తెలంగాణ కిచెన్ : వింటర్​ మెను తింటే ఇలా

చలికాలంలో కరకరలాడేవి లేదా వేడివేడిగా ఉండేవి ఏవైనా తినాలనిపిస్తుంది. ఇంకొందరికేమో వాతావరణం చల్లగా ఉన్నా పర్వాలేదు స్వీట్​గా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది. ఎవరికి ఏ  టేస్ట్​ కావాలంటే అవి తినొచ్చు. స్వీట్ తింటే కేలరీలు పెరిగిపోతాయనో లేదా ఆరోగ్యం దెబ్బ తింటుందనో ఆలోచించాల్సిన అవసరంలేదు. ఈ వెరైటీలు తిని చూస్తే అసలు విషయం మీకే తెలిసిపోతుంది.

మేతీ - ముర్​మురా పకోడి

కావాల్సినవి : 

మరమరాలు -ఒక కప్పు 
 

మెంతి కూర - ఒకటిన్నర కప్పు
 

ఉల్లిగడ్డ తరుగు, నీళ్లు, నువ్వులు - ఒక్కోటి 2  టేబుల్ స్పూన్ల చొప్పున
 

పచ్చిమిర్చి - రెండు
 

కొత్తిమీర తరుగు - మూడు టేబుల్ స్పూన్లు
 

ఉప్పు, నూనె - సరిపడా
 

జీలకర్ర, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి -ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
 

పసుపు - పావు టీస్పూన్
 

చక్కెర, నిమ్మరసం - ఒక్కో టీస్పూన్ చొప్పున
 

వెల్లుల్లి రెబ్బలు - మూడు

తయారీ :  ఒక గిన్నెలో మరమరాలు వేసి, నీళ్లు పోసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు పిండి, మరో గిన్నెలో వేసి చేత్తో మెదపాలి. అందులో మెంతికూర, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నువ్వులు, చక్కెర, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత శనగపిండి వేసి నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత ఆ పిండి మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి. వాటిని అరచేతిలో పెట్టుకుని వత్తాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో రెండు వైపులా గోల్డెన్ కలర్​ వచ్చేవరకు వేగించాలి.

ఆటా బోండా

కావాల్సినవి :

గోధుమ పిండి - ఒక కప్పు
 

పొడి బియ్యపిండి - రెండు టేబుల్ స్పూన్లు
 

ఉప్పు, నూనె - సరిపడా, వంట సోడా, జీలకర్ర - అర టీస్పూన్
 

కరివేపాకు - కొంచెం

పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూన్
 

అల్లం తరుగు - అర టేబుల్ స్పూన్

మజ్జిగ - ఒక గ్లాస్

తయారీ :  ఒక పాన్​లో గోధుమ పిండి వేసి వేడి మీద కాసేపు వేగించాలి. ఆ తర్వాత పక్కకు తీసి, అందులో పొడి బియ్యప్పిండి, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వంట సోడా, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. తర్వాత మజ్జిగ పోస్తూ బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా పిండి కలపాలి. ఆ పై మూత పెట్టి ఒక గంట పక్కన ఉంచాలి. తర్వాత చేతిని నీళ్లతో తడుపుకోవాలి. పిండిని వేడి నూనెలో బోండాల్లా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. 

స్వీట్ పొటాటో మినీ కేక్

కావాల్సినవి :

స్వీట్ పొటాటో (మొరంగడ్డ, చిలగడ దుంపలు, గెనుసుగడ్డ) - రెండు

నీళ్లు - సరిపడా

చక్కెర - ఒక టేబుల్ స్పూన్

మైదా లేదా గోధుమ పిండి - అర కప్పు

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : గెనుసు గడ్డల తొక్క తీసి, ముక్కలు తరగాలి. ఒక పాన్​లో నీళ్లు పోసి అందులో గెనుసు గడ్డ ముక్కలు ఉడికించాలి. అవి ఉడికాక వాటిని నీటిలో నుంచి తీసి మెత్తగా మెదపాలి. తరువాత అందులో మైదా, చక్కెర వేసి బాగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేయాలి. వాటిని గారెల్లా వత్తాలి. పాన్​ మీద నూనె వేడి చేసి రెండు వైపులా వేగించాలి. అంతే టేస్టీగా ఉండే స్వీట్​ పొటాటో మినీ కేక్ రెడీ. 

