సెక్షన్‌‌‌6ఏ రాజ్యాంగబద్ధమే.. అస్సాంకు మాత్రమే ప్రత్యేకం: సుప్రీంకోర్టు

గువాహటి: సిటిజన్ షిప్ యాక్ట్ –1955లోని సెక్షన్‌‌‌‌ 6 ఏ.. రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌‌‌‌, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రా మద్దతు తెలపగా.. జస్టిస్ జేబీ పార్దివాలా ఈ తీర్పును విభేదించారు. 

పౌరసత్వ చట్టం- 1955  సెక్షన్‌‌‌‌ 6ఏ ప్రకారం.. 1966, జనవరి 1 నుంచి 1971, మార్చి 25లోపు బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు అని నలుగురు జడ్జిలు తెలిపారు. కటాఫ్‌‌‌‌ డేట్‌‌‌‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 సరైందేనని  చెప్పారు. బంగ్లాదేశ్‌‌‌‌ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్‌‌‌‌ తీసుకొచ్చిన విషయాన్ని సెక్షన్ 6ఏ చెప్తున్నదని తెలిపారు. తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు.

‘‘కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపజేయవచ్చు. కానీ, సెక్షన్ 6ఏ అస్సాంకు మాత్రమే ప్రత్యేకం.. దీనిని ఇతర ప్రాంతాలకు వర్తింపజేయలేం. వలసదారుల సంఖ్య పెరగడంతో అస్సాం సంస్కృతిపై ప్రభావం పడుతోంది. అస్సాంలో 40 లక్షల మంది వలసదారులు ఉండగా.. బెంగాల్‌‌‌‌లో 57 లక్షల మంది ఉన్నారు’’ అని  జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 

అస్సాంలోకి బంగ్లాదేశ్‌‌‌‌ వలసలపై ఉద్యమించినవారితో కేంద్ర ప్రభుత్వం 1985, ఆగస్టు 15న చేసుకున్న ఒప్పందమే ఇది అని చెప్పారు. అక్రమ వలసలకు అస్సాం అకార్డ్‌‌‌‌ ఓ రాజకీయ పరిష్కారం అని వివరించారు. 1971, మార్చి 25 తర్వాత బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా ప్రకటించారని, అందువల్ల వారికి సెక్షన్ 6ఏ వర్తించదని జస్టిస్ సూర్యకాంత్ తీర్పులో పేర్కొన్నారు. అలాంటి వారికి ఇండియన్ సిటిజన్ షిప్ ఇవ్వలేరని తెలిపారు.