పాకిస్తాన్​తో పోల్చొద్దు: కర్నాటక హైకోర్టు జడ్జి కామెంట్లపై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: మన దేశంలోని ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్​తో పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని తెలిపింది. ఏ ఒక్కరూ దేశంలోని ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్ తో పోల్చవద్దని చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఇటీవల ఓ భూవివాదం కేసు విచారణ సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

బెంగళూర్ లోని ఓ ప్రాంతాన్ని పాకిస్తాన్ తో పోల్చడంతో పాటు మహిళా న్యాయవాదిపైనా కామెంట్లు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రుషికేశ్ రాయ్ లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. 

అయితే తాను చేసిన కామెంట్లపై కర్నాటక హైకోర్టు జడ్జి వేదవ్యాసాచార్ శ్రీశానంద ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఈ కేసు విచారణను ముగిస్తున్నట్టు బెంచ్ తెలిపింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

జడ్జీలు జాగ్రత్తగా మాట్లాడాలి.. 

కేసు విచారణ టైమ్​లో కామెంట్లు చేసేటప్పుడు జడ్జీలు, లాయర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని బెంచ్ సూచించింది. అవి కేవలం నాలుగు గోడల మధ్యనే ఉండవని, ప్రజల్లోకి వెళ్తాయన్న విషయాన్ని గుర్తించాలని చెప్పింది. ‘‘సాధారణ పరిశీలనతో కొన్నిసార్లు చేసే కామెంట్లు వ్యక్తిగత పక్షపాతాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా జెండర్, కమ్యూనిటీ విషయంలో కామెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇచ్చే తీర్పు నిష్పక్షపాతంగా, న్యాయంగా ఉండాలి” అని పేర్కొంది.