బీట్​రూట్ చిప్స్

కావాల్సినవి :

బీట్ రూట్ - రెండు

నూనె, ఉప్పు - సరిపడా

శనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు

బియ్యప్పిండి, కారం - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున

మిరియాల పొడి - అర టీస్పూన్

తయారీ : బీట్​రూట్​ను కడిగి, తొక్క తీసి సన్నగా కట్​ చేయాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.  పాన్​లో నూనె వేడి చేసి అందులో బీట్​రూట్​ ముక్కల్ని వేయాలి. మూడు నిమిషాలు వేగిస్తే చిప్స్​ రెడీ.

ఎగ్​ హల్వా

కావాల్సినవి :

కోడిగుడ్లు - ఆరు

పాలు - ఒకటిన్నర కప్పు

గోధుమపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్ 

చక్కెర - అరకప్పు

యాలకుల పొడి - పావు టీస్పూన్

నెయ్యి - ముప్పావు కప్పు

బాదం, పిస్తా తరుగు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ : ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన, పాలు, గోధుమపిండి, చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పాన్​ వేడి చేసి, అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. మిశ్రమం దగ్గరపడే వరకు గరిటెతో కలపాలి. కాసేపయ్యాక నెయ్యి వేసి పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత అందులో పిస్తా, బాదం తరుగు వేసి కలపాలి. మరో రెండు నిమిషాలు ఉడికిస్తే ఎగ్ హల్వా రెడీ. 

సూజీ శ్నాక్స్

కావాల్సినవి :

బొంబాయి రవ్వ - రెండు కప్పులు

జీలకర్ర పొడి, చాట్​ మసాలా, పుదీనా పొడి, కారం - ఒక్కో టీస్పూన్ చొప్పున,

ఉప్పు - పావు టీస్పూన్

నల్ల ఉప్పు, గరం మసాలా - అర టీస్పూన్ చొప్పున

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు,

వేడి నీళ్లు - ఒక కప్పు

తయారీ : మిక్సీజార్​లో బొంబాయి రవ్వ వేసి గ్రైండ్ చేయాలి. ఆ పిండిని గిన్నెలోకి తీసి, అందులో జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి. అందులోనే వేడి నీళ్లు పోసి ముద్దలా కలపాలి. మూతపెట్టి పావుగంట పక్కన పెట్టాలి. పుదీనా ఫ్లేవర్​ కోసం.. ఒక పాన్​లో పుదీనా ఆకుల్ని నూనె లేకుండా వేగించాలి. తర్వాత వాటిని పొడి పట్టాలి. ఒక గిన్నెలో చాట్​ మసాలా, తయారుచేసుకున్న పుదీనా పొడి వేసి కలపాలి. 

స్పైసీ చట్​పటా మసాలా కోసం.. మరో గిన్నెలో కారం, ఉప్పు, నల్ల ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. ఈ రెండు మసాలాలను రెడీ చేసి పక్కన పెట్టాక, పిండి ముద్దను ఉండలు చేసి చపాతీల్లా వత్తాలి. తర్వాత నచ్చిన ఆకారంలో కట్​ చేసుకోవాలి. వాటిని వేడి నూనెలో వేగించాలి. చల్లారాక ఒక గిన్నెలో వేసి, నచ్చిన మసాలా చల్లాలి. గాలి చొరబడని డబ్బాలో వేసి మూతపెడితే నెల రోజులు వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడు తిన్నా కరకరలాడతాయి.