- డమాస్కస్ను ఆక్రమించిన తిరుగుబాటుదారులు
- అధ్యక్ష భవనాన్ని లూటీ చేసిన జనం
- అసద్ తండ్రి విగ్రహం తల తీసి ఈడ్చుకెళ్తూ వేడుకలు
- 13 ఏండ్ల అంతర్యుద్ధం.. 12 రోజుల్లో ముగింపు
డమాస్కస్: పశ్చిమాసియాలోని సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్(59) సర్కారు కుప్పకూలింది. రాజధాని డమాస్కస్ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ తిరుగుబాటుదారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం రెబెల్ ఫైటర్స్ డమాస్కస్ ను చుట్టుముట్టడంతో అధ్యక్షుడు అసద్ మిలిటరీ ప్లేన్ ఎక్కి సురక్షిత ప్రాంతానికి పారిపోయారు. అసద్‌తో పాటు డిఫెన్స్ మినిస్టర్ అలీ మహ్మద్ అబ్బాస్ కూడా డమాస్కస్ నుంచి పరారయ్యారు. దీంతో డమాస్కస్ లోని ప్రెసిడెంట్ ప్యాలెస్, రక్షణ శాఖ ఆఫీస్ సహా అన్ని ప్రాంతాలను ఆ తర్వాత హయత్ తహ్రీర్ అల్ షమ్(హెట్టీఎస్) సంస్థ ఆధ్వర్యంలోని రెబెల్ ఫైటర్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ జవాన్లు, పోలీసులు ఆయుధాలు, యూనిఫాంలు విడిచిపెట్టి పరారయ్యారు. వీరిలో కొంత మందిని రెబెల్స్ బందీలుగా పట్టుకున్నారు. దీంతో సిరియన్ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మహ్మద్ ఘాజీ అల్ జలాలీ వెల్లడించారు.
శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేయాలని ఆదేశించిన తర్వాత అధ్యక్షుడు అసద్ గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపారు. జలాలీని సిరియాకు ఆపద్ధర్మ పాలకుడిగా నియమిస్తున్నట్టు రెబెల్స్ ప్రభుత్వ టీవీ చానెల్ ద్వారా ప్రకటించారు. అసద్ సర్కారు రెబెల్స్‌ను చిత్రహింసలు పెట్టేందుకు వినియోగించిన సేద్నయా ప్రిజన్ తో సహా డమాస్కస్, హమా, అలెప్పోలోని జైళ్ల నుంచి ఖైదీలను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, అసద్ సర్కారు కూలిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. భద్రతా బలగాలు విడిచిపెట్టి వెళ్లిన ఆయుధాలతో గాలిలోకి కాల్పులు జరుపుతూ యువత సందడి చేశారు. డమాస్కస్‌లోని బషర్ అల్ అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ విగ్రహాన్ని ఆందోళనకారులు కూల్చివేశారు. ప్రెసిడెంట్ ప్యాలెస్‌లోకి జనం దూసుకెళ్లారు. అసద్ ఫ్యామిలీ చిత్రపటాలను ధ్వంసం చేస్తూ, అందిన వస్తువునల్లా ఎత్తుకెళ్లారు.
5 దశాబ్దాల నియంతృత్వానికి తెర..
సున్నీలు మెజార్టీగా ఉన్న సిరియాలో షియా వర్గంలోని అలవీట్ తెగకు చెందిన అసద్‌ల కుటుంబం 5 దశాబ్దాలుగా నియంతృత్వ పాలన కొనసాగించింది. 2000 సంవత్సరంలో హఫీజ్ అసద్ మరణంతో ఆయన కొడుకు బషర్ అల్ అసద్ అయిష్టంగానే దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో తిరుగుబాటు మొదలుకాగా, రష్యా, ఇరాన్ అండతో అణచివేశారు. హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా అసద్‌కు బాసటగా నిలిచారు. అప్పటి నుంచి జరిగిన అంతర్యుద్ధంలో ఐదారు లక్షల మంది బలైపోయారు. 13 ఏండ్ల పాటు కొనసాగిన ఈ అంతర్యుద్ధం ఆదివారం అసద్ పరారీతో ముగిసినట్టయింది.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తీవ్రంగా నష్టపోవడం.. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఆత్మ రక్షణలోకి జారుకోవడం.. హెజ్బొల్లా గ్రూపు దెబ్బతినడంతో దీనిని అవకాశంగా మలచుకున్న హయత్ తహ్రీర్ అల్ షమ్ ఆధ్వర్యంలోని రెబెల్స్ నవంబర్ 27న దాడులు మొదలుపెట్టారు. దేశంలోని ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ తిరుగుబాటుదారులు కదం తొక్కారు. 12 రోజుల్లోనే డమాస్కస్ను కంట్రోల్లోకి తెచ్చుకుని అసద్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు.
