ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఓకే

  • ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి
  • 6:1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు 
  • సీజేఐ సహా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా.. వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది
  • 2004 నాటి ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కనపెట్టిన కోర్టు
  • విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉప వర్గీకరణ చేయొచ్చని వెల్లడి  
  • అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ 

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మూడు దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అణగారిన ఎస్సీ, ఎస్టీల్లోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లలో సబ్ కోటా కల్పించేందుకు ఉప వర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది.

విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని వెల్లడించింది. అయితే రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయాల్సి వస్తే, అందుకు అవసరమైన డేటాను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతే తప్ప ఇష్టానుసారంగా, రాజకీయ ప్రయోజనాల కోసం వర్గీకరణ చేపట్టకూడదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వర్గీకరణ న్యాయ సమీక్షకు అనుకూలంగా ఉండాలని పేర్కొంది. ఈ తీర్పును అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి గైడ్ లైన్స్ రూపొందించుకోవాలని సూచించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో గురువారం తీర్పు వెలువరించింది. 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. రాజ్యాంగ ధర్మాసనంలోని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థించగా.. జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు.

మొత్తం 565 పేజీల్లో న్యాయమూర్తులు తమ తీర్పును వెలువరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటికి తోడు మరో 22 పిటిషన్లు కూడా ఫైల్ అయ్యాయి. వీటన్నింటిపై సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. 

రాజ్యాంగం అనుమతిస్తుంది: సీజేఐ 

సమాజంలో వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీలు ఎదగలేకపోతున్నారని మెజారిటీ బెంచ్ పేర్కొంది. ఒక కులంలో ఉప వర్గీకరణకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14  అనుమతిస్తుందని స్పష్టం చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ కులాల్లోని వర్గాలన్నీ ఒకే విధంగా లేవు. ఆర్థికంగా, సామాజికంగా అసమానతలు ఉన్నాయి. అందువల్ల ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ప్రకారం.. ఎస్సీ, ఎస్టీల జాబితాను తయారు చేసే హక్కు  రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రాలు ఆ జాబితాను వర్గీకరణ చేస్తున్నందున, ఆర్టికల్ 341ను ఉల్లంఘించినట్టు కాదు.

అలాగే ఆర్టికల్ 15, 16 కింద రాష్ట్రాలు కుల వర్గీకరణ చేయవచ్చు” అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఆయన 140 పేజీల్లో తన తీర్పు రాశారు. 

వివక్షే ఉప వర్గీకరణకు కారణం: జస్టిస్ బీఆర్ గవాయ్  

వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్ర విధి అని జస్టిస్ బీఆర్ గవాయ్ తన తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీల్లోని కొన్ని వర్గాలు శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నాయి. ఈ గ్రౌండ్ రియాల్టినీ మనం తిరస్కరించలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు సంబంధించినది కాదు. అది కేవలం ఎస్సీ, ఎస్టీలను గుర్తించడానికి అవసరమైన నిబంధన మాత్రమే. ఈవీ చిన్నయ్య కేసులో ఆర్టికల్ 341ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆర్టికల్ 341, 342 రిజర్వేషన్లకు సంబంధించినవి కాదని నేను పునరుద్ఘాటిస్తున్నాను. అందువల్ల ఎస్సీ, ఎస్టీల్లోని ఏదైనా వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రాల వారీగా ఉప వర్గీకరణ చేపట్టవచ్చు” అని చెప్పారు. ఒక పెద్ద సమూహంలోని చిన్న సమూహం మరింత వివక్షను ఎదుర్కొంటున్నదని, ఉప -వర్గీకరణ డిమాండ్ కు ఇదే కారణమని ఆయన పేర్కొన్నారు.  

ఆర్టికల్ 341కు వ్యతిరేకం: జస్టిస్ త్రివేది 

ఆర్టికల్ 341 కింద రాష్ట్రపతి నోటిఫై చేసే ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాను రాష్ట్రాలు మార్చలేవని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. పార్లమెంట్ రూపొందించిన చట్టం ద్వారా మాత్రమే కులాలను రాష్ట్రపతి జాబితాలో చేర్చవచ్చు లేదా తొలగించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఉప- వర్గీకరణ అనేది రాష్ట్రపతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ జాబితా తయారీలో రాజకీయ నాయకుల పాత్ర లేకుండా చేయడమే ఆర్టికల్ 341  ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. అందువల్ల ఈ ఉప వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నట్టు తీర్పులో పేర్కొన్నారు.  

క్రీమీలేయర్ వర్తింపజేయాలి..  

ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రీమీలేయర్‌‌‌‌ వర్తింపజేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని తన జడ్జిమెంట్ లో పేర్కొన్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా ఏకీభవించారు. ఓబీసీలకు వర్తించే క్రీమీలేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్లను ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మిథాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నత స్థితికి చేరుకుంటే, రెండో తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఏకీభవించారు. 

ఇదీ వివాదం... 

ఎస్సీ రిజర్వేషన్లలో 50 శాతం వాల్మీకి, మజ్హబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం 2006లో చట్టం తెచ్చింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ కులంలోని ఇతర వర్గాలు పంజాబ్,  హర్యానా హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పంజాబ్ సర్కార్ కు వ్యతిరేకంగా 2010లో తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఏ సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తీసివేయాలన్నా పార్లమెంట్ కు మాత్రమే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది.

దీంతో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కార్ 2011లో సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇదే అంశంపై మరో 22 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ కూడా ఎస్సీ వర్గీకరణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించేందుకు రాజ్యాంగ ధర్మాసనం అవసరమని 2020 ఆగస్టు 27న జస్టిస్‌‌  అరుణ్‌‌  మిశ్రా (ప్రస్తుతం రిటైర్డ్) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దీంతో ఏడుగురు సభ్యులతో ఏర్పడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

వాదించింది వీళ్లే...

కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కాను అగర్వాల్‌‌ తో పాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పంజాబ్ రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ షాదాన్ ఫరాసత్, అడ్వొకేట్లు అభిషేక్ బబ్బర్, హర్షిత్ ఆనంద్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎస్.మురళీధర్, ఎమ్మార్పీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు.

ఉప వర్గీకరణకు మద్దతుగా మరికొందరు న్యాయవాదులు శ్రద్ధా దేశ్‌‌ ముఖ్, రాకేశ్ ఖన్నా వాదించగా.. వ్యతిరేకిస్తూ ప్రతివాదుల తరఫున లాయర్లు మనోజ్ స్వరూప్, సాకేత్ సింగ్ వాదించారు. అలాగే తమిళనాడు, హర్యానా రాష్ట్రాల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. వీరితో పాటు సీనియర్ అడ్వొకేట్లు గోపాల్ శంకరనారాయణ, నిదేశ్ గుప్తా, కపిల్ సిబల్, సంజయ్ హెగ్డే, శేఖర్ నఫాడే, సల్మాన్ ఖుర్షీద్, విజయ్ హన్సారియా, దామా శేషాద్రి నాయుడు వర్గీకరణకు అనుకూలంగా వాదించారు.