తైవాన్​ను చైనాలో కలిపేసుకుంటం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: జిన్​పింగ్

  • తైవాన్, చైనా వేర్వేరు కావని వెల్లడి

బీజింగ్/తైపీ: తైవాన్‌‌‌‌ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని చైనా ప్రెసిడెంట్​ జిన్‌‌‌‌పింగ్ అన్నారు. చైనా, తైవాన్ రెండు వేర్వేరు దేశాలు కావని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ జిన్​పింగ్ మాట్లాడారు. ‘‘తైవాన్ జలసంధికి ఇరువైపులా (చైనా, తైవాన్) ఉన్న చైనా ప్రజలంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు. చైనాలో తైవాన్‌‌‌‌ అంతర్భాగం. మాతృభూమి పునరేకీకరణను ఎవరూ ఆపలేరు. అందుకే తైవాన్‌‌‌‌ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినం’’అని జిన్​పింగ్ అన్నారు. గత ఏడాది నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లోనూ జిన్​పింగ్ ఈ తరహా కామెంట్లే చేశారు. 


తైవాన్​ను చైనాలో కలిపేసుకుంటామని ప్రకటించారు. దీనికి ఇరువైపులా ఉన్న ప్రజలంతా కట్టుబడి ఉండాలని ఆదేశించారు. తాజాగా మళ్లీ అవే కామెంట్లు చేయడంతో దుమారం చెలరేగుతున్నది.

డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నం: తైవాన్

చైనా నుంచి ముప్పు నేపథ్యంలో తమ డిఫెన్స్ బడ్జెట్​ను పెంచుకుంటామని తైవాన్ అధ్యక్షుడు లాయ్‌‌‌‌ చింగ్‌‌‌‌ తె ప్రకటించారు. జిన్​పింగ్ చేసిన పునరేకీకరణ కామెంట్లను ఖండించారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. దీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్ధంగా ఉండాలి. అందుకోసమే డిఫెన్స్ బడ్జెట్​ను పెంచాలని నిర్ణయించుకున్నాం. చైనా నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది’’ అని లాయ్ చింగ్ తె తెలిపారు.