పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్

  • గడ్డి కాల్చివేతల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్
  • 23న ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరై వివరణ ఇవ్వాలని

న్యూఢిల్లీ: పొలాల్లో గడ్డి కాల్చివేతల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం లేదని మండిపడింది. నిబంధనలు ఉల్లంఘించినోళ్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు పంజాబ్, హర్యానా అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎంను ఆదేశించింది. 

ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోని రైతులు పొలాల్లో గడ్డి కాల్చివేస్తుండడంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతున్నది. కాలుష్య నియంత్రణకు సీఏక్యూఎం జారీ చేసిన ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మైస్ తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల తీరుపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇదేం రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. అయినప్పటికీ మీరెందుకు ఉల్లంఘనులను విచారించడం లేదు? ప్రజలు ఉల్లంఘనలకు పాల్పడేలా మీరే ప్రోత్సహిస్తున్నారు. 

పంజాబ్ ప్రభుత్వం గత మూడేండ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కేవలం నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. ఎక్కడ గడ్డి కాల్చివేస్తున్నారనే దానిపై ఇస్రో లొకేషన్ తో సహా చెబుతున్నా.. ఆ లొకేషన్ దొరకడం లేదని మీరు అంటున్నారు” అని అధికారులపై ఫైర్ అయింది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ నెల 23న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

సీఏక్యూఎం తీరుపైనా అసంతృప్తి.. 

కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) తీరుపైనా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలు జారీ చేసి అమలు చేయడం మరవడమంటే పళ్లు లేని పులి లాంటిదేనని వ్యాఖ్యానించింది. ‘‘సీఏక్యూఎం సభ్యుల ఎంపికలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నది. గాలి కాలుష్యం గురించి తెలిసిన నిపుణులను నియమించడం లేదు. మాకు సీఏక్యూఎం సభ్యులంటే చాలా గౌరవం ఉంది. కానీ వాళ్లు ఎయిర్ పొల్యూషన్ ఫీల్డ్​లో ఎక్స్ పర్ట్స్ కాదు” అని పేర్కొంది.