భగ్గుమనే ఎండలు.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కే భానుడు త‌న ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెల మొదటివారంలోనే  ఎండలు మండిపోతుండ‌డంతో ప్రజ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్రమ‌క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో దాదాపు 36  డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.

మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని    వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో కాస్త చలిగానే ఉన్నా.. పగటి పూట మాత్రం ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో 15-నుంచి  20 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉంది.
     ఈ విధంగా ఉండగా తెలంగాణలో సగం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు  నమోదైంది.  అత్యధికంగా నిజామాబాద్​ లో 38 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నిజాబాద్, భద్రాచలం , నల్గొండ, మహబూబ్​ నగర్, హైదరాబాద్​ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతుంది.  మార్చి 7 వ తేదీ వరకు ఎండ తీవ్రత అధికంగా నమోదు అయి.. వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.