తీహార్​ జైలు నుంచి కవిత రిలీజ్​

  • లిక్కర్​ స్కాంలో బెయిల్​ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • 10 లక్షల చొప్పున పూచీకత్తు.. పాస్​పోర్ట్​ సమర్పించాలని ఆదేశం
  • విచారణ పూర్తి అయినందున జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్న కోర్టు
  • 153 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్​
  • నేను మొండిదాన్ని, జగమొండిని చేశారు
  • నన్ను ఇబ్బంది పెట్టినోళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా: కవిత
  • జైలు బయట కుటుంబ సభ్యులను చూసి కంటతడి

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఆమెకు  సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో రూ. 10 లక్షల చొప్పున పూచీకత్తు విధించింది. అలాగే పాస్ పోర్ట్ లను ట్రయల్(రౌస్ ఎవెన్యూ) కోర్టులో అందజేయాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని, ఆధారాలను చెరిపేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా రెగ్యులర్ గా ట్రయల్ కోర్టు ముందు హాజరుకావాలని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలనే కండిషన్లను పెట్టింది. 

అలాగే, కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 1 న ఇచ్చిన ఆదేశాలను పక్కనపెడుతున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు(ట్రయల్), ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించాయి. దీంతో ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఈ నెల 7 న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్​, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. దాదాపు గంట 20 నిమిషాలపాటు సుదీర్ఘ వాదనలు సాగాయి. 

పిటిషనర్ కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ, విక్రమ్ చౌదరి, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) ఎస్వీ రాజు హాజరయ్యారు. తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ... ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న మనీశ్​ సిసోడియాకు బెయిల్ మంజూరైందని కోర్టు  దృష్టికి తెచ్చారు. కవితపై ఈడీ, సీబీఐలు వరుసగా చార్జ్ షీట్ దాఖలు చేశాయని, కేసు విచారణ పూర్తయిందని నివేదించారు. కానీ ఈడీ కేసులో 5 నెలలు, సీబీఐ కేసులో 4 నెలల నుంచి కవిత కస్టడీలోనే ఉన్నారని వివరించారు. 

Also Read:-కవిత బెయిల్​పై పొలిటికల్​ హీట్​ .. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే

రెండు కేసుల్లో మొత్తం 493 మంది సాక్షులు, దాదాపు 50 వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. అయితే, విచారణ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కవిత మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ అని, అందువల్ల ఆమె దేశం విడిచిపోయే పరిస్థితి ఉండబోదన్నారు. అందువల్ల ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45 ప్రకారం.. ఆమె బెయిల్ కు అర్హురాలని వాదించారు.

ఆధారాలను కవిత ట్యాంపర్ చేశారు : ఎస్వీ రాజు

లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర, ఆధారాలను చెరిపేయడం, సాక్షులను ప్రభావితం చేసిన తీరును ప్రస్తావిస్తూ దర్యాప్తులో తేలిన అంశాలను ఎస్వీ రాజు కోర్టు ముందు ఉంచారు. ఈ కేసులో కవిత సహ నిందితులతో మాట్లాడిన ఫోన్​లో కాల్ రికార్డులు, ఫేస్ టైమ్ డేటా, మెసేజ్​లు కూడా తొలగించబడ్డట్టు గుర్తించామన్నారు. ఆధారాలను ట్యాంపర్ చేశారని, తన ఫోన్ లోని కీలక డేటాను ఫార్మాట్ చేశారని చెప్పారు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోన్​లో కొన్ని మెసేజ్​లు దొరికాయని చెప్పారు.  దీనిపై స్పందించిన జస్టిస్ కేవీ విశ్వనాథన్.. ‘ఎవరా నిందితుడు’ అని ప్రశ్నించారు.  దీంతో గౌతమ్ ముత్తా పేరును ఎస్వీ రాజు వెల్లడించారు. జస్టిస్ విశ్వనాథన్ జోక్యం చేసుకొని.. ఫోన్ ఫార్మాట్​కు, ఫోన్ ట్యాంపరింగ్​కు చాలా తేడా ఉందన్నారు. ‘‘ఫోన్లు అనేవి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి. ఫోన్లలో మెసేజ్‌‌‌‌లు అందరూ డిలీట్‌‌‌‌ చేస్తారు. స్కూళ్లు, కాలేజీ గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌‌‌‌లను నేను కూడా డిలీట్‌‌‌‌ చేస్తుంటా. 

