ఇన్​స్పిరేషన్ : ముందుచూపుతో పెట్టిన కంపెనీ

జంషెడ్జీ టాటా కలలు కన్న కంపెనీ.. అతని వారసులు ఏర్పాటు చేశారు. అదే.. ప్రస్తుత టాటా స్టీల్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌. మొదటి ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిషర్లకు స్టీల్ సరఫరా చేసింది అదే కంపెనీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశంలో కట్టిన హౌరా బ్రిడ్జి లాంటి ఎన్నో ప్రాజెక్ట్‌‌‌‌లకు ఈ కంపెనీలో తయారైన మెటీరియల్‌‌‌‌నే వాడారు. అంతేకాదు.. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా.. ఉద్యోగాలను తొలగించకుండా అప్పులు తెచ్చి మరీ జీతాలు ఇచ్చి,  ఉద్యోగులకు అండగా నిలిచింది.  అలాంటిది ఇప్పుడు ప్రతి ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌‌‌‌‌‌‌‌తో ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది టాటా స్టీల్‌‌‌‌. 

ఒకప్పుడు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ.  ఇప్పుడు టాటా స్టీల్ కంపెనీ.. 34 మిలియన్ టన్నుల వార్షిక ముడి ఉక్కు ప్రొడక్షన్‌‌‌‌ కెపాసిటీతో ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఉక్కు కంపెనీగా పేరు తెచ్చుకుంది. ప్రపంచంలో రెండో అత్యంత జియోగ్రాఫికల్లీ డైవర్సిఫైడ్‌‌‌‌ స్టీల్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. 24 దేశాల్లో ఆపరేషన్స్‌‌‌‌, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తోంది. అంతేకాదు.. ఆసియాలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇది. ఇండియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ సెక్టార్ స్టీల్ కంపెనీ. ఇన్ని ఘనతలు సాధించిన ఈ కంపెనీ సక్సెస్‌‌‌‌ ఒక్కరోజులో వచ్చింది కాదు. దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. 

జె.ఎన్‌‌‌‌. టాటా 

టాటా స్టీల్ కంపెనీ స్థాపనకు కారకుడు జంషెడ్‌‌‌‌జీ నుస్సర్వాన్జీ టాటా.1839లో గుజరాత్‌‌‌‌లోని నవ్‌‌‌‌సారిలో పుట్టారు. తండ్రి నుస్సర్వాన్జీ టాటా వ్యాపారి.14 ఏండ్ల వయసులోనే జె.ఎన్‌‌‌‌. టాటా కూడా బిజినెస్‌‌‌‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత నాన్నకు సాయం చేస్తూనే బొంబాయిలోని ఎల్ఫిన్‌‌‌‌స్టోన్ కాలేజీలో చదువుకున్నాడు. 29 ఏండ్ల వయసులో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు.1868లో 21,000 రూపాయల పెట్టుబడితో బట్టల బిజినెస్‌‌‌‌లోకి దిగాడు. అప్పటివరకు ఈ బిజినెస్‌‌‌‌లో బ్రిటిషర్ల ఆధిపత్యం ఉండేది. కానీ.. ఒక ఇండియన్ కంపెనీ వాళ్లను సవాల్‌‌‌‌ చేయగలదని టాటా నమ్మాడు. ఆ తర్వాత 1869లో ఒక దివాలా తీసిన ఆయిల్ మిల్లును కొని డెవలప్‌‌‌‌ చేశాడు. ఇలా.. ఎన్నో సక్సెస్‌‌‌‌లు సాధించాక స్టీల్‌‌‌‌ ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్‌‌‌‌ అయ్యాడు. అయితే అందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. 

ఆసక్తి ఎందుకు? 

