ఎఫ్‌టీఎల్‌ సర్వే స్పీడప్‌ 

  • చెరువుల్లో జెండాలతో హద్దులు ఏర్పాటు చేస్తున్న ఆఫీసర్లు
  • చెరువుల సమీపాల్లో పట్టాల గుర్తింపు 
  • ప్లాట్ల కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకుంటున్న జనం

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్​జోన్ల సర్వే స్పీడందుకుంది. ఎఫ్టీఎల్​, బఫర్​ జోన్లను గుర్తించి జెండాలతో మార్కింగ్‌ చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజులుగా చెరువులు, నాలలపై అధికారులు దృష్టి సారించడంతో జిల్లాలోని చెరువు కబ్జాదారుల్లో టెన్షన్‌ నెలకొంది. మరోవైపు ప్లాట్లను కొనుగోలు చేసేవారు జాగ్రత్త పడుతున్నారు. ఒకటికి రెండు సార్లు భూమి వివరాలు తెలుసుకొని కొంటున్నారు. 

కూల్చివేతలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు 

పెద్దపల్లిలోని రెండు చెరువుల్లో ఏర్పాటు చేసిన వెంచర్లపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్​ అధికారులు కూల్చివేశారు. జిల్లా వ్యాప్తంగా 970 చెరువులున్నట్లు రికార్డుల్లో ఉండగా  దాదాపు 100 కు పైగా పూర్తి స్థాయిలో  కబ్జాకు గురైనట్లుగా తెలుస్తోంది. అలాగే చాలా చెరువులు పాక్షికంగా కబ్జాకు గురైనట్లు సమాచారం. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న చెరువులు కబ్జాకు గురవడంతోపాటు అందులో వెంచర్లు వెలిశాయి. అలాగే చాల చెరువుల ఎఫ్టీఎల్‌లో బిల్డింగ్‌లు కూడా వెలిశాయి. దీంతో ఇరిగేషన్​ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు.  అలాగే జీపీల పరిధిలోని చెరువుల్లో కూడా బఫర్​, ఎఫ్టీఎల్​ గుర్తించేందుకు అధికారులు 
ఏర్పాట్లు చేస్తున్నారు. 

జెండాలతో మార్కింగ్

ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో  ఏర్పాటు చేసిన వెంచర్లు, షెడ్లను ఇప్పటికే కూల్చివేశారు. ఎఫ్టీఎల్​, బఫర్​ జోన్ల పరిధిని గుర్తించి అధికారులు జెండాలు ఏర్పాటు చేసి మార్కింగ్​ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని బంధంపల్లి, రంగంపల్లి చెరువుల్లో వెంచర్లు ఏర్పాటు చేసి ఇప్పటికే అమ్మగా.. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఆక్రమణలు పెద్దఎత్తున బయటపడుతాయని స్థానికులు అంటున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా  కేంద్రంలోని గుండం చెరువు బఫర్​లో కూడా నిర్మాణాలు జరిగినట్లు మున్సిపల్​ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. 

నాలాలపై నిర్మాణాలు

జిల్లాలోని పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్​ పట్టణాల్లో నాలాల మీద నిర్మాణాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్​నగర్​ సెంటర్​లో ఓ బిల్డింగ్‌కు దారి కోసం నాలాపైన రోడ్డు నిర్మించారు. దానిపై ఈ మధ్య కాలంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సాగర్​రోడ్​, భూంనగర్,   కునారం రోడ్​, పాత కోర్టు ఏరియా, రంగంపల్లిలో ఉన్న నాలాల మీద నిర్మాణాలు జరిగాయని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

 నాలాలు కబ్జా కావడంతో వర్షం పడినప్పుడల్లా పోలీస్‌స్టేషన్‌ రోడ్డు పూర్తిగా మునుగుతోంది. అలాగే రాజీవ్​ రహదారికి అనుబంధంగా ఉన్న కునారం రోడ్​, ఆర్‌‌టీఏ ఆఫీసు రోడ్డుతోపాటు ఆ ప్రాంతమంతా మునుగుతోంది. ప్రధాన నాలాల మీద అక్రమ నిర్మాణాలతోనే ఈ ప్రాంతాలు ముంపు బారినపడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్కార్​ ఆదేశాలతో కలెక్టర్ ఆక్రమణల గుర్తింపు చేపడుతూ, మార్కింగ్​చేయిస్తుండడంతో అక్రమార్కుల్లో టెన్షన్‌ నెలకొంది.