సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ దేశం విడిచి పెట్టినట్లు రష్యా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే అసద్ ఎక్కడున్నారో అనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు. సిరియాలోని రష్యా సైనిక స్థావరాలను హై అలెర్ట్ చేశామని ప్రస్తుతానికి వాటికి ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. సిరియాలో హింసాత్మక చర్యలను నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సిరియాలో తిరుగుబాటు దారులు రాజధాని డమాస్కస్ ను స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లినట్టు ప్రచారం సాగుతుంది. మరోవైపు బషర్ ప్రయాణిస్తున్న విమానం రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.. ఈ క్రమంలో రష్యా ఈ ప్రకటన చేసింది.
దాదాపు పదేళ్లుగా సిరియాలో అంతర్గత కల్లోలం కొనసాగుతోంది. 2015 నుంచి ప్రభుత్వానికి అండగా సిరియా లో రష్యా బలగాలను మోహరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి పెట్టింది. అయినప్పటికీ సిరియాలో తన సైనిక స్థావరాలను కొనసాగిస్తోంది.
దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధంలో సిరియా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత కొంతకాలంగా అల్లర్లు తగ్గాయనుకుంటుండగా.. మరోసారి తిరుగుబాటు దారులు రెచ్చిపోయారు. తాజాగా సిరియాలో ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ.. ఆదివారం దేశ రాజధాని డమాస్కస్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరియా అధ్యక్షుడు బసర్ దేశం విడిచి పోవాల్సి వచ్చింది.