జె.ఎన్‌‌‌‌. టాటా1867లో మాంచెస్టర్‌‌‌‌లో థామస్ కార్లైల్స్ అనే సైంటిస్ట్‌‌‌‌ ఇచ్చిన స్పీచ్‌‌‌‌ విన్నాడు. ఆ స్పీచ్​లో ‘‘ఇప్పుడు ఐరన్‌‌‌‌ మీద కంట్రోల్‌‌‌‌ ఉన్న దేశాలు భవిష్యత్తులో గోల్డ్‌‌‌‌ మీద కూడా కంట్రోల్‌‌‌‌ సాధిస్తాయి” అని చెప్పాడు. అందుకు కారణం .. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రైలు మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ట్రాక్స్‌‌‌‌ నిర్మించడానికి కాస్ట్ ఐరన్ వాడేవాళ్లు. కానీ, ఇది త్వరగా తుప్పు పట్టేది. అందుకని స్టీల్‌‌‌‌తో తయారు చేసిన పట్టాలను వాడాలి అనుకున్నారు. కానీ.. కాస్ట్ ఐరన్‌‌‌‌తో పోలిస్తే స్టీల్‌‌‌‌ ధర చాలా ఎక్కువ. స్టీల్‌‌‌‌ తయారీ విధానం వల్ల ఖర్చు పెరిగి, ఆ ప్రభావం ధర మీద పడుతుంది. కానీ.. 1856లో హెన్నీ బెస్మర్ అనే వ్యక్తి ‘బెస్మర్‌‌‌‌‌‌‌‌ కన్వర్టర్’ అనే కొత్త టెక్నాలజీ కనిపెట్టాడు. దానివల్ల స్టీల్‌‌‌‌ తయారీ ఖర్చు బాగా తగ్గింది. దాంతో స్టీల్ తయారీ అనేది అప్పుడు ఒక రెవల్యూషన్​లా  జరిగింది. అందుకే థామస్ ఐరన్ గురించి అలా మాట్లాడాడు. ఆ మాటలు జె.ఎన్‌‌‌‌. టాటాను ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రేరేపించాయి. 

ఆ తర్వాత ఒకసారి సెంట్రల్ ప్రావిన్స్​లోని చందా జిల్లాలో ఇనుప ఖనిజం ఉందని జర్మన్ జియాలజిస్ట్ రిట్టర్ వాన్ స్క్వార్ట్జ్ ఒక నివేదిక ఇచ్చాడు. దాంతో జె.ఎన్‌‌‌‌. టాటా వెంటనే ఇండియాలో ‘ఐరన్‌‌‌‌ అండ్ స్టీల్’ ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకు కావాల్సిన వనరులను ఏర్పాటు చేశాడు. అమెరికా వెళ్లి అక్కడి సైంటిస్ట్‌‌‌‌లను కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటుకు రెడీ అయ్యాడు. ప్లాంట్‌‌‌‌ నిర్మాణానికి 2.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ.. సరిగ్గా అదే టైంలో 1904లో జె.ఎన్. టాటా చనిపోయారు. దాంతో స్టీల్‌‌‌‌ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న అతని కలను కొడుకులు డోరాబ్జీ టాటా, రతన్జీ టాటా నెరవేర్చారు. 

కల సాకారం

జె.ఎన్‌‌‌‌. టాటా కన్న కలలను సాకారం చేయడం ఎలా? అలోచనలో పడ్డారు ఇద్దరు కొడుకులు. సరిగ్గా అప్పుడే1905లో స్వదేశీ ఉద్యమం మొదలైంది. దానివల్ల మనదేశానికి సొంతంగా స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అనుకునేవాళ్లు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. కానీ.. బ్రిటిష్‌‌‌‌ పాలనలో ఉన్న ఆ టైంలో ఒక ఇండియన్ ‘ఐరన్ అండ్ స్టీల్’ ఫ్యాక్టరీ పెట్టడమంటే మాటలు కాదు. దానికి పర్మిషన్ రావడం చాలా కష్టమని అందరూ అనుకున్నారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. గవర్నమెంట్‌‌‌‌ ఈజీగా పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. ఎందుకంటే..

