తెలంగాణ కిచెన్ : ఈ సారి మటన్​ ఇలా ట్రై చేయండి

నాన్​వెజ్​ లవర్స్​ను ‘నాన్​ వెజ్​ స్పెషల్స్ ఎట్లుండాలి?’ అని అడిగితే.. స్పైసీ, జ్యూసీ... అంటూ మాటలతోనే ముక్కలు తిన్నంత హడావిడి చేస్తారు. వీళ్లకు రెగ్యులర్​గా వెరైటీలు నోటికి ఆనవు! ఎప్పటికప్పుడు వెరైటీ రెసిపీస్​ ట్రై చేయాలనుకుంటారు. అందుకే ఈ సారి మటన్​ రెసిపీస్​ చేసుకునేటప్పుడు ఇవి ట్రై చేయండి. బోటీ మసాలా ఫ్రై, మటన్ ఘీ రోస్ట్, ఖట్టర్ పంతీ మటన్ కర్రీ... వంటి స్పెషల్స్​తో పండుగ చేసుకోండి.

బోటి పెప్పర్ ఫ్రై

కావాల్సినవి :

బోటి - అర కిలో
చిన్న ఉల్లిగడ్డలు (షాలెట్స్) - 25
అల్లం - రెండు చిన్న ముక్కలు
వెల్లుల్లి (పెద్దవి) - ఐదు రెబ్బలు
పచ్చిమిర్చి - మూడు
టొమాటో - రెండు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి- ఒకటిన్నర టేబుల్ స్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు, నీళ్లు - సరిపడా
కరివేపాకు - కొంచెం

తయారీ : బోటిని శుభ్రంగా కడిగి, ముక్కలుగా తరగాలి. తరిగిన ముక్కల్ని  ప్రెజర్​ కుక్కర్​లో వేయాలి. అందులో పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి.. నీళ్లు పోసి మరోసారి కలపాలి. కుక్కర్​ మూత పెట్టి ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేగించాలి. వెల్లుల్లి, అల్లం కచ్చాపచ్చాగా దంచి అందులో వేయాలి. అవి వేగాక టొమాటో ముక్కలు కూడా వేయాలి. అవన్నీ బాగా వేగాక ఉడికించిన బోటి ముక్కలు కూడా కలపాలి. నీరు ఇంకిపోయి మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. మిరియాల పొడి, గరం మసాలా వేసి ఐదు నిమిషాలు వేగించాలి. మరికొద్దిగా కరివేపాకు వేసి ఐదు నిమిషాలు వేగిస్తే టేస్టీగా.. గరంగరంగా బోటి పెప్పర్ ఫ్రై రెడీ. 

ఖట్టర్​ పంతీ మటన్

కావాల్సినవి : 

మటన్ - కేజీ
ఎండు మిర్చి - ఆరు
ఉప్పు - సరిపడా 
ధనియాల పొడి - ఒక టీస్పూన్
జీలకర్ర పొడి, మిరియాల పొడి - ఒక్కోటి అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు - ఒక కప్పు
నూనె - ఐదు టేబుల్ స్పూన్లు
షాజీరా - ఒక టీస్పూన్ 
జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల యాలక్కాయ, బిర్యానీ ఆకు - ఒక్కోటి 
యాలకులు - నాలుగు
లవంగాలు - ఐదు 
ఉల్లిగడ్డలు - ఆరు 
కొత్తిమీర కాడలు - కొన్ని 
పచ్చిమిర్చి - పది  
పిస్తాపప్పులు - కొన్ని 
గరం మసాలా - ఒక టీస్పూన్ 
కొత్తిమీర - కొంచెం

తయారీ : గిన్నెలో మటన్​, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మిరియాలపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి అరగంట పక్కన పెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల యాలక్కాయ, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, షాజీరా వేసి వేగించాలి. అవి వేగాక, అందులో మటన్ కలపాలి. అలా పావుగంట ఉడికించాలి. 

మరో పాన్​లో ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, పిస్తాపప్పులు, కొత్తిమీర కాడలు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్​ని మటన్​ మిశ్రమంలో వేసి కలపాలి. ఎక్కువ మంట మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత రెండున్నర కప్పులు నీళ్లు పోసి మూతపెట్టి మంటను అడ్జస్ట్​ చేసుకుంటూ దాదాపు గంటసేపు ఉడికించాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లితే సరికొత్త రుచితో ‘వావ్’​ అనిపిస్తుంది ఈ మటన్ కర్రీ.

మటన్ ఘీ రోస్ట్

కావాల్సినవి :

మటన్ - అర కిలో
నెయ్యి - రెండున్నర టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - సరిపడా
ఎండు మిర్చి - పది
నూనె - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర, మిరియాలు - ఒక్కో టీస్పూన్
ధనియాలు - రెండు టీస్పూన్లు
సోంఫు - అర టీస్పూన్
దాల్చిన చెక్క, అనాస పువ్వు - ఒక్కోటి
లవంగాలు - నాలుగు
కరివేపాకు - కొంచెం
చిన్న ఉల్లిగడ్డలు (షాలెట్స్) - పది

తయారీ : ప్రెజర్ కుక్కర్​లో నెయ్యి వేడి చేసి అందులో మటన్ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత ఒక టీస్పూన్ అల్లం - వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మళ్లీ ఒకసారి కలపాలి. నీళ్లు పోసి మూతపెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. పాన్​లో నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంఫు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిగడ్డలు వేగించాలి. వీటిని మిక్సీ జార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అదే పాన్​లో నెయ్యి వేడి చేయాలి. గ్రైండ్ చేసిన పేస్ట్​ కలపాలి. అందులో మరో టీస్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలపాలి. మిశ్రమం దగ్గరపడ్డాక ఉడికించి మటన్ కూడా వేసి కలపాలి. చివర్లో కరివేపాకు వేసి నీళ్లు ఇంకిపోయేవరకు ఉడికించాలి. నోరూరించే మటన్ ఘీ రోస్ట్​ తినడమే.