సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) ప్రయోగం సక్సెస్

న్యూఢిల్లీ: ఇండియన్ నేవి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) సంయుక్తంగా చేపట్టిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM)  ప్రయోగం విజయవంతమైంది. ఒడిషా చాందీపూర్‎లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి లంబ లాంచ్ స్టేషన్‎లో డీఆర్డీవో  సీనియర్ శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవి అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగంలో.. మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని అధికారులు వెల్లడించారు.  క్షిపణిని భూ- ఆధారిత నిలువు లాంచర్ నుండి తక్కువ -ఎగిరే, అధిక-వేగవంతమైన వైమానిక లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. 

 ప్రాక్సిమిటీ ఫ్యూజ్,  సీకర్‌తో సహా ఆయుధ వ్యవస్థకు సంబంధించి అనేక అధునాతన లక్షణాలను మెరుగుపర్చడం ఈ పరీక్ష లక్ష్యమని పేర్కొన్నారు. రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, టెలిమెట్రీ వంటి బహుళ శ్రేణి పరికరాల ద్వారా సేకరించిన డేటా ద్వారా క్షిపణి పనితీరు నిర్ధారించబడిందని తెలిపారు. VL-SRSAM సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం కావడంతో డీఆర్డీవో శాస్త్రవేత్తులు, నేవి అధికారులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ ప్రశంసించారు. భారత క్షిపణి వ్యవస్థ యొక్క విశ్వసనీయతను ఈ ప్రయోగం మరింత పునరుద్ఘాటిస్తుందని పేర్కొన్నారు.