అప్పుడు బ్రిటిషర్లు ఇండియాలో ట్రైన్‌‌‌‌ ట్రాక్‌‌‌‌లు నిర్మించడానికి ఇంగ్లండ్‌‌‌‌ నుంచి ఓడల్లో స్టీల్‌‌‌‌ని తీసుకొచ్చేవాళ్లు. కానీ.. ఇక్కడే స్టీల్ తయారైతే తక్కువ ధరకే దొరుకుతుందని ఆలోచించారు వాళ్లు. కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ.. దొరాబ్జీ టాటా అందుకు ఒప్పుకోలేదు. కంపెనీ పూర్తిగా ఇండియన్ల డబ్బుతోనే పెట్టాలి అనుకున్నాడు. చివరకు1907లో జె.ఎన్. టాటా కల సాకారమైంది. ప్రముఖ జియాలజిస్ట్‌‌‌‌ సి.ఎం. వెల్డ్‌‌‌‌, టాటాల అసిస్టెంట్‌‌‌‌ శ్రీనివాస్ రావు కలిసి కంపెనీ పెట్టడానికి సువర్ణరేఖ

ఖర్కై అనే రెండు నదుల సంగమం దగ్గర ఉన్న సక్చి (ప్రస్తుతం జార్ఖండ్‌‌‌‌లో ఉంది) గ్రామాన్ని అనువైన ప్రదేశంగా ఎంపిక చేశారు. అదే ఏడాది అక్కడ ‘‘టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ’’(టిస్కో) పేరుతో కంపెనీ పెట్టి, పనులు మొదలుపెట్టారు. కంపెనీలో దాదాపు 8,000 మంది భారతీయులు పెట్టుబడి పెట్టారు. కేవలం మూడు వారాల్లోనే 2.32 కోట్ల రూపాయల పెట్టుబడి సమకూరింది. ఈ కంపెనీ నుంచి మొదటి ప్రొడక్ట్‌‌‌‌ పిగ్– ఐరన్‌‌‌‌ని 1911 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో, మొదటి స్టీల్‌‌‌‌ కడ్డీని1912 ఫిబ్రవరి16న ప్రొడ్యూస్‌‌‌‌ చేశారు. 

యుద్ధంతో లాభాలు... 

1914లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చి కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ యుద్ధం వల్లే  కంపెనీ గురించి ప్రపంచమంతా తెలిసింది. యుద్ధంలో వాడే వస్తువుల నుంచి ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌కు వాడే వాహనాల వరకు అన్నింటికీ డిమాండ్ పెరిగింది. అవన్నీ స్టీల్‌‌‌‌, ఇనుముతోనే తయారుచేస్తారు. అందుకే వీటికి కూడా డిమాండ్ పెరిగింది. అంతేకాదు.. ఒక టైంలో సక్చి... యుద్ధ ఆయుధశాలగా కూడా మారింది. ఈ కంపెనీ మార్కెట్‌‌‌‌లో ఉన్న ధరలో మూడింట ఒక వంతు ధరకే ప్రభుత్వానికి ఉక్కును అమ్మింది. కేవలం నాలుగేండ్ల యుద్ధ కాలంలో కంపెనీ మూడు లక్షల టన్నుల ఉక్కును తయారుచేసింది.

కంపెనీకి ‘థ్యాంక్స్‌‌‌‌’

యుద్ధం తరువాత1919లో వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌‌‌‌ ఫోర్డ్ సక్చిలో ఉన్న కంపెనీకి వెళ్లి మరీ ‘థ్యాంక్స్‌‌‌‌’ చెప్పాడు. ‘‘టాటా కంపెనీ స్టీల్‌‌‌‌ సప్లయ్​ చేయకపోతే.. ఈ నాలుగేళ్లలో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేమ’’న్నాడు ఆయన. బ్రిటన్‌‌‌‌కు మాత్రమే కాదు.. ఆ నాలుగేండ్లలో ఈజిప్ట్, పాలస్తీనా, తూర్పు ఆఫ్రికా దేశాలకు కూడా ఉక్కుని అందించింది టిస్కో. అందుకే జె.ఎన్. టాటా దూరదృష్టిని అభినందిస్తూ.. ఆయన జ్ఞాపకార్థకంగా ‘సక్చి’ పేరుని ‘జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌’గా...అక్కడి రైల్వే స్టేషన్ ‘కలిమతి’ పేరుని ‘టాటానగర్‌‌‌‌’గా మార్చాడు.

