Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..

పార్టీకి వెళ్తే పదిమందితో కలిసి సంతోషంగా తినలేరు. ఫ్రెండ్స్ అలా బయటకు వెళ్తే కనీసం టీ తాగలేరు.ఇంట్లో మూడు పూటలా అన్నం కూడా తినలేరు. నోరూరించే స్వీట్లు, పండ్లు కళ్లముందు కనబడుతున్నా...నోరు కట్టుకోవాల్సిందే. టైంకు తినాలి, అదీ లిమిటెడ్ గానే తినాలి. ఎక్కువగా తింటేఏమవుతుందో?  తినకపోతే ఏమవుతుందోనని .. షుగర్ పేషెంట్లను వేధించే సవాలక్ష ప్రశ్నలివి

వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కసారి షుగర్ వచ్చిందని డాక్టర్ చెప్పాక లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. మునుపటిలా అన్నిరకాల ఫుడ్స్ తింటూ ఎంజాయ్ చెయ్యలేరు..  ఏది తిన్నా ఇంట్లోవాళ్ల నుంచి అబ్జెక్షన్... చపాతీ తిను, జొన్నరొట్టె తిను, రాగి జావ తాగు.... ఇలా చప్పిడి తిండితో చంపేస్తుంటారు. మరి షుగర్ పేషెంట్ల పరిస్థితి ఇంతేనా?  రుచికరమైన ఆహారానికి దూరంగా ఉండాల్సిందేనా? ఏం అక్కర్లేదంటున్నారు డాక్టర్లు. 

షుగర్ వ్యాధిపై కొంచెం అవగాహన పెంచుకొని, రోజూ ఎక్సర్సైజ్ చేస్తూ డాక్టర్లు సూచించిన సలహాలు పాటిస్తే ఎటువంటి సమస్యా ఉండదంటున్నారు. రాత్రి భోజనం తర్వాత మరుసటి రోజు లంచ్ వరకు తినకుండా ఉండడం షుగర్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే లేవగానే ఎక్సర్​ సైజ్ చేసి, గ్రీన్ టీ వంటివి తాగాలి. ఆ తర్వాత స్నానం చేసి తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. అయితే షుగర్ పేషెంట్లు అందరిలా దోశెలు.. బజ్జీలు.. పూరీలు... వడలు లాగించేయడం కూడా కరెక్ట్ కాదు. కేలరీలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి . మరి షుగర్ పేషెంట్లు తినాల్సిన కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ గురించి తెలుసుకుందామా..

మెంతి పరాటా

షుగర్ ను కంట్రోల్ చేయడంలో మెంతులకు మించిన ఔషధం లేదంటారు ఆయుర్వేద వైద్యులు.   అందుకే ఓ స్పూన్ మెంతులను రాత్రి నానబెట్టి, ఉదయం లేవగానే ఆ వీటిని తాగేసి, మెంతులను కూడా తినాలని చెబుతారు. అయితే ఇలా తినడానికి అందరూ ఇష్టపడకపోవచ్చు. కారణం మెంతులు చేదుగా ఉండటమే. మరి మెంతులను నేరుగా కాకుండా మెంతికూర ఆకులతో పరాటాలు చేసుకుంటే షుగర్ షేషెంట్లకు అంతకుమించిన బ్రేక్ ఫాస్ట్ ఇంకేముంటుంది. పరాటాలు చేసేటప్పుడే మెంతి ఆకులను స్టఫింగ్ లా  వాడుతూ చేస్తే రుచిగా ఆరోగ్యా న్నిచ్చే బ్రేక్ ఫాస్ట్ రెడీ అయినట్లే .  ఈ బ్రేక్​ ఫాస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది కూడా....

ఎగ్స్​.. మల్టి గ్రెయిన్​ బ్రెడ్స్​

గుడ్డును సంపూర్ణ ఆహారంగా చెబుతారు. షుగర్ పేషెంట్లకు కూడా ఇది వర్తిస్తుంది. చాలామంది గుడ్డులోని పచ్చసొనను షుగర్ పేషెంట్లు తినకూడదని చెబుతారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. బాయిల్డ్ ఎగ్ ను ఎటువంటి అనుమానం లేకుండా పూర్తిగా తినొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచకుండా ఎక్కువ ప్రొటీన్స్ ను అందించే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ..బాయిల్డ్ ఎగ్గే.  వీటికి మల్టీగ్రెయిన్ తోడైతే  రుచితోపాటు మరిన్ని పోషకాలు అందినట్లే...

బేసన్​ చిల్లా..

శెనగపిండితో తయారయ్యే ఈ వంటకం షుగర్ పేషేంట్లకు ఎంతో మంచిది. శనగపిండి అనేది వీరికి చాలా మంచిది. ఇందులో కూరగాయలని కూడా వాడతారు. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కూరగాయల్లోని అనేక పోషకాలు ఈ బ్రేక్​ ఫాస్ట్​ ద్వారా అందుతాయి. కాబట్టి రోజంతా యాక్టివ్ గా ఉంటారు. దీనిని రోజూ తిన్నా మంచిదే. అయితే ఈ వంటకాన్ని చేసేటప్పుడే తక్కువ నూనె వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

టోపు ఫ్రై..

ప్రోటీన్​ అనేది డయాబెటిస్​ కు చాలా అవసరం. ఇది టోపులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టోపుని తాజా కూరగాయలతో పాటు కలిపి ఫ్రై చేసి తినొచ్చు. ఇందులో కాసిన్ని నువ్వులు కలిపితే అదనపు పోషకాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి హ్యాపీగా ఈ బ్రేక్ ఫాస్ట్ కూడా ట్రై చేయొచ్చు

మల్టీగ్రెయిన్ ఇడ్లీ..

ఇడ్లీని ఇష్టంగా తినేవాళ్లకంటే కష్టపడుతూ తినేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కారణం.. నూనెలేకుండా వండే వంటకం కావడమే. అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లిని మించిన ఐటమ్ లేదనే చెప్పాలి. నూనె అవసరం లేకుండా ఆవిరి మీద వండే వంటకం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత హెల్దీ ఐటమ్ ని మరింత హెల్దీగా మార్చుకో వాలంటే.. ఇడ్లీలను కూడా మల్టీ గ్రెయిన్స్ తో ప్రిపేర్ చేసుకుని తింటే సరి.   వీటితో అన్ని పోషకాలు, విటమిన్స్ శరీరానికి అందుతాయి. ఈ పిండిలో క్యారెట్, బీన్స్, తాజా కూరగాయల్ని కూడా కలిపితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

మొలకెత్తిన గింజలు..

షుగర్ పేషెంట్లకే కాదు... మొలకెత్తిన గింజలు అందరికీ ఆరోగ్యకరమైనవే. వీటిని తినడం వల్ల ప్రొటీన్స్, పోషక విలువలు శరీరానికి అందుతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. అలా తినడం కష్టమనుకుంటే కీరా, టమాట ముక్కలు, కాసింత నిమ్మరసం, కారం, ఉప్పు, మిరియాల పొడి కలిపి తినొచ్చు. ఇలా తినడం వల్ల రుచిగా ఉంటాయి కూడా...  ఒకవేళ కారంగా వద్దనుకుంటే.... ఇందులోనే కర్జూర పండ్లని కలిపి స్వీట్​గా తినొచ్చు. అయితే షుగర్ పేషెంట్లు కర్జూరాలను తక్కువ మోతాదులో కలుపుకోవాలి. . . 

–వెలుగు, లైఫ్​–