ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీం నో

  •     ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీం నో
  •     ఈ దశలో జోక్యం చేసుకోలేమని వెల్లడి
  •     పిటిషన్లు కొట్టివేత  

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లలో క్విడ్ ప్రో కో జరిగిందని, వాటిపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ)తో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 

సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు సిట్ విచారణకు ఆదేశించడం తొందరపాటు, అనుచిత చర్య అవుతుందని బెంచ్ పేర్కొంది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని, ఎలక్టోరల్ బాండ్లలో క్విడ్ ప్రో కో జరిగి ఉండొచ్చనే ఊహతో విచారణకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఎలక్టోరల్ బాండ్లపై న్యాయ సమీక్ష జరిగిన నేపథ్యంలో ఈ పిటిషన్లను అనుమతించామని, కానీ ఇవి ఆర్టికల్ 32 కిందికి రావని స్పష్టం చేసింది. 

అలాగే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన డొనేషన్లను రికవరీ చేయాలని, వాటి ఇన్ కమ్ ట్యాక్స్​ను మళ్లీ లెక్కించాలని పిటిషనర్లు కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. ఇవి ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు తీసుకునే చర్యలని స్పష్టం చేసింది. కాగా, ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చింది.  

ఇవీ వాదనలు.. 

ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు ఆదేశించాలని ఎన్జీవోలు కామన్ కాజ్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో పాటు డాక్టర్ ఖేమ్ సింగ్ భట్టి, సుదీప్ నారాయణ్ తమంకర్, జై ప్రకాశ్ శర్మ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్జీవోల తరఫున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ‘‘ఎలక్టోరల్ బాండ్ల జారీలో క్విడ్ ప్రో కో జరిగింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీలకు పరస్పరం లబ్ధి చేకూరింది” అని అన్నారు. 

పిటిషనర్ భట్టి తరఫున సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియా వాదిస్తూ.. ‘‘క్విడ్ ప్రో కో కింద ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేసినట్టయితే, అది కచ్చితంగా లంచమే అవుతుందని కోర్టు గతంలో తన జడ్జిమెంట్ లో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లలో క్విడ్ ప్రో కో జరిగింది. రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాలను రికవరీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి” అని కోరారు.