పాలిటెక్నిక్‌‌‌‌ హాస్టల్‌‌‌‌లో స్టూడెంట్‌‌‌‌ అనుమానాస్పద మృతి

  • హడావుడిగా డెడ్‌‌‌‌బాడీని తరలించిన పోలీసులు
  • కనిపించని సీసీ ఫుటేజీ
  • కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన పేరెంట్స్‌‌‌‌, విద్యార్థి సంఘాల లీడర్లు
  • నిజామాబాద్‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌‌‌లో ఘటన

నిజామాబాద్/వర్ని, వెలుగు : పాలిటెక్నిక్‌‌‌‌ కాలేజీ హాస్టల్‌‌‌‌లో ఓ స్టూడెంట్‌‌‌‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పేరెంట్స్‌‌‌‌ రాకముందే స్టూడెంట్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీని హాస్పిటల్‌‌‌‌కు తరలించడం, మృతిపై అనుమానాలు తలెత్తడంతో బంధువులు, విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌‌‌ మండల కేంద్రంలో శనివారం జరిగింది. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా ఉట్నూర్‌‌‌‌కు చెందిన విష్ణు, నిఖిత కూతురు రక్షిత (16) నిజామాబాద్‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌‌‌లోని పాలిటెక్నిక్‌‌‌‌ కాలేజీలో అగ్రికల్చర్‌‌‌‌ కోర్సు ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో చేరింది. ఈ నెల 22న క్లాస్‌‌‌‌లు ప్రారంభం అయినప్పటికీ రక్షిత 27న కాలేజీకి వచ్చి అనుబంధ హాస్టల్‌‌‌‌లో చేరింది. హాస్టల్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌లో రూమ్‌‌‌‌కు ముగ్గురు చొప్పున మొత్తం 16 మంది ఉంటున్నారు.

శనివారం ఉదయం రక్షిత కనిపించకపోవడంతో తోటి స్టూడెంట్లు హాస్టల్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ అన్నీ వెదికారు. ఎక్కడా లేకపోవడంతో తర్వాత టాయిలెట్స్‌‌‌‌ వెదుకుతుండగా ఓ టాయిలెట్‌‌‌‌లో చనిపోయి కనిపించింది. వెంటిలేటర్‌‌‌‌కు కట్టిన చున్నీ రక్షిత మెడకు బిగించి ఉంది. దీంతో వెంటనే ప్రిన్సిపాల్‌‌‌‌ బాలాజీనాయక్‌‌‌‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్‌‌‌‌తో పాటు రుద్రూర్‌‌‌‌ సీఐ జయేశ్‌‌‌‌రెడ్డి, ఎస్సై సాయన్న హాస్టల్‌‌‌‌ వద్దకు చేరుకున్నారు. వివరాలు సేకరించిన అనంతరం డెడ్‌‌‌‌బాడీని బోధన్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ లోగా విషయం తెలుసుకొని హాస్టల్‌‌‌‌ వద్దకు వచ్చిన ఏబీవీపీ, పీడీఎస్‌‌‌‌యూ లీడర్లు రక్షిత పేరెంట్స్‌‌‌‌ వచ్చేదాక డెడ్‌‌‌‌బాడీని తరలించొద్దని అంబులెన్స్‌‌‌‌ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తప్పించి రక్షిత డెడ్‌‌‌‌బాడీని హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

కనిపించని సీసీ ఫుటేజీ

శుక్రవారం రాత్రి 8 గంటలకు ఫోన్‌‌‌‌ చేసి అంతా బాగుందని చెప్పిన కూతురు రక్షిత తెల్లారేసరికి చనిపోయిందన్న వార్త తెలియడంతో పేరెంట్స్‌‌‌‌ విష్ణు, నిఖిత నిర్ఘాంతపోయారు. తాము వచ్చేదాకా ఆగకుండా డెడ్‌‌‌‌బాడీని ఎందుకు షిఫ్ట్‌‌‌‌ చేశారని పోలీసులను నిలదీశారు. హాస్టల్‌‌‌‌లో ఉన్న సీసీ ఫుటేజీని చూపించాలని పట్టుబట్టడంతో ఫుటేజీని ఓపెన్‌‌‌‌ చేశారు. కానీ శుక్రవారం సాయంత్రానికి ముందు, ఘటన తర్వాత హాస్టల్‌‌‌‌లోకి పోలీసులు వచ్చిన ఫుటేజీ మాత్రమే కనిపించింది. రాత్రి ఫుటేజీ కనిపించకపోవడంతో రక్షిత మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు, స్టూడెంట్‌‌‌‌ లీడర్లు ఆందోళనకు దిగారు.

ఘటన జరిగినప్పటి ఫుటేజీ మాత్రమే ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. ప్రిన్సిపాల్‌‌‌‌ బాలాజీ నాయక్‌‌‌‌ను తమకు అప్పగించాలని పట్టుబట్టారు. బోధన్‌‌‌‌ ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌ అదనపు బలగాలతో హాస్టల్‌‌‌‌ వద్దకు చేరుకొని స్టూడెంట్‌‌‌‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై విచారణ చేస్తామని నచ్చజెప్పారు. అనుమానితుల వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించడంతో ప్రిన్సిపాల్‌‌‌‌తో పాటు వార్డెన్‌‌‌‌ నరేందర్‌‌‌‌పై ఫిర్యాదు చేశారు.