీరక శ్రమ, నలుగురితో కలవడం, తగినంత నిద్ర వంటి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత రిలాక్సేషన్, లెర్నింగ్, టెక్నాలజీతో కనెక్షన్​ ఎలా ఉంది? అనేవి తెలుసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన బాల్యం కోసం..

టెక్నాలజీ వాడకాన్ని పాజిటివ్​గా వాడితే పిల్లలకు హెల్దీ చైల్డ్​హుడ్​ని అందించిన వాళ్లవుతారు. అయితే ఈ విషయం మీద ఇంకా రీసెర్చ్​లు జరుగుతున్నాయి. మొదట్లో చేసిన అధ్యయనాల్లో... ఒక కుటుంబం నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు రోజూ ఏం చేస్తుందో తెలుసుకున్నారు. అందులో.. ఫ్యామిలీ మొత్తం కలిసి టెక్నాలజీని వాడొచ్చు. ఒంటరిగా లేదా ఇద్దరు కలిసి వాడొచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు ఈ విషయంలో రెస్ట్ ఇవ్వొచ్చు లేదా వాళ్లతో కలిసి టెక్నాలజీ వాడొచ్చు అని తెలిపింది.

అయితే, పిల్లలు మిగిలిన రోజుల్లో వాడే డిజిటల్ డివైజ్​ల ద్వారా వచ్చే లైట్​ టైప్​, టైంలను కూడా పరిశీలిస్తున్నారు. స్క్రీన్​ ద్వారా వచ్చే కాంతి వల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది. ఇంట్లో ప్రశాంతమైన ఆర్టిఫిషియల్ లైటింగ్, టీవీలు, స్ట్రీట్ లైట్స్ వంటి ఇతర లైటింగ్స్ ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా టెక్నాలజీ పిల్లల నిద్రను ఎఫెక్ట్ చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. 

లైట్ ఎక్కువ పడడం

సాయంత్రం వేళ లైట్​కి ఎక్కువ ఎఫెక్ట్ కావడం. స్క్రీన్​ల లైట్ కళ్లపై పడకూడదు. కానీ, కళ్లకు దగ్గరగా పెట్టుకుని మరీ వాటిని చూస్తుంటారు. కొందరు పిల్లలు గాడ్జెట్స్​ వాడేటప్పుడు వాటికి సరిపడా వెలుతురు ఉండకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు లేదా పెద్దలు పగటి వెలుతురు గురించి ఆలోచించాలి. వెలుతురు పడే టైం చాలా ముఖ్యం. ఆ టైంలో శరీరానికి ముఖ్యమైన సిగ్నల్స్ అందుతాయి. 

అయితే, ఆర్టిఫిషియల్ లైటింగ్​కి నైట్ టైంలోనే ఎక్కువగా ఎక్స్​పోజ్ అవుతున్నారు. మామూలుగా ఇంటర్నల్ బయోలాజికల్ క్లాక్ లేదా సర్కేడియన్ రిథమ్స్ అనేవి ఎక్కువ లేదా తక్కువ ప్రకాశవంతమైన పగలు లేదా రాత్రుల మీద ఆధారపడి ఉంటాయి. పిల్లలు చాలా బలమైన బయోలాజికల్ క్లాక్స్ కలిగి ఉంటారు. అదేటైంలో వాళ్లకు లైట్​ సెన్సిటివిటీ కూడా ఉంటుంది. డిజిటల్ డివైజ్​ల నుంచి ఎక్కువగా యూవీ లైట్ పడుతుంది. అది నిద్రపోయే టైం మీద ప్రభావం చూపించడంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

డిస్​ ప్లేస్​మెంట్​

రాత్రిపూట టెక్నాలజీ వాడడం అనేది వాళ్ల వాళ్ల ఆసక్తులు బట్టి ఉంటుంది. స్క్రీన్​తో ఎక్కువ సమయం గడపడం వల్ల రాత్రి భోజనం, స్నానం, స్టడీ టైం లేదా కామన్ స్లీప్​ టైం వంటి రొటీన్​ డిస్టర్బ్​ అవుతుంది. 

కాన్​ఫ్లిక్ట్

టెక్నాలజీ ఆధారంగా చేసే యాక్టివిటీకి, రిలాక్సేషన్​కి మధ్య ఉన్న కాన్​ఫ్లిక్ట్​ వల్ల ఎఫెక్ట్ పడుతోంది. డిజిటల్ కంటెంట్ చూడడం పెరిగితే మిగతా విషయాల మీద ఫోకస్​ తగ్గుతుంది. దాంతో అయోమయం, దిగులు, బాధ కమ్ముకుంటాయి. ఒకవేళ నిద్రకు ముందు ఇలా జరిగితే.. అది కూడా నిద్ర టైంకి పోకపోవడానికి కారణం అవుతుంది.

టెక్నాలజీలో కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు అంతం లేదు. సాంకేతికత అనేది సముద్రంలాంటిది. అందులో ఎంత వెతికినా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అందులో పడి.. కొన్నిసార్లు లోకాన్ని కూడా మర్చిపోతుంటారు. అయితే... ఏదైనా సరే మితిమీరితే ప్రమాదం. ముఖ్యంగా పిల్లలు నేర్చుకుంటూ ఎదిగే స్టేజీలో ఉంటారు. కాబట్టి టెక్నాలజీని ఎంతవరకు, ఎలా ఉపయోగించాలనేది వాళ్ల వయసును బట్టి ఉంటుంది. కాబట్టి అలా లిమిట్​గా వాడేలా చేసే బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి.

పిల్లలు మంచి నిద్ర పోవాలంటే..

  • పిల్లల ఎదుగుదలలో తిండి, వ్యాయామం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మంచి నిద్ర కోసం కొన్ని రూల్స్​ పాటించాలని రీసెర్చ్​లో తేలింది. అవేంటంటే.. 
  • నిద్రపోయే గది సురక్షితంగా ఉండాలి.
  • మరీ చల్లగా లేదా వేడిగా ఉండకూడదు. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. గదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా మసకగా ఉంటే నిద్ర పోవడానికి మొదటి మెట్టు రెడీ అయినట్టే.
  • రెగ్యులర్​గా ఒకే టైంకి నిద్రపోవాలి. ఒకే టైంకి లేవాలి. దానివల్ల బయోలాజికల్ క్లాక్​ సరిగ్గా ఉంటుంది. 
  • స్మార్ట్​ ఫోన్​లలో లైటింగ్​ లెవల్స్ డే లేదా నైట్​ టైం బట్టి అడ్జస్ట్​ చేస్తుండాలి. 
  • టెక్నాలజీని పిల్లలకు ఉపయోగపడేలా వాడాలంటే వాళ్లు నిద్రపోయే టైం, లేచే టైంని అలర్ట్స్ పెట్టొచ్చు.
  •  పిల్లలు డిజిటల్ డివైజ్​లను వాడకుండా కంట్రోల్ చేసే అవకాశం తల్లిదండ్రుల దగ్గరే ఉంది.