Health Tips: మండే సూర్యుడికి ఇలా చెక్​ పెట్టండి..

ఎండాకాలం, మండేకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి  ‌నెల  నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి రోజు రోజుకు  ఎండలు మరింత ముదురుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండాకాలంలో అనేక రుగ్మతలు మొదలవుతాయి. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అతి జాగ్రత్త వహించాల్సిన కాలం. ఎండలకు ఉష్ణోగ్రతలు పెరిగి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35 డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో ఉండేవి .  కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మరీ ఈ ఏడాది (2024) అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచే  సూర్య భగవానుడి ప్రతాపం మొదలైంది. 40  డిగ్రీలకు పైగా  వేడి నమోదు కావడం మామూలై పోయింది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  

భానుడు మరీ మండిపడుతున్నాడు.   దీని వలన సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొలాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి.  సాధ్యమయినంత వరకు మద్యాహ్న వేళలు బయటకు రాకుండా ప్లాన్​ చేసుకోండి. తప్పని సరి పరిస్థితిలో రావలసి వస్తే మధ్య మధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.

ఇల్లు దాటకుండా ఉంటే కనీసం 2 లీటర్లు, బయటకు వెళ్ళేవాళ్ళు మరో లీటరు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా పళ్ళరసాలు తీసుకోవాలి. ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు, సన్‌ ‌స్క్రీన్‌ ‌లోషన్స్, ‌క్యాప్‌..‌వదులైన దుస్తులు ధరించాలి. తేలికైన వదులుగా ఉన్న లేత రంగుల వస్త్రాలు ధరించాలి. ఆల్కాహాల్‌, ‌కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్‌ ‌కలిగిస్తాయి కనుక వేసవిలో వాటికి దూరంగా ఉండాలి. 

ఎండలో ఎక్కువ శ్రమతో కూడిన పనులు నివారించ గలిగితే మంచిది. అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, నిమ్మరసం, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవడం ఎంతో మేలు. అలాగే కీరదోస, క్యారట్‌, ‌బీట్‌రూట్‌ ‌లాంటి పచ్చి కూరగాయలను కూడా తినవచ్చు.

రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నీరు కలిసిన మాయిశ్చరైజింగ్‌ ‌క్రీము రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్‌ ‌వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారి పోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా శుభ్రం చేసుకోవాలి.. 

ఎండలో ఎక్కువ సేపు గడపాల్సి వస్తే మాత్రం ఈ జాగ్రత్తలని పాటించండి. ఎక్కువగా చెమట పట్టే వాళ్లు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు తేమ కలిగిన సబ్బులకు బదులు వేప ఔషధాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తే చెమట దుర్వాసన మాయం చేయవచ్చు. ఎండాకాలంలో సింథటిక్‌ ‌వస్త్రాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. నూలు దుస్తులను ధరించడం శ్రేయస్కరం. నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం, మసాలాలను వీలైనంత వరకు తగ్గించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.