ఏటేటా పెరిగే శివలింగం..తల మీది నుంచి జాలువారుతున్న గంగాజలం..అర్ధనారీశ్వర అవతారం..పార్వతీ కురుల ఆనవాళ్లు..
చలువరాతి స్థూపాకార లింగం.. ఒక్కటా... రెండా.... ఎన్నో అద్భుతాలు, విజ్ఞానశాస్త్రానికే అంతుచిక్కని విశేషాలున్న ఆలయమిది. అంతేకాదు.. సాక్షాత్తు కైలాసనాథుడే ఇక్కడ ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వరుడిగా వెలిశాడని పురాణ కథలు చెప్తున్నాయి. ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయం గురించి...
ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర ఆలయం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో ఉంది.
ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి. దేశంలోని అతికొద్ది దర్శనీయ శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. శివలింగం ప్రతి పన్నెండేళ్లకు ఒక అంగుళం చొప్పున పెరుగుతుండడం విశేషం. అంతేకాదు.. శివలింగం మీద ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసినా మళ్లీ జలం ఊరుతూనే ఉంటుంది.
అందుకే సాక్షాత్తు గంగమ్మ కొలువై ఉంది అంటారు అక్కడి వాళ్లు. ద్విలింగం కావడం వల్ల సగ భాగం పార్వతీ దేవి, మరో సగ భాగం శివుడుగా అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తాడు. శివలింగానికి ఐదు చోట్ల బొట్లు పెట్టినట్టు ఒక మార్క్ ఉంటుంది. శివలింగం పెరుగుతున్న కొద్దీ ఆరో బొట్టు ఏర్పడుతోంది. వెనుకభాగంలో పార్వతీదేవి అమ్మవారి కురుల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ క్షేత్రం వెయ్యేండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది.
ఆలయ చరిత్ర
కాకతీయులు క్రీ.శ 1311లో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఇక్కడ ఉన్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం గొల్లకుంట అనే పల్లెలోని గొల్లలు పశువులు కాస్తూ బతికేవాళ్లు. వాళ్లకు ఒకసారి ఓ గుండ్రని రాయి కనిపించింది. అది పశువుల కొట్టంలో అడ్డుగా ఉండడంతో దూరంగా తీసుకెళ్లి వదిలేశారు. ఇలా పదేపదే జరిగేది.
ఒకరోజు వాళ్ల పశువుల్లోని ఓ కామధేనువు నిత్యం ఆ రాయిపై పొదుగుపాలు పోయడం వాళ్లు గమనించారు. అప్పుడే వాళ్లకు శివుడు కలలో దర్శనమిచ్చి ‘‘రాయి రూపంలో ఉన్నది నేనే. నాకు ఆలయాన్ని కట్టండి” అని చెప్పాడట. దీంతో అక్కడ స్వయంభు శివాలయం కట్టించారు. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో1989లో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి శివ భక్తురాలైన గుండ్లపల్లి చంద్రమ్మ భారీగా విరాళం ఇచ్చింది.
రాష్ట్ర జాతరల్లో ఒకటి
ఏటా ఫిబ్రవరి/మార్చిలో వచ్చే మహాశివరాత్రి టైంలో ఇక్కడ ఐదు రోజుల పాటు వైభవంగా జాతర చేస్తారు. జాతర రోజుల్లో పది లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారు. అప్పుడు భారీ లైటింగ్, ప్రభలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎడ్ల పందాలు మరో అట్రాక్షన్. ఈ పందాలను చూసేందుకు, పందాల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. లక్షలాది మంది రైతులు వస్తారు. టన్నుల బరువు ఉండే భారీ రాతి స్తంభాలను ఎడ్లకు కట్టి పందెం పెడతారు. గెలిచిన గిత్తల యజమానులకు లక్షల రూపాయల బహుమతులు ఇస్తారు. ఆ తరువాత రంగస్థల కళాకారులు ఆ తరం నాటి నాటకాలు ప్రదర్శిస్తారు.
పుణ్యక్షేత్రాల పుట్టినిల్లు
ఈ శివాలయానికి వచ్చిన భక్తులు మేళ్లచెరువులో ఉన్న మరికొన్ని విశిష్టమైన ఆలయాలు దర్శించుకోవచ్చు. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే వెంకటేశ్వరుడు, అరుదైన రాహుకేతు ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తయిన పంచముఖ ఆంజనేయుడిని దర్శించుకోవచ్చు. మేళ్ల చెరువుకు సమీప గ్రామం రేవూరులో పంచపాండవుల ఆలయం, చండీ పీఠ వ్యవస్థాపకుల పర్యవేక్షణలోని వనదుర్గ అమ్మ, పురాతన సంతాన సోమేశ్వర ఆలయం చూడొచ్చు. మేళ్లచెరువు వెళ్తే చూసేందుకు చాలానే ఆలయాలు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలంటే...
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే నేషనల్ హైవే మీదుగా కోదాడ టౌన్ చేరుకోవాలి. అక్కడినుంచి 25 కిలోమీటర్ల దూరంలో మేళ్లచెరువు గ్రామం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని భక్తులు కృష్ణాతీరం దగ్గర ఉన్న వంతెన ద్వారా మట్టపల్లి చేరుకుంటే అక్కడ నుండి 20 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.
జాతర ఇలా..
ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర ఐదు రోజుల పాటు వైభవంగా, భక్తజన సంద్రంగా జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 8 నుండి 12 వరకు జాతర జరుగుతుంది. 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర మంత్రులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి స్వామివారి కళ్యాణం.. భారీ లైటింగ్ ఉన్న ప్రభలపై ఆలయ పరిసరాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి.
వాటిని చూసేందుకు మూడు లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా. 9వ తేదీన ఎద్దుల పందాలు మొదలవుతాయి. అదే రోజు ప్రో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఇవి 12వ తేదీ వరకు కొనసాగుతాయి. 10 న రంగస్థల కళాకారుల నాటకాల ప్రదర్శన ఉంటుంది. 12న రాత్రి స్వామి వారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. 7వ తేదీ రాత్రి ప్రభలపై పురవీధుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో చండీ పీఠం ఆధ్వర్యంలో మాసదీక్ష సూర్యారాధన కార్యక్రమాలు జరుగుతాయి. జాతరకు వచ్చే భక్తులకు భోజన సౌకర్యం ఉంటుంది.
ఓరుగంటి నరసింహారావు, మేళ్లచెరువు