సునీతను తీసుకొచ్చేందుకు మరో స్పేస్​​క్రాఫ్ట్

  • రెండు ఖాళీ సీట్లతోఅంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ క్రూ9
  • ఈ నెల 24న ప్రయోగం..2025 ఫిబ్రవరిలో తిరిగి రాక 

వాషింగ్టన్: అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్ మోర్ ను తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం త్వరలో చేపట్టనున్న స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ లో కీలక మార్పులు చేసింది. స్పేస్ ఎక్స్ క్రూ9 క్రాఫ్ట్ లో నలుగురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపాల్సి ఉండగా, ఆ సంఖ్యను రెండుకు కుదించింది. 

ఈ క్రాఫ్ట్ లో రెండు సీట్లను ఖాళీగా ఉంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు పంపాలని, అది తిరిగి వచ్చేటప్పుడు ఐఎస్ఎస్ లో ఉండిపోయిన సునీతా విలియమ్స్, బారీ విల్ మోర్ ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ ను ఈ నెల 24న నాసా చేపట్టనుంది. మిషన్ కమాండర్ గా నిక్ హేగ్, మిషన్ స్పెషలిస్టుగా అలెగ్జాండర్ గోర్బునోవ్ వ్యవహరిస్తారు. 

2025 ఫిబ్రవరిలో వీళ్లిద్దరితో కలిసి సునీతా విలియమ్స్, బారీ విల్ మోర్ భూమికి తిరిగొస్తారు. ‘‘కొన్ని కారణాల వల్ల స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ సిబ్బందిని మార్చాం. ఇప్పుడు సిబ్బంది సంఖ్యను తగ్గించాం. ఇది చాలా కఠినమైన నిర్ణయం. మిషన్ నుంచి తప్పించిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ జెనా కార్డ్ మాన్, స్టెఫానీ విల్సన్​కు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తాం” అని నాసా చీఫ్ ఆస్ట్రోనాట్ జో అకాబా తెలిపారు. కాగా, నిక్ హేగ్​కు ఇది మూడో మిషన్. ఆయన ఇంతకుముందు ఒకసారి ఐఎస్ఎస్ కు వెళ్లొచ్చారు. 200 రోజులకు పైగా స్పేస్​లో ఉన్నారు. 

ఇక అలెగ్జాండర్ గోర్బునోవ్​కు ఇదే ఫస్ట్ మిషన్.
మూడు నెలలుగా అంతరిక్షంలో.. 

భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్​ బారీ విల్ మోర్ దాదాపు మూడు నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. బోయింగ్​కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఓ మిషన్ కోసం ఈ ఏడాది జూన్ 5న ఐఎస్ఎస్ కు వెళ్లారు. 8 రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉండి తిరిగి భూమికి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్​లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు.