కామారెడ్డిటౌన్, వెలుగు : పశువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 17న బక్రీద్ పండుగ దృష్ట్యా జంతు సంక్షేమం, గోవధ నిషేధ చట్టం అమలుపై ఆయా శాఖల ఆఫీసర్లతో సోమవారం కలెక్టరేట్లో మీటింగ్ నిర్వహించారు. వెటర్నరీ డాక్టర్ దృవీకరణ పత్రం లేకుండా ఆవులను తరలించటం నిషేధమన్నారు.
పశు సంరక్షణ చట్టానికి లోబడి క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పశువులు రవాణా కాకుండా చూడాలన్నారు. ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు. అలాగే గ్రామాల్లో నల్లా కనెక్షన్లపై ఇంటింట సర్వే చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీటి సప్లయ్‌పై ఇంటింట సర్వేపై సోమవారం మీటింగ్ జరిగింది. పంచాయతీ సెక్రెటరీలు ఇంటింటికి వెళ్లి వివరాలను మోబైల్ యాప్‌లో ఎంట్రీ చేయాలన్నారు. వాస్తవాలను తెలుసుకొని ఎంట్రీ చేయాలన్నారు. డీపీవో శ్రీనివాస్‌రావు, మిషన్ భగీరథ ఆఫీసర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ : గోవధ నిషేధ చట్టంపై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ సూచించారు. గోవధ నిషేదంపై సోమవారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించారు. జంతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. అక్రమ రవాణా నిరోధించడానికి కందకుర్తి, సాటాపూర్, సాలూరా, పోతంగల్, ఖండ్గావ్, యంచ, పోచంపాడ్, కమ్మర్పల్లి, ఇందల్వాయి తదితర చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ ఆఫీసర్లు సమన్వయంతో డ్యూటీ చేయాలన్నారు.
గోవుల అక్రమ రవాణా జరిగితే యాక్షన్ తీసుకోవాలని సూచించారు. గోవులను స్వాధీనం చేసుకొని లోకల్‌గా షెల్టర్ కల్పించి పశుగ్రాసం, నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. గోశాల నిర్వాహకుల సహకారం తీసుకోవాలని, ఎక్కడా గోవధ జరుగకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. సాటాపూర్, ఇందల్వాయి పశువుల మార్కెట్‌పై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, డీపీఓ ఆఫీస్ ఏఓ సిద్ధిరాములు, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ సాజిద్, కలెక్టరేట్ ఏవో రాంచందర్ ఉన్నారు.