రెబెల్స్‌కు నరకకూపం సేద్నయా జైలు
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ 13 ఏండ్ల పాలనకు తెరదించిన నేపథ్యంలో ఆ దేశ జైళ్ల నుంచి ఖైదీలను తిరుగుబాటుదారులు విడుదల చేశారు. 2011 నుంచి వివిధ జైళ్లలో దుర్భర జీవితం గడిపిన సిరియా పౌరులకు విముక్తి కల్పించారు. డమాస్కస్, హమా, అలెప్పో నగరాలకు సమీపంలో ఆ జైళ్లను నిర్మించారు. వాటిలో సేద్నయా మిలిటరీ జైలు రెబెల్స్ పాలిట నరకకూపంగా పేరొందింది. ఈ జైలుకు తీసుకెళితే చావు తప్పదని, శవం కూడా బయటకు రాదని రెబెల్స్ చెప్పారు. గత 14 ఏండ్లలో సిరియాలోని జైళ్లలో మొత్తం లక్ష మందిని ఉరితీయగా ఒక్క సేద్నయా జైలులోనే 30 వేల మందిని చంపేశారని యూకేకు చెందిన సిరియన్ మానవ హక్కుల సంస్థ తెలిపింది.
‘‘బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిని వివిధ జైళ్లలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ముఖ్యంగా సేద్నయా జైల్లో ఖైదీల పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఈ జైల్లో రెడ్ బిల్డింగ్, వైట్ బిల్డింగ్ డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి అరెస్టయిన వారిని రెడ్ బిల్డింగ్ లో ఉంచేవారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఆఫీసర్లు, సైనికులను వైట్ బిల్డింగ్ లో ఉంచేవారు.
రెడ్ బిల్డింగ్ లో ఉన్న ఖైదీలను వేల సంఖ్యలో వైట్ బిల్డింగ్ కు తీసుకెళ్లి రహస్యంగా ఉరితీశారు. ఖైదీలను మధ్యాహ్నం సెల్ నుంచి తీసుకెళ్లేవారు. మరో జైలుకు పంపిస్తున్నామని చెప్పి ఖైదీలను రెడ్ బిల్డింగ్ లోని బేస్ మెంట్ కు తీసుకెళ్లేవారు. అక్కడ ఖైదీలను రెండు మూడు గంటలపాటు చిత్రహింసలు పెట్టేవారు. అర్ధరాత్రి బాధితుల కళ్లకు గంతలు కట్టి ట్రక్కుల్లో వైట్ బిల్డింగ్ కు తీసుకెళ్లేవారు. ఆ బిల్డింగ్ లో ఖైదీలను ఓ బేస్ మెంట్ గదికి తీసుకెళ్లి ఉరితీసేవారు” అని సిరియన్ మానవ హక్కుల సంస్థ ఓ రిపోర్టులో వెల్లడించింది.
రష్యాకు గట్టి ఎదురుదెబ్బ..
బషర్ అసద్ సర్కారు కూలిపోవడంతో రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఉక్రెయిన్ యుద్ధంతో బలహీనమైన రష్యాకు ఇప్పుడు సిరియాలోని తన ఆర్మీ, నేవల్ బేస్ లను కూడా మూసివేసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. అలాగే పశ్చిమాసియాలో రష్యా ఆధిపత్యాన్ని ఈ పరిణామం మరింత తగ్గించినట్టయింది. అయితే, సిరియాలో తిరుగుబాటు ఆమోద యోగ్యం కాదని రష్యా రక్షణ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చేతికి దేశం వెళ్లడం మంచిది కాదన్నారు. దీనిపై ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, రష్యా, ఇరాన్‌కు అసద్ పట్ల ఆసక్తి పోయినందుకే ఆయనను పట్టించుకోలే దని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా, ఇజ్రాయెల్‌తో వైరంతో ఇరాన్ ఇబ్బంది పడుతుండడంతో అసద్‌కు సాయం చేయలేక పోయిందన్నారు. ఇప్పటికైనా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేయాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు కోవాలని పుతిన్‌కు ఆయన పిలుపునిచ్చా రు. ఇక, సిరియా నుంచి వచ్చిన లక్షలాది మంది శరణార్థులను తిరిగి పంపేందు కు ఎదురుచూస్తున్న తుర్కియేకు అసద్ సర్కా రు కూలిపోవడం అనుకూలంగా మారింది. శాంతియుతంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆ దేశం ఆకాంక్షించింది.
