వనపర్తి బల్దియా అవిశ్వాసంపై సస్పెన్స్

  • ఈ నెల 27న సమావేశానికి కలెక్టర్​ ఆదేశం
  • మీటింగ్ కు హాజరు కావద్దంటున్న మాజీ మంత్రి
  • ససేమిరా అంటున్న బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపల్​ చైర్మన్​ గట్టుయాదవ్, వైస్​ చైర్మన్​ వాకిటి శ్రీధర్​లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గత నెల కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​కు నోటీసు ఇవ్వగా, ఈ నెల 27న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్లకు లెటర్లు​వచ్చాయి. దీంతో నాలుగు నెలలుగా నానుతూ వస్తున్న అవిశ్వాస తీర్మానం వ్యవహారం చివరి దశకు చేరుకుంది. జనవరి నుంచే బీఆర్ఎస్​ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ మాజీ మంత్రి నిరంజన్​రెడ్డిని కోరుతూ వస్తున్నారు.

 ఆయన వారిని సముదాయిస్తూ వస్తున్నా, మాజీ మంత్రి మాట వినకుండా నోటీసు ఇచ్చారు. ఒకసారి నోటీసు ఇచ్చాక వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడంతో, బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సమావేశానికి వెళ్లవద్దని సూచించినట్లు తెలిసింది. మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా, బీఆర్ఎస్​కు 25 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

కాంగ్రెస్​ పార్టీకి అయిదుగురు సభ్యులుండగా, ఎన్నికల తరువాత ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. టీడీపీ కౌన్సిలర్​ కాంగ్రెస్​ పక్షానే ఉన్నారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ బలం పది మందికి చేరింది. అవిశ్వాసం పెడితే వీరంతా మద్దతు ఇవ్వనున్నారు. ఇదిలాఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి బుజ్జగించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్​ పార్టీ మద్దతు..

అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మున్సిపాలిటీలో 22 మంది సభ్యులు అవసరం. చైర్మన్, వైస్​ చైర్మన్​ మినహాయిస్తే 21 మందే ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే ఇంకా ఒకరి అవసరం ఉంది. కాంగ్రెస్​ పార్టీ మద్దతు తీసుకోవాలని అసంతృప్త కౌన్సిలర్లు భావిస్తున్నా, మాజీ మంత్రి వద్దని వారిస్తూ వచ్చారు. చైర్మన్, వైస్​ చైర్మన్లతో రాజీనామా చేయిస్తామని, నచ్చిన వారిని ఎన్నుకోవాలని ప్రతిపాదించినప్పటికీ ఒప్పుకోలేదని సమాచారం.

ఇదిలాఉంటే అవిశ్వాసం నెగ్గాక చైర్మన్​ అభ్యర్థికి సపోర్ట్​ చేస్తామని కాంగ్రెస్​ పార్టీ నేత ఒకరు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 14 మంది బీఆర్ఎస్, 10 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు క్యాంప్​నకు పోవాలని నిర్ణయించారు. చైర్మన్, వైస్​ చైర్మన్​ పోస్టులు ఆశిస్తున్న వారితో పాటు కౌన్సిలర్లంతా ఆ పార్టీ నేత మాటను బేఖాతర్​ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

దిద్దుబాటు చర్యలు!

త్వరలో జరిగే మహబూబ్​నగర్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌన్సిలర్ల ఓట్లు కీలకం కానుండడంతో మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న చైర్మన్, వైస్​ చైర్మన్లతో రాజీనామా చేపిస్తానని, ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా క్యాంప్​నకు రావాలని సూచించినట్లు సమాచారం. అయితే చైర్మన్, వైస్​ చైర్మన్లను తొలగించడం మాజీ మంత్రికి ఏ మాత్రం ఇష్టం లేదని, తాము క్యాంప్​నకు వెళ్లే విషయంపై ఆలోచిస్తామని కొందరు కౌన్సిలర్లు అంటున్నారు. ఓ వైపు అవిశ్వాసం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్​ నేతలకు తలనొప్పిగా మారాయని చెబుతున్నారు.