లవ్‌లో బ్రేకప్ చెప్తే సూసైడ్‌కు ప్రేరేపించినట్టు కాదు : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సంబంధాలు చెడిపోవడం మానసిక వేదనను కలిగించేవే అయినప్పటికీ, వాటిని ఆత్మహత్యకు ప్రేరేపించేవిగా పరిగణించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఎంతో కాలంగా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్​షిప్ బ్రేక్ అవడాన్ని నేరపూరిత ఘటనగా చూడలేమని చెప్పింది. ఎనిమిదేండ్ల రిలేషన్​షిప్ తర్వాత తనను పెండ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం ఈ తీర్పునిచ్చింది. నిందితుడు ఆ యువతిని ఆత్మహత్య చేసుకునేలా రెచ్చగొట్టాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేనంతకాలం అతడిని దోషిగా చూడలేమని స్పష్టం చేసింది.

ఎవిడెన్సులు లేకుండా నిందితుడిని శిక్షించలేం

21 ఏండ్ల తన కూతురు.. నిందితుడు కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదితో 8 ఏండ్ల పాటు ప్రేమలో ఉందని, అతడు పెండ్లి చేసుకుంటానని నమ్మించి మాట నిలబెట్టుకోకపోవడంతో తన బిడ్డ 2007లో సూసైడ్ చేసుకుందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడిపై తొలుత మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అత్యాచారం కింద అభియోగాలు మోపారు. ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా తేల్చింది. కర్నాటక హైకోర్టు మాత్రం మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారిస్తూ దస్తగిర్​కు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. 

సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తూ, కర్నాటక హైకోర్టు విధించిన శిక్షను కొట్టివేసింది. ఈ కేసు నేర ప్రవర్తనకు సంబంధించినదే కాదని తీర్పుచెప్పింది. వివాహానికి నిరాకరిస్తే అది సూసైడ్​కు ప్రేరేపణ కాదని చెప్పింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం, ఆత్మహత్యకు దారితీసే ఉద్దేశపూర్వక చర్యలేమీ కనిపించలేదని, నిందితుడు మహిళను రెచ్చగొట్టాడనేందుకూ ఎలాంటి ఎవిడెన్సులు లేవని పేర్కొంది. కాబట్టి సబంధాలు విచ్ఛిన్నం కావడం మానసిక బాధను కలిగించేదే, అయితే, దానిని ఆత్మహత్యకు ప్రేరేపించడంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.