మా శాలరీలు ఈఎంఐలకు పోతున్నయ్

  • లోన్లు తీసుకుని మోసగించిన ఎస్ బీఐ మేనేజర్  
  • న్యాయం చేయాలంటూ బాధిత ఉద్యోగుల ఆందోళన 

సూర్యాపేట, వెలుగు: ఎస్ బీఐ మేనేజర్ చేసిన మోసానికి తమ శాలరీ అంతా లోన్ ఈఎంఐలకే కట్ అవుతుందని వివిధ శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్ బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఆందోళన చేశారు.  ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ..2022  నుంచి సూర్యాపేట ఎస్ బీఐ మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్ గా షేక్ సైదులు విధులు నిర్వహిస్తూ.. లోన్లు, టాప్ అప్ లోన్లు ఇస్తామని 33 మంది ఉద్యోగుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని రావట్లేదని చెప్పారన్నారు.  

అనంతరం తమ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులోన్లు తీసుకున్నాడని ఆరోపించారు. ఇలా ఒక్కో ఉద్యోగి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్ తీసుకున్నారని తెలిపారు. 2023 జూన్ లో మేనేజర్ షేక్ సైదులు హైదరాబాద్ లోని రామంతాపూర్ బ్రాంచ్ ట్రాన్స్​ఫర్ అయ్యారని,  అక్కడ కూడా ఇలాగే ఉద్యోగులను మోసగించడంతో  గత జనవరి 23న పట్టుబడి అరెస్ట్ అయ్యాడన్నారు. 

అప్పటివరకు ఈఎంఐలు చెల్లించిన మేనేజర్ ఆ తర్వాత నుంచి కట్టకపోతుండగా తమ శాలరీల నుంచి కట్ అవుతుండడంతో  అనుమానం వచ్చి బ్యాంకు అధికారులను సంప్రదించడంతో మేనేజర్ షేక్ సైదులు మోసం బయటపడింద న్నారు. దీంతో బ్యాంకు రీజినల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ కు చెప్పామని, గతేడాది కాలంగా తిరుగుతున్నా తమకు న్యాయం చేయడంలేదని వాపోయారు. తమ శాలరీల నుంచి ఈఎంఐలు కట్ అవుతుండ డంతో కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మోసగించిన మేనేజర్ కూడా తమ పేరిట లోన్లు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడన్నా రు. అయినా బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి తమ శాలరీల నుంచి ఈఎంఐలు కట్ చేయకుండా మినహాయించాలని కోరారు.