మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

  • ఐబీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేత 
  • అక్కడ 4.22 ఎకరాల్లో దవాఖాన నిర్మాణం 
  • మొత్తం 600 బెడ్స్​లో 225 బెడ్స్​తో ఎంసీహెచ్
  • నిర్మాణ వ్యయం రూ.300 కోట్లుగా అంచనా
  • బడ్జెట్​లో రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది. జిల్లా కేంద్రంలోని ఐబీ స్థలంలో 4.22 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కానుంది. ఐబీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ను కూల్చేసి దానిస్థానంలో హాస్పిటల్ నిర్మించనున్నారు. మొత్తం 600 బెడ్స్​లో 225 బెడ్స్​తో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్)ను ఏర్పాటు చేయనున్నారు.

 ప్రస్తుతం గోదావరి ఒడ్డున ముంపు ప్రాంతంలో ఉన్న ఎంసీహెచ్ ఇక్కడికి తరలించనున్నారు. మిగతా 375 బెడ్స్ కెపాసిటీతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించగా, 2024–25 బడ్జెట్​లో రూ.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 

వ్యతిరేకించినా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఐబీ స్థలంలో బీఆర్ఎస్ సర్కారు రూ.7.60 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే జీ+2 వరకు స్లాబ్​లు వేసి సుమారు రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు మొదటినుంచి వ్యతిరేకిస్తూ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా మార్కెట్ నిర్మాణం తలపెట్టింది. కాంట్రాక్టర్​కు బిల్స్ చెల్లించకపోవడంతో రెండేండ్లుగా పనులు నిలిచిపోయాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ఐబీలో స్పూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ప్రస్తుతం గంగొడ్డున ఉన్న ఎంసీహెచ్​ను ఇక్కడికి తరలిస్తామని ప్రకటించి గత గురువారం మార్కెట్ కూల్చివేతను ప్రారంభించారు. అలాగే ప్రస్తుత కూరగాయల మార్కెట్ స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. 

సూపర్ స్పెషాలిటీ, ఎంసీహెచ్ ఒకే ప్రాంగణంలో..

ఐబీలోని ఆర్అండ్​బీకి చెందిన 4.22 ఎకరాల స్థలాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్ అప్పగించారు. మార్కెట్​తో పాటు ఐబీ ప్రాంగణంలో ఉన్న ఆర్అండ్​బీ డివిజన్ ఆఫీస్, అధికారుల క్వార్టర్, ఆర్డీవో ఆఫీస్ బిల్డింగులను సైతం తొలగించనున్నారు. వీటి స్థానంలో ఐదు నుంచి ఏడంతస్తుల్లో హాస్పిటల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. సూపర్ స్పెషాలిటీతో పాటు ఎంసీహెచ్ ను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు కానున్నాయి. 

పనులు ప్రారంభించినప్పటి నుంచి రెండున్నరేండ్లలో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే మంచిర్యాలతో పాటు సమీప ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి సహా మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అనేక వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్​కు వెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది. 

రెండున్నరేండ్లలో కంప్లీట్ చేస్తాం... 

మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను రెండున్నరేండ్లలో పూర్తిచేస్తామని ఎమ్మెల్యే  ప్రేమ్సాగర్​రావు తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించడంతో పాటు ఆర్థిక స్తోమత ఉన్నవారి కోసం పేమెంట్ బ్లాక్​ను సైతం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. 

జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్​లోని కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. హాస్పిటల్​కు అనుబంధంగా రూ.50 కోట్లతో నర్సింగ్ కాలేజీ సైతం ఏర్పాటు కానుందని తెలిపారు.