సమ్మర్​ సీజన్​ లో​ హాలిడేస్​ ట్రిప్  ప్లాన్​ చేస్తున్నారా.... సౌత్​ ఇండియాలో  కూలింగ్​ స్పాట్స్​ ఇవే.. 

సమ్మర్​ వచ్చేసింది.  కొద్ది రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులు కూడా ఇచ్చేస్తారు.  వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది హాలిడేస్​ ట్రిప్​నకు ప్లాన్​ చేస్తుంటారు.  కొంతమందైతే దానికి సపరేట్​ గా బడ్జెట్​ కూడా కేటాయిస్తారు.  మరి వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలని  ఆలోచిస్తున్నారా..   ఎండ వేడి తాకని చోటుకు వెళ్లాలని ఉందా.. అయితే దక్షిణ భారత దేశంలో  అలాంటి చల్లని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. . . .

 చల్లని ప్రదేశంలో సహజ సౌందర్యాన్ని చూస్తూ... కొన్ని రోజులు గడిపితే మెదడు, శరీరం రిఫ్రెష్ అవుతాయి. వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్న వారు ఓసారి దక్షిణ భారతదేశంలో ఉన్నాయి.  ఇవి చల్లగా ఉండడమే కాదు కనువిందుగా ఉంటాయి. సాంస్కృతిక వైవిధ్యాలను కలిగి ఉంటాయి. ఆ ప్రాంతాలకు  వెళ్తే మళ్లీ తిరిగి రావాలని కూడా అనిపించదు. అంత అందంగా ఉంటాయి.

ఊటీ:  దీన్ని ఉదగమండలం అని పిలుస్తారు. ఇది ఒక అందమైన కొండపట్టణం. తమిళనాడులోని నీలగిరి కొండల మధ్యలో ఉంది ఇది. ఏడాది పొడవునా చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిండి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి.  ఇక్కడ ఉండే సొరంగాలు, వంతెనలు, జలపాతాలు, అందమైన గ్రామీణ ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఊటీ సరస్సు ఒడ్డున కూర్చుంటే అక్కడ నుంచి రావాలనిపించదు. పర్వతాలలో ట్రెక్కింగ్, క్యాంపింగ్, గుర్రపు స్వారీ వంటి ఎన్నో కాలక్షేపాలు సిద్ధంగా ఉంటాయి. ఊటీలో చేత్తో చేసిన చాక్లెట్లు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే. ఇక్కడున్న బొటానికల్ గార్డెన్స్ లో అరుదైన ఆర్కిడ్లు, బోన్సాయి మొక్కలు... ఇలా ఎన్నో విదేశీ మొక్కలు అలరిస్తాయి.  అక్టోబర్ నుంచి జూన్ నెల మధ్య. అక్కడ వాతావరణం చాలా అందంగా ఉంటుంది. వేసవి సెలవులు వస్తే ఎంతోమంది ఊటీకి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న సుసంపన్నమైన వృక్ష సంపద, కొండలు కళ్ళకు కనువిందు చేస్తాయి.

కూర్గ్: కర్ణాటకలో ఉన్న ఒక అందమైన ఊరు కూర్గ్. దీన్ని కొడగు అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కాఫీ ఎస్టేట్లు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.  జలపాతాలు, పొగ మంచు నిండిన పర్వతాలు, కాఫీ తోటలకు ఇది ప్రసిద్ధి చెందింది.దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అతిథులను స్వాగతిస్తుంది. కూర్గ్‌లో అక్కి రోటి, పండి కూర వంటివి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ హైకింగ్, క్యాంపింగ్, రివర్ రాస్టింగ్ వంటివన్నీ చెయ్యొచ్చు.  అక్టోబర్​ నుంచి మే వరకు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఇక్కడున్న అబ్బే జలపాతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దట్టమైన వృక్షాలతో కూర్గ్ అందంగా కనిపిస్తుంది. 

కొడైకెనాల్ : తమిళనాడులో ఉన్న మరొక అందమైన హిల్ రిసార్ట్ కొడైకెనాల్. కొండలు, నిర్మలమైన సరస్సులతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొడైకెనాల్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి జూన్ మధ్యకాలం.  కొడైకెనాల్ సరస్సు మానవ నిర్మిత సరస్సు. అంటే మనుషులు చేతితో తవ్వడం ద్వారా ఏర్పడిన సరస్సు ఇది. కొడైకెనాల్‌లో ప్రధాన ఆకర్షణగా దీన్ని చెప్పుకుంటారు.

మున్నార్ : కేరళలోని అందమైన పట్టణం మున్నార్. ఎంతోమంది తమ జీవితంలో ఒకసారైనా మున్నార్ వెళ్లాలని అనుకుంటారు.  ఇది సముద్ర ప్రాంతానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి బోటింగ్, ఫిషింగ్ వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టీ తోటలతో నిండిపోయి ఉంటుంది. మున్నార్ సందర్శించడానికి సెప్టెంబర్ నుంచి మే మధ్యలో సందర్శించవచ్చు.అక్కడ అందమైన ప్రాంతాలు, తేయాకు తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. 

వాయనాడ్: కేరళలోని ఒక ప్రశాంతమైన కొండ పట్టణం వాయనాడ్. ఈ ప్రాంతం ఏడాది పొడవునా అందంగా ఉంటుంది. ఇక్కడున్న బాణాసుర సాగర్ డ్యాం... మనదేశంలోనే అతిపెద్ద మట్టి ఆనకట్ట. ఇక్కడ బోటింగ్, ఫిషింగ్ వంటివి చేయవచ్చు. శిల్పాలు, శాసనాలు, పురాతన గుహలు సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇక్కడున్న జూ చిరుత పులి, ఏనుగులు వంటి వాటితో నిండి ఉంటాయి. ఎన్నో అంతరించిపోతున్న మొక్కలకు ఇక్కడ కనిపిస్తాయి. 

ఏర్కాడ్ : తమిళనాడులోని మరొక అందమైన హిల్ స్టేషన్ ఏర్కాడ్. ఇందులో కాఫీ పొలాలు, నారింజ తోటలు నిండుగా ఉంటాయి. ఏడాది పొడవునా ఇక్కడ ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏర్కాడ్ సరస్సు చాలా అందంగా ఉంటుంది. దట్టమైన చెట్లతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ బోటింగ్, క్రీడలు ఉంటాయి. ఇక్కడున్న కిల్లియుర్ జలపాతం ఏర్కాడ్‌కు వెళ్లే దారిలో కనిపిస్తుంది. 

కూనూర్: తమిళనాడులోనే ఉంది కూనూర్. తేయాకు తోటలతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది. సముద్రమట్టానికి 1850 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి చల్లగా ఉంటుంది. ఇక్కడున్న బొటానికల్ పార్క్ కూనూర్ లోనే అత్యంత ఉత్తమ పర్యాటక ప్రదేశం. లోయలు, కొండలు ఇక్కడ అందంగా ఆకర్షిస్తాయి.