నకిలీ విత్తనాలపై టాస్క్​ఫోర్స్ యాక్షన్​

కరీంనగర్, వెలుగు: పదేండ్లుగా రాష్ట్రంలో పాతుకుపోయిన అక్రమ దందాలకు చెక్​ పెట్టేందుకు, అక్రమార్కుల ఆటకట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను రంగంలోకి దింపింది. భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్​, గంజాయి, కల్తీ వస్తువులు, నకిలీ విత్తనాలు వంటి దందాల్లో ఎవరున్నా అధికారులు వదలడం లేదు. ఎక్కడికక్కడ వరుస దాడులు చేస్తూ.. నిందితులను అరెస్టు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులను ఇక్కట్లపాలు చేస్తున్న అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్న సీఎం రేవంత్​రెడ్డి.. ఈక్రమంలో పొలిటికల్​ ప్రెజర్​ ఉండదని, ఫ్రీ హ్యాండ్ తో ముందుకు వెళ్లాలని చెప్పడంతో ఉన్నతాధికారులు దూకుడు పెంచారు. 

పునాస సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో నకిలీ విత్తనాలపై ప్రభుత్వం నజర్ పెట్టింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దింపింది. ఇటీవల ఐదు జిల్లాల్లో దాడులు నిర్వహించగా.. ఏడు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు దొరికాయి. రూ.1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్ చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఎక్కువ మొత్తంలో కాటన్ సీడ్స్ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అత్యధికంగా 35 క్వింటాళ్ల నిషేధిత హెచీ కాటన్ సీడ్స్ దొరకగా, నారాయణపేట జిల్లాలో 8 క్వింటాళ్లు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని శామీర్  పేట్ లో 12 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో 15.56 క్వింటాళ్లు, ఇదే జిల్లా దౌల్తాబాద్ లో 7.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, యాలలో 0.3 క్వింటాళ్ల సీడ్స్ ను అధికారులు సీజ్ చేశారు.