ప్రకృతిని కాపాడడం అందరి బాధ్యత

  •     ఉమ్మడి జిల్లాలో జోరుగా  స్వచ్ఛదనం–పచ్చదనం   
  •     పాల్గొన్న కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు

నెట్​వర్క్, వెలుగు : ‘స్వచ్ఛదనం–పచ్చదనం’ కార్యక్రమాలు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంతోపాటు దిలావార్ పూర్ మండలం న్యూ లోలం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో విద్యార్థులు, గ్రామస్తులతో ఆమె ప్రత్యేక సమావేశం, ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత నివ్వాలని కోరారు.

నేటి నుంచి ఈనెల 9 వరకు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆదిలాబాద్​ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్​రాజర్షి షా పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్

ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ప్రజల భాగస్వామ్యం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతం

ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతగానో అవసరమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్సెట్టిపేట మండలంలోని వెంకటరావుపేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెలు స్వచ్ఛంగా పచ్చదనంతో ఉంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. ర్యాలీలో పాల్గొని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, వనమహోత్సవంపై అవగాహన కల్పించారు. స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఆర్ కాలనీలో డీఎఫ్ఓ నీరజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావుతో, అడ గ్రామంలో డీపీఓ భిక్షపతి, డీఆర్​డీఓ, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి పాల్గొన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి ఆనారోగ్యాలు దరి చేరవని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు. నేరడిగొండలో స్పెషల్ ఆఫీసర్ రవీందర్, నస్పూర్ మున్సిపాలిటీలో, ఇచ్చోడ, జైనూర్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.