స్టూడెంట్‌‌ను చితకబాదిన టీచర్‌‌

  • విరిగిన చేయి, పోలీసులకు ఫిర్యాదు

నిజామాబాద్, వెలుగు : ఓ టీచర్‌‌ విచక్షణారహితంగా కొట్టడంతో స్టూడెంట్‌‌ చేయి విరిగింది. నిజామాబాద్‌‌ నగరంలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని దుబ్బ ప్రాంతానికి అశ్విత స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌‌లో టెన్త్‌‌ చదువుతోంది. గత శుక్రవారం జామెట్రీ బాక్స్‌‌ మర్చిపోయి స్కూల్‌‌కు వెళ్లిన అశ్విత కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి బాక్స్‌‌ తీసుకొని తిరిగి స్కూల్‌‌కు వెళ్లింది. దీంతో ఆలస్యంగా వచ్చావంటూ మ్యాథ్స్‌‌ టీచర్‌‌ కల్పన కర్రతో విచక్షణారహితంగా అశ్వితను కొట్టింది.

తర్వాత ఈ విషయాన్ని పేరెంట్స్‌‌కు చెప్పొద్దని హెచ్చరించి పంపారు. చేయి వాపు రావడంతో బుధవారం గమనించిన అశ్విత తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించడంతో విషయం తెలిపింది. దీంతో హాస్పిటల్‌‌కు వెళ్లి ఎక్స్‌‌రే తీయించగా ఫ్రాక్చర్‌‌ అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో అశ్విత తల్లిదండ్రులు గురువారం త్రీటౌన్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఈవో అశోక్‌‌ ఘటనపై విచారణ చేయాలని ఎంఈవో ఆర్‌‌వీఎన్‌‌ గౌడ్‌‌ను ఆదేశించారు. దీంతో ఆయన గురువారం స్కూల్‌‌కు వచ్చి విచారణ జరిపి, రిపోర్ట్‌‌ను డీఈవోకు అందజేశారు.