తెలంగాణ కిచెన్​ : ఉదయం బ్రేక్ ఫాస్ట్​, ఈవెనింగ్ శ్నాక్స్​కు బెస్ట్​ అనిపించే టేస్టీ రెసిపీలు

తినాలన్నా ఇష్టం, తినే ఓపిక ఉండాలే కానీ ఎన్ని వెరైటీలైనా తినొచ్చు. రకరకాల రుచులు ఎంజాయ్​ చేయాలంటే పక్క రాష్ట్రాలను పలకరించాలి. అలాగని ఆ రాష్ట్రానికి వెళ్లనక్కర్లేదు. ఇక్కడ ఇచ్చిన ఈ రెసిపీల వైపు  ఓ లుక్కేయండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్​, ఈవెనింగ్ శ్నాక్స్​కు బెస్ట్​ అనిపించే టేస్టీ రెసిపీలు ఈ స్పెషల్స్​ను వండుకు తినేయండి.

స్పినాచ్ - కార్న్​కెసడిల్లా

కావాల్సినవి 

వెన్న : ఒక టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ తరుగు, చీజ్, స్వీట్​ కార్న్ (ఉడికించి) : ఒక్కోటి పావు కప్పు
పాలకూర తరుగు : ఒక కప్పు
ఉప్పు, నీళ్లు : సరిపడా
ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు : రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, చాట్ మసాలా, ఒరెగానో, ఎండుమిర్చి తునకలు : ఒక్కో టీస్పూన్
గోధుమ పిండి : ఒక కప్పు

తయారీ : వెన్న వేడి చేసి అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి కలపాలి. తర్వాత  పాలకూర వేసి ఒకసారి గరిటెతో తిప్పాలి. ఉప్పు, చాట్ మసాలా, ఒరెగానో, ఎండుమిర్చి తునకలు, ఫ్రెష్​ క్రీమ్ లేదా పాలు వేసి కలపాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. చిన్న ఉండలు చేసి చపాతీల్లా వత్తాలి. వాటిని పెనం మీద వెన్నతో కాల్చాలి. కాల్చిన దాని మీద వెన్న, మయోనీస్​ పూసి, రెడీ చేసిన స్టఫింగ్​ పెట్టి మూసేయాలి. తరువాత రెండు నిమిషాలు పెనం మీద కాల్చాక కట్ చేసుకుని హెల్దీశ్నాక్​ను ఎంజాయ్​ చేయడమే తరువాయి.

బేసన్ ఖాండ్వి

కావాల్సినవి 

శెనగపిండి : ఒక కప్పు
పుల్లటి పెరుగు : ముప్పావు కప్పు
నీళ్లు, ఉప్పు : సరిపడా
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ : ఒక టీస్పూన్  
పసుపు : పావు టీస్పూన్
ఇంగువ : చిటికెడు
కొబ్బరి తురుము, కొత్తిమీర : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : ఒక టేబుల్ స్పూన్
కరివేపాకులు : పది
ఆవాలు, ఎండుమిర్చి : ఒక్కో టీస్పూన్
నువ్వులు : రెండు టీస్పూన్లు

తయారీ : పుల్లటి పెరుగులో నీళ్లు పోసి బాగా కలపాలి. అందులోనే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. ఒకవేళ తాజా పెరుగు వాడుతుంటే పులుపు కోసం అర టీస్పూన్ నిమ్మరసం వేయాలి. ఇందులో శెనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండిని బీటర్​తో కలిపితే వంటకం బాగా వస్తుంది. ప్రెజర్​ కుక్కర్​లో నీళ్లు పోసి అందులో పిండి గిన్నె పెట్టాలి. గిన్నె మీద మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత ప్లేట్​లో నూనె పూసి, ఆ పిండిని గరిటెతో ప్లేట్​ మొత్తం పూయాలి. పదినిమిషాలు పక్కన పెట్టాక దానిమీద కొత్తిమీర, కొబ్బరి పొడి చల్లాలి. నిలువుగా కట్ చేసి, గుండ్రంగా చుట్టాలి. బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేగించాలి. ఈ తాలింపును గుండ్రంగా చుట్టిన ఖాండ్విల మీద పోస్తే టేస్టీ శ్నాక్​ రెడీ.

కోల్​కతా చాప్

కావాల్సినవి 

బీట్​రూట్, క్యారెట్ : ఒక్కోటి రెండేసి చొప్పున 
ఆలుగడ్డలు : ఐదు 
పల్లీలు, కొత్తిమీర :
ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు 
నల్ల జీలకర్ర, జీలకర్ర, నల్ల ఆవాలు, సోంఫు : అన్నీ కలిపి ఒక టేబుల్​ స్పూన్
పచ్చిమిర్చి, అల్లం తరుగు : ఒక్కో టేబుల్ స్పూన్ 
మెంతులు : చిటికెడు
ఎండు మిర్చి : రెండు
జీలకర్ర, ధనియాలు, చక్కెర, మిరియాలు : ఒక్కో టీస్పూన్
దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు : ఒక్కోటి చొప్పున
మైదా, కార్న్​ ఫ్లోర్ : ఒక్కోటి పావు కప్పు చొప్పున
బియ్యప్పిండి : అర కప్పు
బ్రెడ్ క్రంబ్స్​ : ఒక కప్పు
లవంగాలు : మూడు
ఉప్పు, నూనె : సరిపడా

