సుప్రీంకోర్టు తీర్పు.. మంద కృష్ణమాదిగ భావోద్వేగం

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి లోనయ్యారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని తెలిపారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.

 ప్రత్యేకంగా మోడీ, అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణకు కృషి చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామన్నారు. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుందని.. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం- కానుందన్నారు. 

వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు రద్దు చేసి రీనోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.