వేములవాడ/చందుర్తి, వెలుగు: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి వద్ద 70 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ దాడిలో బియ్యంతోపాటు రెండు వాహనాలను సీజ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం తరలిస్తున్నారని జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ సదన్ కుమార్, ఎస్సై సుధాకర్‌కు సమాచారం అందింది.
ఈమేరకు సంకెపల్లి వద్ద రెండు వాహనాలను పట్టుకుని, బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా హుజూరాబాద్ మండలం సిరసపల్లి గ్రామానికి డీలర్ రాజు వద్ద బియ్యం సేకరించి చందుర్తి మండలం ఎన్గల్ శివారులోని ఎస్ఆర్ఆర్ ఇండస్ట్రీస్ రైస్ మిల్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఎస్ఆర్ఆర్ రైస్ మిల్లుపై దాడులు చేసి 334 బ్యాగుల రేషన్ బియ్యం సీజ్ చేసి జిల్లా సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో మొత్తం 240 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు తెలిపారు. ఐదుగురిపై వేములవాడ టౌన్ పీఎస్‌లో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.