స్టార్టప్​ : అరటి వేస్ట్​తో హ్యాండీక్రాఫ్ట్స్​

బనానా వేస్ట్​ వల్ల వ్యవసాయ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు చూశారు. ఎందుకూ పనికిరాని ఆ వేస్ట్‌‌లోనే వాళ్లు ఫ్యూచర్​ని వెతుక్కున్నారు. అందుకే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకేసారి ఉద్యోగాలకు గుడ్​బై చెప్పి ఎంట్రపెన్యూర్లుగా కొత్త జీవితాలను మొదలుపెట్టారు. చివరకు బనానా వేస్ట్​ని పనికొచ్చే వస్తువులుగా మార్చడంలో సక్సెస్​ అయ్యారు. వాళ్లు పెట్టిన స్టార్టప్​ వల్ల ఎంతోమంది రైతులు లాభం పొందుతున్నారు. పర్యావరణానికి మేలు కలుగుతోంది. 

జగత్ కళ్యాణ్​ది బీహార్‌‌లోని హాజీపూర్‌‌ గ్రామం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన జగత్​ పచ్చని పొలాల్లో ఆడుకుంటూ పెరిగాడు. అప్పుడప్పుడు అమ్మానాన్నలతో కలిసి పొలానికి వెళ్లి, సాయం చేస్తుండేవాడు. వాళ్ల ప్రాంతంలో అరటినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. వాళ్ల కుటుంబానికి కూడా అరటి పంటే ఆధారం. పంట చేతికొచ్చేవరకు కుటుంబం అంతా రాత్రింబవళ్లు కష్టపడేది. అరటి పండించడానికి తొమ్మిది నెలలు పడుతుంది. తొమ్మిదో నెలలో గెలలు  కోస్తారు. చెట్టు దాని లైఫ్​ సైకిల్​లో ఒక్కసారి మాత్రమే కాయలు కాస్తుంది. ఆ తర్వాత చెట్టు ఎందుకూ పనికిరాని వేస్ట్​గా మారిపోతుంది. దాంతో చెట్లన్నింటినీ నరికి పొలంలో ఒక మూలకు కుప్పగా వేసేవాళ్లు. అరటి గెలలు కోయడం కంటే చెట్లను నరికి, ఒకచోట వేయడానికి బాగా కష్టడాల్సి వచ్చేది. పైగా మళ్లీ పంట వేసే టైంకి వాటిని క్లియర్ చేయడం పెద్ద తలనొప్పిగా మారేది. ఆ కష్టాలను చూస్తూ పెరిగిన జగత్​ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలి అనుకునేవాడు. 

30 మంది రైతుల నుంచి

ఈ స్టార్టప్ ద్వారా ప్రస్తుతం 30 మంది స్థానిక రైతుల నుంచి అరటి వేస్ట్​ని సేకరిస్తున్నారు. “చెట్టు సైజును బట్టి ఒక్కో చెట్టుకు 5 నుంచి 25 రూపాయల వరకు ఇస్తున్నారు. కానీ.. కొందరు రైతులు డబ్బులు తీసుకోవడం లేదు. ఎందుకంటే.. పొలంలో నుంచి వేస్ట్​ని ఫ్రీగా తీసుకెళ్తే చాలు అనుకుంటున్నారు. వీళ్లు ఆ వేస్ట్​ని తీసుకెళ్లడం వల్ల రైతులకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.

జీరో వేస్ట్​

అరటి చెట్టు నుంచి వచ్చే వేస్ట్​ని పూర్తిగా వాడుకుంటున్నారు. ముందుగా చెట్టు కాండం నుంచి ఫైబర్‌‌ను తీస్తారు. దాంతో ఫోల్డర్లు, యోగా మ్యాట్లు​, బాస్కెట్లు, కుషన్ కవర్లు, కోస్టర్లు లాంటి రకరకాల ప్రొడక్ట్స్​ తయారుచేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు అన్ని ప్రక్రియల్లో జీరో-వేస్ట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే ఫైబర్​ తీసిన తర్వాత మిగిలిపోయిన గుజ్జును హై క్వాలిటీ వర్మీకంపోస్ట్‌‌గా ప్రాసెస్ చేస్తున్నారు. గుజ్జు నుంచి వచ్చే లిక్విడ్​లో పొటాషియం, ఐరన్​ లాంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దాన్ని సహజ ఎరువుగా మారుస్తున్నారు.  ఇలా బనానా వేస్ట్​తో  వస్తువులు తయారుచేసేవాళ్లు మనదగ్గర కూడా ఉన్నారు. 

నెలకు 600 కిలోలు

జీరో వేస్ట్​ కాన్సెప్ట్‌‌, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్​ నచ్చడంతో చాలామంది బనానా ఫైబర్​ ప్రొడక్ట్స్​ వాడేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో ప్రతి సంవత్సరం డిమాండ్​ పెరుగుతోంది. పోయిన ఫైనాన్షియల్​ ఇయర్​లో 50 లక్షల రూపాయల టర్నోవర్‌‌ అయ్యింది. ప్రస్తుతం ప్రతి నెలా 600 కిలోల ఫైబర్​ని తయారుచేస్తున్నారు. ఆఫ్‌‌లైన్, ఆన్‌‌లైన్ మార్కెటింగ్ ద్వారా కేరళ, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్ముతున్నారు. కంపెనీ మార్కెటింగ్, అమ్మకాలను చూసే సత్యం మాట్లాడుతూ “ఇండియాలో మార్కెట్ బేస్‌‌ను బాగా డెవలప్​ చేయగలిగాం.