నష్టాలు 

కంపెనీని 1920ల్లో ఎక్స్‌‌‌‌పాండ్‌‌‌‌ చేశారు. దాంతో ఖర్చు పెరిగింది. పైగా యుద్ధం ఆగిపోవడంతో స్టీల్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ తగ్గింది. లాభాల బాటలో ఉన్న కంపెనీకి నష్టాలు రావడం మొదలైంది. అంతెందుకు 1924 నవంబర్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ మూసేసే పరిస్థితి ఏర్పడింది. అయినా.. సర్ దొరాబ్జీ టాటా కంపెనీని మూసేందుకు ఇష్టపడలేదు. తన సొంత ఆస్తులు, అతని భార్య నగలను ఇంపీరియల్ బ్యాంక్‌‌‌‌లో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. అన్ని నష్టాలు వచ్చినా.. కంపెనీలోని ఒక్క ఉద్యోగిని కూడా పనిలో నుంచి తీసేయలేదు. 1939 నాటికి మళ్లీ కంపెనీకి పూర్వ వైభవం వచ్చింది.

రెండో ప్రపంచ యుద్ధం నాటికి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇదే అతిపెద్ద సమీకృత ఉక్కు కర్మాగారంగా ఎదిగింది. ప్లాంట్ ప్రొడక్షన్‌‌‌‌ సామర్ధ్యం ఏడాదికి ఒక మిలియన్ టన్నులకు చేరింది. 1942లో యుద్ధ అవసరాల కోసం కంపెనీ స్పెషల్‌‌‌‌ స్టీల్‌‌‌‌ని తయారు చేసింది. అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌‌‌‌ కూడా ఏర్పాటు చేసింది. బుల్లెట్‌‌‌‌ ప్రూఫ్ ప్లేట్లు, రివెట్‌‌‌‌లతో కూడిన సాయుధ కార్లను తయారు చేసింది.   

స్వాతంత్య్రానంతరం 

స్వాతంత్య్రం వచ్చాక కంపెనీ విస్తరణ మరింత పెరిగింది. అంతేకాదు.. దేశ నిర్మాణంలో కూడా పాలు పంచుకుంది. హౌరా బ్రిడ్జి, భాక్రా-నంగల్ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్ట్, కాండ్లా ఓడరేవు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలకు టాటా ఉక్కు వాడారు.1958 నాటికి జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌ మూడు లక్షల మంది పౌరులు ఉన్న పట్టణంగా మారింది. అప్పుడు ఆ టౌన్‌‌‌‌లో జరిగిన కంపెనీ స్వర్ణోత్సవాలకు ప్రధాన మంత్రి జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. 

టెక్నాలజీ

మొదట్నించి కంపెనీలో కొత్తగా వచ్చే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తుండేవాళ్లు. అలా కొన్నేండ్లకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారింది. తర్వాత ప్రపంచ స్థాయి కోల్డ్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేసింది. దాంతో ఐదు మిలియన్ టన్నులకు పైగా కెపాసిటీ పెరిగింది. కంపెనీ శ్రీలంకలోని లంక స్పెషల్ స్టీల్, సింగపూర్‌‌‌‌లోని నాట్‌‌‌‌స్టీల్ ఆసియాలో కూడా పెట్టుబడి పెట్టింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్లోబల్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా ఎదిగింది. 2005లో దీని పేరు ‘టాటా స్టీల్‌‌‌‌’గా మార్చారు.

ప్రస్తుతం టాటా స్టీల్‌‌‌‌కి ఏడాదికి 34 మిలియన్ టన్నుల ఉక్కుని ప్రొడ్యూస్‌‌‌‌ చేసే సామర్ధ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాపారం చేస్తోంది. ఐదు ఖండాల్లో విస్తరించింది. 2021 మార్చి 31 నాటికి కంపెనీ టర్నోవర్‌‌‌‌‌‌‌‌ 1,56,294 కోట్ల రూపాయలు. దీని శతాబ్ది ఉత్సవాల కోసం అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌ వెళ్లారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా తపాలా స్టాంపు కూడా విడుదల చేసింది.