తయారీ : సోంఫు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, ఎండు మిర్చిలను నూనె వేయకుండా వేగించాలి. చల్లారాక వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో మెంతులు, నల్ల జీలకర్ర, జీలకర్ర, నల్ల ఆవాలు, సోంఫు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేగించాలి. తర్వాత పొడవుగా తరిగిన బీట్​రూట్, ఆలుగడ్డ, క్యారెట్​ ముక్కలు వేయాలి. వాటిలో ఉప్పు, కొత్తిమీర కలిపి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. చక్కెర, వేగించిన పల్లీలు, తయారు చేసిన మసాలా పొడి వేసి కలపాలి. కాయగూరలు ఉడికాక వాటిని ఒక ప్లేట్​లోకి తీయాలి. ఆపై ఆ మిశ్రమాన్ని మెత్తగా మెదిపి ఉండలుగా చేయాలి. ఒక గిన్నెలో కార్న్​ఫ్లోర్, మైదా, ఉప్పు కలపాలి. మరో గిన్నెలో బ్రెడ్ క్రంబ్స్, బియ్యప్పిండి వేసి కలిపి పక్కనపెట్టాలి. తయారుచేసుకున్న ఉండల్ని మైదా మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ పొడి మిశ్రమంలో దొర్లించాలి. ఈ కోటింగ్  రెండుమూడుసార్లు వేయాలి. నూనె వేడి చేసి అందులో బ్రెడ్​క్రంబ్స్​లో దొర్లించిన ఉండల్ని వేగించాలి. వీటిని కెచప్ లేదా చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.

క్యాబేజీ–క్యారెట్​ కచుంబర్

కావాల్సినవి :

క్యాబేజీ తరుగు : రెండు కప్పులు
క్యారెట్ తరుగు : ఒక కప్పు
నూనె : రెండు టీస్పూన్లు 
ఆవాలు : అర టీస్పూన్ 
ఉప్పు : సరిపడా
ఇంగువ : చిటికెడు
పచ్చిమిర్చి : రెండు
కరివేపాకు : కొంచెం 
పసుపు : పావు టీస్పూన్
చక్కెర, ధనియాలు, జీలకర్ర పొడి : ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
నిమ్మరసం : రెండు టీస్పూన్లు

తయారీ : నూనె వేడి చేసి ఆవాలు, ఇంగువ వేయాలి. ఆవాలు వేగాక అందులో కరివేపాకు తరుగు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత పసుపు, సన్నగా, పొడవుగా తరిగిన క్యాబేజీ, క్యారెట్ తరుగు, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి. రెండు నిమిషాలు అవి ఉడికాక, అందులో చక్కెర, ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పొడి కూడా వేసి కలపాలి. నిమ్మరసం చల్లి ఒక నిమిషం ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. 

గోధుమపిండితో పిజ్జా

కావాల్సినవి :

గోధుమపిండి : ఒక కప్పు 
పెరుగు : పావు కప్పు
బేకింగ్ సోడా, ఎండు మిర్చి తునకలు : ఒక్కోటి అర టీస్పూన్
ఉప్పు, నీళ్లు, మొజరెల్లా చీజ్, మొక్కజొన్న గింజలు, చీజ్ : సరిపడా
నూనె, పిజ్జా సాస్ : ఒక్కో టేబుల్ స్పూన్
చక్కెర : ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల క్యాప్సికమ్​ : ఒక్కోటి 
మష్రూమ్​లు : రెండు
మిక్స్​డ్ హెర్బ్స్, ఒరెగానో : ఒక్కో టీస్పూన్ (సూపర్​ మార్కెట్​, ఆన్​లైన్​లో దొరుకుతాయి)

తయారీ : గోధుమపిండి, బేకింగ్ సోడా, ఉప్పు, చక్కెర, ఎండు మిర్చి తునకలు, మిక్స్​డ్ హెర్బ్స్, నూనెల్ని ఒక గిన్నెలో వేయాలి. తరువాత అందులో నీళ్లు పోసి మెత్తటి పిండిముద్దగా కలపాలి. ఆ పిండి ముద్దను చిన్న ఉండలు చేసి చపాతీల్లా వత్తాలి. ఒత్తిన చపాతీల మీద ఫోర్క్​తో గుచ్చాలి. ​ పెనం​ మీద చపాతీలను వేసి నెయ్యితో కాల్చాలి. అవి కాస్త కాల్చాక పైన పిజ్జాసాస్ పూసి, మొజరెల్లా చీజ్ చల్లి, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల క్యాప్సికమ్, ఉల్లిగడ్డ​ తరుగు పెట్టాలి. పైనుంచి మొక్కజొన్న గింజలు, ఎండు మిర్చి తునకలు, ఒరెగానో చల్లి మూతపెట్టి ఉడికించాలి. సింపుల్​గా తయారయ్యే ఈ పిజ్జా చాలా హెల్దీ.