ఎన్డీఏలోకి టీడీపీ, జనసేన

 

  •     మోదీ నాయకత్వంలో ఆ రెండు పార్టీలు పనిచేస్తాయి 
  •     బీజేపీ కేంద్ర కార్యాలయం ఉమ్మడి ప్రకటన రిలీజ్​ 
  •     ఏపీ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం: జేపీ నడ్డా

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. శనివారం బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు‌‌. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.

న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దఫాలుగా పార్టీ ముఖ్యనేతలతో చర్చల తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ, జనసేన చేరేందుకు అంగీకారం లభించింది. శనివారం బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు‌‌. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ భేటీ అనంతరం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులతో బీజేపీ కేంద్ర కార్యాలయం సంయుక్తంగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చైతన్యవంతమైన దూరదృష్టి గల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జేఎస్​పీ) దేశ పురోగతి, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయి.

 త్వరలో జరగబోయే లోక్‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదేండ్లుగా దేశ ‌‌అభివృద్ధి, ప్రగతి కోసం అవిశ్రాంతంగా ‌‌కృషి చేస్తున్నారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడంలో దోహదపడుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.  బీజేపీ, టీడీపీ మధ్య పాత సంబంధాలున్నాయని గుర్తు చేశారు. 2014లో లోక్‌‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా..  జనసేన సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు ఇచ్చిందన్నారు. అయితే సీట్ల పంపకానికి సంబంధించిన విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లో చర్చించనున్నట్టు స్పష్టం చేశారు.

దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నం: నడ్డా

ఏపీలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ‘ఎన్డీఏలో చేరాలని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం’ అని నడ్డా ఎక్స్​ వేదికగా ప్రకటించారు.