సాధారణంగా అందరూ చేసేదే ఇది. ఇక్కడున్నవాళ్లు ఇదే చేస్తుంటారు. కేవలం ఫోన్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ చేసినంత మాత్రాన నేరం చేసినట్టు భావించకూడదు. నేర నిరూపణకు అదనపు సమాచారం ఉండాలి. లేదంటే కేవలం ఇది ఫోన్‌‌‌‌ను ఫార్మాట్‌‌‌‌ చేయడం కిందికే వస్తుంది’’ అని జస్టిస్‌‌‌‌ విశ్వనాథన్‌‌‌‌ వ్యాఖ్యానించారు. ఇందుకు రాజు బదులిస్తూ... ఇది సాధారణ ఫార్మాటింగ్, సున్నితమైన డేటా కాదని పేర్కొన్నారు. ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పని వారికి ఇచ్చారని, ఇది సాక్ష్యాలను తారుమారు చేయడమే అని వాదించారు. రెండేండ్లుగా వాడిన ఫోన్లను ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన తర్వాత.. 

కవిత తన ఫోన్​ను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్నారు. అలాగే, కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత అరుణ్ రామ చంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. దీంతో మరోసారి జోక్యం చేసుకొన్న ధర్మాసనం.. అరుణ్ రామ చంద్ర పిళ్లై స్టేట్​మెంట్​ కాకుండా.. ఇతర లీగల్ ఆధారాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. ‘మీరు రివర్స్​గా వాదిస్తున్నారు. ఆమె నేరంలో పాల్గొన్నట్టు చూపించడానికి మెటీరియల్స్ ఏమిటి?’అని ఎస్జీని జస్టిస్ గవాయ్​ ప్రశ్నించారు. 

ఎలాంటి ఆధారాలు లేవు : ముకుల్​ రోహత్గీ

లిక్కర్​ పాలసీలో కవిత పాత్ర ఉందని చెప్పేందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలేంటని ఈడీ, సీబీఐలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థల తరఫున అడిషినల్‌‌‌‌ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎస్వీ రాజు బదులిస్తూ.. సాక్షులుగా మారిన బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఆధారాలను ప్రస్తావించారు. కాగా,  ముకుల్‌‌‌‌ రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాల్లోనే అనేక అంశాలను ఇతర  కేసుల్లో ఆధారాలుగా చూపించారని గుర్తుచేశారు. ‘‘కేజ్రీవాల్‌‌‌‌ కింగ్​పిన్​, మనీశ్‌‌‌‌ సిసోడియా కింగ్​పిన్​.

 ఇప్పుడు కవిత కింగ్​పిన్​ అని చెబుతున్నారు. అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్లు మినహా ఎటువంటి ఆధారాలు లేవు’’ అని అన్నారు. మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి కి అప్రూవర్లుగా మారిన వారంలోనే బెయిల్​ వచ్చిందని చెప్పారు. ఈడీ, సీబీఐల ఈ విధానంపైనే తాము అభ్యంతరం తెలుపుతున్నామని చెప్పారు.  అప్రూవర్లు ఇచ్చిన స్టేట్​మెంట్లు మినహా.. 

దర్యాప్తు సంస్థల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇందుకు ఎస్వీ రాజు అభ్యంతరం తెలుపగా.. జస్టిస్ బీఆర్ గవాయ్​ కలుగజేసుకొని.. కొంత డిసిప్లేన్ గా వ్యవహరించాలని మందలించారు. కాగా, కవిత నుంచి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, సాక్షులను బెదిరించినట్టు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలు వట్టివే అని రోహత్గీ వాదించారు.  

