వేగంగా సూరమ్మ ప్రాజెక్టు పనులు

  • మార్చికల్లా  పూర్తి చేసేందుకు  కసరత్తు
  • రూ. 204 కోట్ల తో  పనులు ప్రారంభం
  • ఇప్పటికే రూ. 80 కోట్లు మంజూరు చేసిన సర్కార్
  • ఏళ్లుగా ఎదురుచూస్తున్న 43 గ్రామాల రైతులు

జగిత్యాల, వెలుగు : కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువు వచ్చే ఏడాది మార్చి లోగా రిజర్వాయర్ గా మారనుంది. ఎన్నో ఏళ్ల తర్వాత రిజర్వాయర్ పనులకు మోక్షం కలిగింది. ప్రాజెక్ట్​ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ రీ వెరిఫికేషన్ సర్వే చేపట్టింది. మార్చి లోపు పనులు పూర్తి చేసి దాదాపు 50 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికోసం నిధులు మంజూరు చేయడం తో పనులు వేగంగా నడుస్తున్నాయి. ప్రాజెక్టు పనులను   జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలిస్తున్నారు. 

రైతుల పదిహేనేండ్ల కల.. 

కథలాపూర్ మండలం కలిగోట గ్రామ శివారు లోని సూరమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చితే   కథలాపూర్, మేడిప ల్లి, కోరుట్ల, మెట్ పల్లి మండలాల్లోని 43 గ్రామాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. రైతుల చిరకాల కోరిక మేరకు 15 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ సర్కార్ వైఎస్ హయాంలో  ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎల్లంపల్లి నుండి రిజర్వాయర్ నింపి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించి సుమారు 650 ఎకరాల భూమి కూడా సేకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.204 కోట్లతో కాలువల నిర్మాణ పనులకు 2016, జూన్ 22 న అప్పటి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. కానీ నిధులు మంజూరు చేయకపోవడం తో రైతులకు నిరాశే మిగిలింది. 

కాంగ్రెస్ హయాంలో పనులు ప్రారంభం.. 

కాంగ్రెస్​ హయాంలో సురమ్మ చెరువు ను ప్రాజెక్టులా తీర్చిదిద్దాలని సంకల్పించగా, తిరిగి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పీసీసీ హోదా లో రేవంత్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్​చార్జి ఆది శ్రీనివాస్ సూరమ్మ రిజర్వాయర్ పనుల్ని పరిశీలించి రైతుల కు హామీ ఇచ్చారు. పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు ఎట్టకేలకు సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు రీ సర్వే పూర్తి చేసిన ఆధికారులు ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ఇటీవల సర్కార్ మొదటి విడుత లో రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేయడం తో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు జూలై 15న వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

ఫండ్స్​ రాగానే పనులు స్టార్ట్​ చేశాం.. 

కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించే సూరమ్మ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. రూ.204 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పనులు తొందరగా పూర్తి చేయాలని సర్కార్ ఆదేశాలు ఉన్నాయి. దాదాపు వచ్చే మార్చి వరకెల్లా ప్రాజెక్ట్  పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. అలాగే కింద ఉన్న కెనాల్ లకు కూడా ప్రభుత్వ ఫండ్స్ మంజూరు చేయగానే  నిర్మాణాలకు పనులు ప్రారంభిస్తాం.

- సంతు ప్రకాశ్, ఇరిగేషన్ ఈఈ, సూరమ్మ ప్రాజెక్టు 

మార్చి  కల్లా పనులు పూర్తి చేస్తాం

రూ.204 కోట్లు పరిపాలన అనుమతులు వచ్చాయి.అలాగే రూ. 350 కోట్లు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ఫేజ్ 2 కింద బడ్జెట్ లో నిధులు కేటాయించాం. గత సర్కార్ రైతుల ఓట్లు దండుకోవడానికే సూరమ్మ ప్రాజెక్టు ను వాడుకొని నిర్మాణం మరిచారు.37 సార్లు నిరసన కార్యక్రమాలు చేశాం. ఆనాడు పిసిసి హోదా లో రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ ఏర్పాటు తోనే నిర్మాణం పనులు ప్రారంభించాం. మార్చికల్లా సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం

వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్