గ్రూప్​ 1పై జోక్యం చేసుకోలేం..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం : సుప్రీంకోర్టు

  • ఓ వైపు అభ్యర్థులు ఎగ్జామ్స్​ రాస్తుంటే మరోవైపు వాయిదా వేయాలని ఎట్ల ఆదేశిస్తం
  • ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు అన్ని అంశాలు ప్రస్తావించింది
  • ప్రస్తుత పరిస్థితుల్లో తాము కల్పించుకోలేమని స్పష్టీకరణ
  • ఫలితాలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచన

న్యూఢిల్లీ, వెలుగు : గ్రూప్‌ 1 విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు  నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లోనే అన్ని అంశాలను  ప్రస్తావించిందని సీజేఐ బెంచ్ తెలిపింది. అయితే.. గ్రూప్​ 1 రిజల్ట్స్​కు  ముందే తుది విచారణను ముగించాలని హైకోర్టుకు సూచించింది. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 మెయిన్స్​ వాయిదా వేయాలని కోరుతూ పోగుల రాంబాబు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 తో తమకు అన్యాయం జరుగుతున్నదని పిటిషన్ లో పేర్కొన్నారు.

దీనిపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వం లోని జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన  త్రిసభ్య ధర్మాసనం విచారించింది.తొలుత ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఇప్పటికే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నప్పుడు స్టే ఎలా ఇస్తాం. ఇది గందరగోళానికి గురి చేస్తుంది’’ అని వ్యాఖ్యానించింది. ఇందుకు పిటిషనర్​ తరఫు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ... గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29ని తీసుకువచ్చిందన్నారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత..

అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్‌‌ 1 పరీక్ష జరుగుతున్నదని తెలిపారు. ‘‘జరుగుతున్నవి గ్రూప్ – 1 సర్వీస్ పరీక్షలు. ఎంతో కీలకమైనవి. మరోసారి వీటిని భర్తీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సారి అవకాశం కోల్పోతే, జీవితంలో తుది చాన్స్ ఉండదు. అందువల్ల జీవో 29 పై స్పష్టత వచ్చే వరకు పరీక్షలు నిర్వహించొద్దని కోరుతున్నం” అని నివేదించారు. మధ్యలో సీజేఐ జోక్యం చేసుకొని.. ఓ వైపు ఎగ్జామ్స్​ నడుస్తుంటే మరోవైపు వాటిని వాయిదా వేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏ విధంగా ఆదేశించగలమని ప్రశ్నించారు. ఇది అసాధారణమైన విషయమన్నారు.

కపిల్​ సిబల్ బదులిస్తూ... వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ వర్సెస్ బిపేంద్ర యాదవ్ కేసులోని తీర్పు వివరాలను బెంచ్ ముందుంచారు. అయినప్పటికీ... ఎలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆపగలమని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్లే నష్టపోతున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నామని సిబల్ వాదించారు. చాలా మంది అభ్యర్థులు వివక్షకు గురవుతున్నారని ఆయన  చెప్పారు. మరోసారి సీజేఐ బెంచ్ స్పందిస్తూ... తుది తీర్పుకు లోబడే  నియామకాలు జరపాల్సి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేసింది.

పిటిషన్​ తిరస్కరణ

గత నెల 31న ఈ కేసు రాష్ట్ర హైకోర్టు ముందు విచారణకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తరఫు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. టీజీపీఎస్సీ ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు ముందు కౌంటర్ ఫైల్ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను కౌంటర్ రూపంలో అందజేయనుందని వివరించారు. గత విచారణ సందర్భంగా... ఈ ఎగ్జామ్స్ పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ ప్రకటించేందుకు మూడు నెలల టైం కావాలని సర్వీస్ కమిషన్ సమాధానం ఇచ్చిందన్నారు.

మధ్యలో కపిల్​ సిబల్ జోక్యం చేసుకొని.. రిజల్ట్స్ కు మూడు నెలల టైం ఉన్నందున ఈ కేసును ఇప్పుడే విచారించి ఎగ్జామ్స్  వాయిదాకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. తుది తీర్పుకు లోబడే నియామకాలు జరపాల్సి ఉంటుందన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గుర్తుచేసింది.  ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ప్రస్తుత పరిస్థుతుల్లో ఎగ్జామ్స్​ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను తిరస్కరించింది.