ప్రెసిడెంట్ ఇంట్లో తిరుగుబాటుదారులు, జనం
డమాస్కస్ను కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత సిరియా తిరుగుబాటుదారులు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి చేరుకున్నారు. అప్పటికే ప్రెసిడెంట్ అసద్ పారిపోవడంతో బిల్డింగ్ లోపల గోడలకు వేలాడుతున్న ఆయన ఫ్యామిలీ ఫొటోలను పగలగొట్టారు. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నియంత అసద్ పాలన ముగిసిందని తిరుగుబాటుదా రులు నినాదాలు చేశారు. డమాస్కస్ ఫ్రీ అయిందని ప్రకటించారు. అసద్ తండ్రి హఫీజ్విగ్రహాన్ని కూల్చేసి విగ్రహం తలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు.
అధ్యక్షుడి విమానం కూల్చివేత ?
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డమాస్కస్ ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న సమయంలోనే అసద్ విమానంలో పారిపోయారు. విమానం సిరియా తీర ప్రాంతంవైపు బయలుదేరి, సడెన్ గా రూటు మార్చి అపొజిట్ డైరెక్షన్ లో ప్రయాణించింది. ఆ తర్వాత కాసేపటికే 3,650 అడుగుల ఎత్తులో నుంచి విమానం 1,070 అడుగులకు పడిపోయింది.
ఆ తర్వాత హోమ్స్ సిటీ సమీపంలో రాడార్ పై కనిపించకుండా పోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ల ద్వారా తెలుస్తోంది. దీంతో అసద్ విమానం కూలిపోయిందని, తిరుగుబాటుదారులే కూల్చేసి ఉంటారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. విమానం ఎత్తు సడెన్ గా పడిపోవడానికి క్రాష్ ల్యాండింగే కారణమని ఈజిప్ట్ జర్నలిస్టు కలీద్ మహమ్మద్ ట్వీట్ చేశారు. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ప్రభుత్వాన్ని కూల్చింది ఇతనే..
అబూ మొహమ్మద్ అల్ గోలానీ.. సిరియాలో ఇప్పుడు ఇతను హీరో. బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో గోలానీ ప్రధాన పాత్ర పోషించాడు. ముందుండి తిరుగుబాటు ఉద్యమాన్ని నడిపించాడు. 24 ఏండ్ల పాటు సిరియాను నిరంకుశంగా పాలించిన బషర్ అజ్ఞాతంలోకి పారిపోవడానికి కారణమయ్యాడు. గోలానీ ప్రస్తుతం సిరియాలో హయత్ తహ్రిర్ అల్ షామ్ (హెచ్ టీఎస్) కు చీఫ్‌గా ఉన్నాడు.
సిరియాలో హెచ్ టీఎస్ బలమైన ఇస్లామిక్ గ్రూప్. గతంలో అల్ కాయిదాతో ఈ సంస్థకు సంబంధాలు ఉండేవి. 2018లో హెచ్ టీఎస్ ను అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థగా అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా గోలానీ మీద రూ.85 కోట్ల రివార్డు కూడా ప్రకటించింది. కాగా.. అమెరికాకు చెందిన సీఎన్ఎన్ చానెల్ తో గోలానీ గతంలో మాట్లాడాడు. సిరియాలో తిరుగుబాటు ప్రధాన ఉద్దేశం అసద్ పాలనకు తెరదించడమే అని అతను తెలిపాడు. అసద్ పాలన ముగిశాక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజలు ఎంచుకునే వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించాడు.