సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం: దామోదర

  • సీఎం రేవంత్‌‌కు మాదిగ జాతి రుణపడి ఉంటదన్న మంత్రి దామోదర.. మాదిగ ఎమ్మెల్యేలతో భేటీ

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తీర్పు రాగానే వర్గీకరణ అమలు చేస్తామని, ఉద్యోగాల భర్తీలో సైతం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించటంపై మాదిగ జాతి ఆయనకు రుణపడి ఉంటుందని వెల్లడించారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మాదిగ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు సమావేశమయ్యారు. 

ఈ మీటింగ్‌‌కు విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కాలే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల శామ్యూల్, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, కొండ్రు పుష్పలీల, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ కాశీం, ఎస్‌‌ఎఫ్‌‌సీ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్‌‌కు చీఫ్ గెస్ట్‌‌గా హాజరైన మంత్రి దామోదర మీడియాతో మాట్లాడారు. ‘‘వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడే ఆట మొదలైంది. 

మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. జడ్జిమెంట్ కాపీలను అధ్యయనం చేయాలని అడ్వకేట్లను కోరుతాం. వర్గీకరణపై సుప్రీంకోర్టులో మీ అభిప్రాయాలను తెలపాలని సీఎం మాతో చెప్పారు. తీర్పు రాగనే సంతోష పడొద్దని, రిజర్వేషన్లు ఇచ్చే టైమ్‌‌లో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారో మనమంతా సీఎంకు చెప్పాలి”అని పేర్కొన్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో మాదిగల సమ్మేళనం నిర్వహించాలని, దీనికి సీఎం రేవంత్​ను ఆహ్వానిద్దామని దామోదర తెలిపారు. వర్గీకరణపై మొదట స్పందించింది సీఎం రేవంత్‌‌ రెడ్డేనని, ఆయనకు థ్యాంక్స్ చెబుతూ తీర్మానం చేద్దామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. 

ఐకమత్యం లేకపోవటంతో ఇబ్బందులు: పుష్ప లీల

‘‘దళితులలో ఐకమత్యం లేకపోవడంతోనే ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సీఎం ప్రకటన వెనుక మంత్రి దామోదర కృషి ఉంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఉషా మెహ్ర కమిటీ ముందు నేను చెప్పాను”అని పుష్పలీల పేర్కొన్నారు. 

50 ఏండ్ల పోరాటం: సత్యనారాయణ  

‘‘50 ఏండ్ల పోరాటానికి తెరదించుతూ సుప్రీంకోర్టు రిజర్వేషన్లను ప్రకటించింది. మాదిగలను మొదటగా గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్ అయితే వర్గీకరణను తీసుకొచ్చింది చంద్రబాబు. తీర్పు తర్వాత ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం ప్రకటించటం అభినందనీయమం. మాదిగల సమ్మేళాన్ని సక్సెస్‌‌ చేయండి”అని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. 

వర్గీకరణ అమలుపై త్వరలో కమిటీ: వేముల వీరేశం 

‘‘రాష్ట్రంలో వర్గీకరణ అమలుపై దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీ ముందు అందరి అభిప్రాయాలు తెలపండి. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా జడ్జిమెంట్ అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది”అని వీరేశం పేర్కొన్నారు. 

 పదేళ్లు ఉషామెహ్ర కమిటీని పక్కన పెట్టారు: సంపత్  

‘‘వర్గీకరణ కోసం గత యూపీఏ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిటీ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనినే. త్వరలో మాదిగ సమ్మేళనం సభ పెట్టుకుందాం. పదేండ్లు మోదీ అధికారంలో ఉండి ఉషామెహ్ర కమిటీని పక్కన పెట్టారు. ఐదు దశాబ్దాల పోరాటం ఈ జడ్జిమెంట్‌‌కు కారణం. వర్గీకరణ అంశాన్ని నేను అసెంబ్లీలో ఎన్నోసార్లు ప్రస్తావించాను”అని సంపత్​కుమార్​ గుర్తుచేశారు.

ఆర్డినెన్స్‌‌తో రిజర్వేషన్లు కల్పిస్తామనడం హర్షణీయం: అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ 

‘‘ఎన్నో ఏండ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌‌లో వర్గీకరణ కేసుపై తీర్పు రావడానికి మంత్రి దామోదర రాజనర్సింహ కృషి కూడా ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వర్గీకరణపై ఆయన తీర్మానం చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉషా మెహ్ర కమిటీని ఏర్పాటు చేసింది. గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయం. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌కు కృతజ్ఞతలు. ఎల్బీ స్టేడియంలో మాదిగల సమ్మేళనంతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం”అని ఆయన వెల్లడించారు.