ఇప్పుడు ఎక్స్​పోర్ట్స్​ చేయడానికి కూడా రెడీ అయ్యాం. మరో రెండు మూడు నెలల్లో ఇతర దేశాలకు ఎగుమతులు మొదలుపెడతాం. చాలా కంపెనీలు అగ్రికల్చర్​ వేస్ట్​ మీద పనిచేస్తున్నప్పటికీ మా జీరో- వేస్ట్ విధానం వల్లే మార్కెట్‌‌లో సక్సెస్​ అయ్యాం”అన్నాడు. జగత్, సత్యం, నితీష్​లు బిజినెస్​ చేయడమే కాదు. ఎంతో మంది రైతులకు, పర్యావరణానికి మేలు చేస్తూ పచ్చని భవిష్యత్తుకు  బాటలు వేస్తున్నారు. 

ఇలా మొదలైంది.. 

జగత్..​ ఇంజనీరింగ్, ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత వాతావరణ మార్పులు, ఎన్విరాన్​మెంట్ మీద పనిచేస్తున్న ఒక స్టార్టప్‌‌లో ఉద్యోగం సంపాదించాడు. ఏడాదిపాటు అక్కడ పనిచేసిన తర్వాత అతనికి టాంజానియా, దుబాయ్‌‌లోని కంపెనీల నుంచి జాబ్​ ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్లను తీసుకునే బదులు జగత్ తన సొంత రాష్ట్రం బీహార్‌‌లోనే ఒక సస్టైనబుల్​ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన జర్నీ గురించి మాట్లాడుతూ ‘‘జాబ్​ చేసేటప్పుడు శాలరీ బాగానే వచ్చేది. కానీ..  నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. జాబ్​ చేస్తే.. 10 నుంచి12 గంటల పాటు పని చేయాలి.

అదే టైంని బిజినెస్​ చేయడానికి కేటాయిస్తే.. డబ్బు సంపాదించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి ఇవ్వొచ్చు అనిపించింది. నా కాలేజీ ఫ్రెండ్స్​ సత్యం కుమార్​, నితీష్ వర్మ కూడా నాతోపాటే పనిచేసేవాళ్లు. వాళ్లతో నా ఆలోచన చెప్తే.. వాళ్లు కూడా ఉద్యోగం మానేసి ఏదైనా స్టార్టప్​ పెట్టాలి అనుకుంటు న్నట్టు చెప్పారు. అప్పటినుంచి ముగ్గురం కలిసి ఎలాంటి బిజినెస్​ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? అని రీసెర్చ్​ చేయడం మొదలు పెట్టాం. రకరకాల బిజినెస్​ల గురించి తెలుసుకున్నాం. కానీ.. మాకు లాభాలు ఒక్కటే ముఖ్యం కాదు. మా పని ద్వారా నలుగురికి మంచి జరగాలి అనుకున్నాం.

నాకు చిన్నప్పటినుంచే అరటి వేస్ట్​ మీద అవగాహన ఉంది. కాబట్టి.. దానిమీద రీసెర్చ్ చేశాం. చివరకు అరటి వేస్ట్​తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. మా బిజినెస్​కు కావాల్సిన ముడిసరుకు మా ప్రాంతం హాజీపూర్​లోనే కావాల్సినంత దొరుకుతుంది. పైగా మా స్టార్టప్​ సక్సెస్​ అయితే.. మా కుటుంబం ఎప్పుడూ ఎదుర్కొనే వేస్ట్​ సమస్యకు చెక్​ పెట్టొచ్చు అనుకున్నా. రీసెర్చ్​ పూర్తయ్యాక చివరగా ముగ్గురం ఉద్యోగాలు వదిలేసి 2021లో ‘తరువార్​ ఆగ్రో’ పేరుతో స్టార్టప్​  పెట్టాం” అని చెప్పుకొచ్చాడు జగత్​​. అరటి వేస్ట్​ని విలువైన ప్రొడక్ట్స్​గా మార్చడంతో అటు పర్యావరణానికి మేలు కలగడంతోపాటు మరోవైపు కంపెనీకి, రైతులకు లాభాలు కూడా వస్తున్నాయి. 

మనమే నెంబర్​ వన్​

ప్రపంచవ్యాప్తంగా అరటి పండ్లను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియానే టాప్​లో ఉంది. మన దేశంలో సంవత్సరానికి దాదాపు 14.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. కానీ.. పంట కోసిన తర్వాత అంతకంటే ఎక్కువ.. దాదాపు 60 శాతం బయోమాస్ వేస్ట్​గా మిగిలిపోతుంది. ఆ వేస్ట్​ని సంపదగా మార్చడానికే ‘తరువార్ ఆగ్రో’ని స్థాపించాడు జగత్​. దాని ద్వారా అరటి చెట్ల వ్యర్థాలతో హాండీ​క్రాఫ్ట్స్, శానిటరీ ప్యాడ్స్​ లాంటివి తయారుచేస్తున్నారు.