ఈ విధానం సరికాదు : సుప్రీం బెంచ్​

నిందితుల్లో కొందరిని అప్రూవర్లుగా పరిగణించడంలో ప్రాసిక్యూషన్ విధానాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. ఈడీ కేసులో బుచ్చిబాబు, గౌతమ్ ముత్తా, మాగుంట రాఘవ పాత్రలపై జస్టిస్ గవాయ్​ ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ... బుచ్చిబాబు, గౌతమ్ ముత్తా ఈడీ కేసులో నిందితులుగా లేరని, సీబీఐ కేసులో అప్రూవర్లుగా మారినట్టు ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. మాగుంట రాఘవ రోల్ మనీలాండరింగ్ లో లేదన్నారు. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన బెంచ్.. ‘ఇప్పటి వరకు మీరు వాదించిన వాదనలతో మీరే ఏకీభవించకపోతే ఎలా? 

తండ్రి మాగుంట శ్రీనివాసులు చెప్పినట్టు రాఘవ రెడ్డి, కవితకు బదులు బుచ్చిబాబుకు రూ.25 కోట్లు ఇచ్చారన్నారు. మరి ఇప్పుడు ఇలా మాట మార్చడం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ప్రాసిక్యూషన్ న్యాయంగా ఉండాలి. తనను తాను నేరారోపణ చేసే వ్యక్తిని సాక్షిగా మార్చారు. రేపు ఎవరినైనా మీ ఇష్టం వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటారా? అలా చేసుకోలేరు. ఏ ఆరోపణ అయినా న్యాయమైన, సహేతుకంగా విచక్షణతో ఉండాలి’ అని సూచించింది. కేవలం బెయిల్ మ్యాటర్స్ గురించి గంటన్నర పాటు వాదనలు సరికాదని పేర్కొన్నది. 

మహిళలకు సంబంధించి సీఆర్పీసీ, పీఎంఎల్ఏ, ఇతర సెక్షన్ల కింద పలు మినహాయింపులు ఉన్నాయని తెలిపింది. దీనిపై వాదించాలని సూచించింది. అయితే, మధ్యాహ్నం తర్వాత ఫైనల్ వాదనలు వినిపిస్తామని ఎస్వీ రాజు అభ్యర్థించగా.. మధ్నాహ్నం అయినంత మాత్రాన తమ తీర్పు దర్యాప్తు సంస్థలకు అనుకూలంగా ఉండబోదని స్పష్టం చేసింది. కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. 

మూడు కారణాలతో బెయిల్ 

కవిత కు మూడు ప్రధాన కారణాలతో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేసిందని, మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు పూర్తయినట్టు పేర్కొన్నది. అలాగే, నిందితురాలు ఇకపై జైల్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముఖ్యంగా మహిళగా కూడా పరిగణించా ల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ కారణాల తో కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

చదువుకున్నారనే కారణంతోబెయిల్​ వద్దనడం తప్పు

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45(1) ప్రకారం బెయిల్ విషయంలో మహిళలు ప్రత్యేక పరిశీలనకు అర్హులని బెంచ్ స్పష్టం చేసింది. అసాధారణ మహిళగా పేర్కొంటూ కవితకు హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.‘ఇలాంటి తీర్పులు వెలువరించే సమయంలో కోర్టులు న్యాయపరంగా విచక్షణను ఉపయోగించాలి. కేవలం ఒక మహిళ బాగా చదువుకుంటే, అధునాతమైనది(సోఫెస్టికేటెడ్), పార్లమెంట్ సభ్యురాలు, శాసన మండలి సభ్యులు అయినంత మాత్రాన బెయిల్ కు అర్హత లేదని చెప్పొద్దు’అని కోర్టు పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు.. సెక్షన్ 45 కు సంబంధించిన నిబంధలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది. ఆ తీర్పును పక్కన పెడుతున్నట్టు స్పష్టం చేసింది.