ఫార్మింగ్ అంటే.. మట్టితో కలిసి బతికే ఒక ఆర్ట్, అడిక్షన్. అందుకే చాలామంది రైతులు నష్టం, కష్టం ఏది వచ్చినా సాగును వదలరు. కానీ.. అసలు నష్టమే రాకుండా సాగు చేయాలి అంటారు
సంతోష్ జాదవ్, ఆకాశ్ జాదవ్. ఈ ఇద్దరు రైతులు మాత్రమే కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. సాగు ఎలా చేస్తే లాభాలు వస్తాయి? నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలను, సక్సెస్ అయిన రైతుల అనుభవాలను తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరికీ పంచుతున్నారు.
ఈ కాలంలో చాలామంది యువత డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ కావాలనే కలలు కంటున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకోవాలి అనుకునే యువత చాలా తక్కువ. కానీ, 28 ఏండ్ల సంతోష్ జాదవ్ తరతరాలుగా వస్తున్న ఫ్యామిలీ బిజినెస్‌ని కాదనుకుని... వ్యవసాయాన్ని వృత్తిగా ఎన్నుకున్నాడు. సంతోష్ కుటుంబం చాలా ఏండ్ల నుంచి బంగారు శుద్ధి కర్మాగారం నడుపుతోంది. కానీ, సంతోష్ మాత్రం ‘‘బంగారాన్ని కరిగించడం కంటే మట్టిని బంగారంగా మార్చడంలోనే మజా ఉంది’’ అనుకున్నాడు. ఇప్పుడు అతను సక్సెస్‌ఫుల్ రైతు మాత్రమే కాదు. చాలామంది యువతని వ్యవసాయం వైపు నడుపుతున్న హీరో కూడా.
ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ.. సంతోష్ వెనుక అతని ఫ్రెండ్ ఆకాశ్ ఉన్నాడు. ఇంజినీరింగ్ తర్వాత ఫిల్మ్ మేకింగ్ లేదా యూట్యూబ్‌లో కెరీర్ మొదలుపెట్టాలి అనుకున్నాడు ఆకాష్. ఇప్పుడు తన ఫ్రెండ్‌తో కలిసి సాగు చేస్తూనే ఇద్దరూ కలిసి ‘‘ఇండియన్ ఫార్మర్” అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.
ఇలా మొదలైంది...
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉంటున్న సంతోష్ జాదవ్, తన ఫ్రెండ్ ఆకాష్‌తో కలిసి 2018లో ‘ఇండియన్ ఫార్మర్’ అనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. ఈ ఛానెల్ ద్వారా ఎంతోమంది రైతులకు సాగు పాఠాలు నేర్పుతున్నారు. మొదట్లో మొబైల్‌లో వీడియో తీసి, అప్‌లోడ్ చేసేవాళ్లు. తర్వాత ఛానెల్ సక్సెస్ కావడంతో ఎక్విప్‌మెంట్ కొని క్వాలిటీ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి సబ్‌స్క్రయిబర్స్ బాగా పెరిగారు. ఛానెల్‌ని 4.3 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఛానెల్‌లో ఇప్పటివరకు1800కు పైగా వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఈ ఇద్దరు దోస్తులు కలిసి ఇప్పుడు ‘ఇండియన్ ఫార్మర్ మరాఠీ’, ‘ఇండియన్ ఫార్మర్ కన్నడ’, ‘ఐఎఫ్ ప్లస్’ అనే మరో మూడు ఛానెళ్లు కూడా పెట్టారు.
వద్దన్నారు!
మంచి భవిష్యత్తు వదులుకొని లాభం వస్తుందో, నష్టం వస్తుందో తెలియని వ్యవసాయం చేస్తామనగానే ఇద్దరి కుటుంబాల్లో పెద్దలు వద్దన్నారు. సంతోష్‌ని గోల్డ్ రిఫైనరీ బిజినెస్ చేయాలని ఒత్తిడి చేశారు. కానీ.. అందుకు అతను ఒప్పుకోకుండా సాగునే ఎంచుకున్నాడు. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని, సాగులో సాంకేతిక పద్ధతులు అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు.. తన నిర్ణయం మార్చుకునేది లేదని ఫ్యామిలీకి తేల్చి చెప్పేశాడు. దాంతో వాళ్లు అర్థం చేసుకుని అతనికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒకవైపు సాగు నుంచి మరో వైపు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదిస్తున్నాడు.
ఆకాష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి యూట్యూబ్‌ని కెరీర్‌గా మార్చుకోవాలి అనుకున్నప్పుడు, అతని ఫ్యామిలీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. అందులోనూ ఫార్మింగ్ వీడియోల కాన్సెప్ట్ అనగానే వెంటనే ‘నో’ అన్నారు. కానీ.. కొన్నాళ్లకి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ‘ఇండియన్ ఫార్మర్’ ఛానెల్‌లో సంతోష్ ముఖం కనిపిస్తున్నప్పటికీ, ప్రతి వీడియోను తీసేది, దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా చేసేది మాత్రం ఆకాష్. ఛానెల్ కోసం వాళ్ల ఫ్రెండ్స్ అశుతోష్, సంజు, ఆశిష్ కూడా సాయం చేస్తుంటారు.
మరి సంపాదన?
ప్రస్తుతం ఇండియన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు రెండు లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ప్రతి నెలా సగటున 60 వేల మంది ఛానెల్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. వీళ్ల ఛానెల్‌కు గూగుల్ యాడ్‌సెన్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా డబ్బు వస్తోంది. ఛానెల్‌లో కొన్ని అగ్రిటెక్ కంపెనీల ప్రొడక్ట్స్, సర్వీసులను మార్కెటింగ్ చేస్తున్నారు కూడా.
ఎన్నో సవాళ్లు
ఈ సక్సెస్ వీళ్లకు ఒక్కరోజులో రాలేదు. యూట్యూబ్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫార్మింగ్ వీడియోలు చేయడం అంత ఈజీ కాదు. ఎండ, దుమ్ము, నీళ్ల మధ్య పొలంలో వీడియో తీయడం చాలా కష్టం. మొదట్లో వాడిన చిన్న కెమెరాలతో ఎండలో షూటింగ్ చేయడం సాధ్యమయ్యేది కాదు. దాంతో ఉదయం, సాయంత్రం వీడియోలు షూట్ చేయాల్సి వచ్చేది. అలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వీడియోలు చేస్తేనే ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చింది.