ఈ మధ్య టీవీల్లో వచ్చే యాడ్స్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాడ్స్ వస్తున్నాయి. అందులోనూ వీడియో మధ్యలో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వాళ్లు ప్లే చేసే యాడ్ కంటే వీడియోలో ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ప్రమోషన్ ఎక్కువసేపు కనిపిస్తుంది. అంటే ప్రమోషన్స్ చేయడం చాలా కామన్ అయిపోయిందన్నమాట. అందుకే ఈ అమ్మాయి అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ప్రమోట్ చేయాలి అనుకుంది. సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా కనిపిస్తే.. నెటిజన్స్ ఊరుకుంటారా లైక్స్, షేర్స్, సబ్‌స్క్రిప్షన్స్‌తో ఆమెకు కాసుల వర్షం కురిపించారు.
సోషల్ మీడియాని ఉపాధిగా ఎంచుకుని సక్సెస్ అయినవాళ్ల గురించి రెగ్యులర్‌గా వింటూనే ఉన్నాం. చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ అనే అమ్మాయి కూడా అలా సక్సెస్ కావాలనే కోరికతో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. మొదట్లో ఎన్ని వీడియోలు చేసినా అంతగా ఫాలోయింగ్ రాలేదు. కానీ.. పోయినేడు ఒక లైవ్ స్ట్రీమ్ చేసింది. ఆ వీడియో ఇచ్చిన సక్సెస్‌తో రాకెట్‌లా దూసుకుపోతోంది. వినూత్న ఆలోచనలతో వీడియోలు చేస్తూ.. కోట్ల మందిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ పాపులారిటీ వల్లే కేవలం వారం రోజుల్లోనే దాదాపు116 కోట్లు సంపాదించింది. ఇంకా సంపాదిస్తూనే ఉంది.
ర్యాపిడ్ ఫైర్ ప్రజెంటేషన్
మామూలుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీలో వీడియోలు చేస్తుంటారు. ఆ కేటగిరీకి సరిపోయే ప్రమోషన్స్ చేస్తుంటారు. అంటే కుకింగ్‌ఛానెల్ నడుపుతున్న వాళ్లు వంటకు సంబంధించిన వస్తువులను, ఫ్యాషన్ ఛానెల్‌ను నడిపేవాళ్లు బట్టల ప్రమోషన్స్ చేస్తుంటారు. జెంగ్ జియాంగ్ మాత్రం ప్రొడక్ట్ మార్కెటింగ్ మీద వీడియోలు చేస్తుంటుంది. అంటే అన్ని రకాల వస్తువులను డిజిటల్‌గా మార్కెట్ చేస్తుంది.
అంతేకాదు.. ‘అందరికీ నచ్చినది నాకసలే నచ్చదులే’ అన్నట్టు జెంగ్ జియాంగ్ అందరిలా కాకుండా చాలా డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తుంటుంది. ప్రొడక్ట్ మార్కెటింగ్ చేసేవాళ్లు ప్రొడక్ట్ గురించి పూర్తి వివరాలు చెప్తూ వీడియోలు చేస్తుంటే.. జెంగ్ మాత్రం ప్రొడక్ట్‌ని మూడు సెకన్లు మాత్రమే స్క్రీన్‌పై కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అప్పుడే దాని ధర చెప్తుంది. అదేంటి! అంత తక్కువ టైంలో ప్రొడక్ట్ గురించి ఎలా తెలుస్తుంది అంటారా? ‘మీరేమైనా అనండి. నేను మాత్రం మూడు సెకన్లే చూపిస్తా’ అంటోంది జెంగ్. ఆమె వీడియోల్లో వెనుక భాగంలో ఆరెంజ్ కలర్ బాక్స్‌లు మాత్రమే కనిపిస్తాయి. వాటిని తెరిచి చూపిస్తుంటుంది.
అన్నీ లైవ్‌లోనే...
సాధారణంగా ప్రొడక్ట్ మార్కెటింగ్ వీడియోలు ముందుగా రికార్డ్ చేసి, తర్వాత పోస్ట్ చేస్తుంటారు. కానీ.. జెంగ్ లైవ్‌లోనే ప్రమోట్ చేస్తుంటుంది. తను చూపించాలనుకున్న ప్రొడక్ట్స్ అన్నీ ముందుగానే బాక్సుల్లో రెడీగా పెట్టుకుంటుంది. వాటి వివరాలు ముందుగానే తెలుసుకుంటుంది. తర్వాత లైవ్ స్ట్రీమ్‌లోకి వస్తుంది. ఒక హెల్పర్ బట్టలు, వస్తువులు ఉన్న బాక్స్‌లను ఆమె ముందున్న టేబుల్ మీదకు విసురుతుంటాడు. వాటిని ఓపెన్ చేసి, కెమెరాకు చూపిస్తుంది ఆమె. ఆ తర్వాత ధర చెప్పి పక్కన పడేస్తుంది. అలా వస్తువులు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటి ధరలు చెప్తూనే ఉంటుంది.
ఒక్కో ప్రొడక్ట్ ఓపెన్ చేసి చూపించి, ధర చెప్పడానికి మూడు సెకన్ల టైం పడుతుంది. ఇంత తక్కువ టైంలో చూపిస్తుంటే వాటి సేల్స్ ఎలా పెరుగుతాయి? అంటారా! విచిత్రంగా వాటి సేల్స్ కూడా విపరీతంగా పెరుతున్నాయి. జెంగ్ ప్రమోట్ చేసిన చాలా వస్తువుల సేల్స్ గ్రోత్ చాలా బాగుందని కంపెనీలు చెప్తున్నాయి. అంతేకాదు.. అన్ని ప్రొడక్ట్స్ ధరలు గుర్తుపెట్టుకుని, లైవ్‌లో చెప్తున్న ఆమె జ్ఞాపకశక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ లైవ్ స్ట్రీమ్ వీడియోలను చైనా టిక్‌టాక్ వెర్షన్ ‘డౌయిన్’తోపాటు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా పోస్ట్ చేస్తుంటుంది. అందుకే తక్కువ టైంలోనే చైనాలో చాలా ఫేమస్ అయ్యింది. జియాంగ్ ఆలోచన నచ్చిన నెటిజన్స్ లక్షల మంది ఆమెని ఫాలో అవుతున్నారు.
2017 నుంచి..
జెంగ్ జియాంగ్ 2017 నుంచి ఇలాంటి షార్ట్ వీడియోలు చేస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఆమెకు పెద్దగా ఫాలోవర్స్ రాలేదు. పోయినేడాది నవంబర్‌లో పెట్టిన ఒక ప్రమోషన్ వీడియోతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ ఒక్క పోస్ట్ వల్లే ఆమెకు10 లక్షలకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. ఆ దెబ్బతో జెంగ్ చైనాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఆమె చూపించే ఒక్కో ప్రొడక్ట్‌కి10 యువాన్లు (116 రూపాయలు)ఛార్జ్ చేస్తోంది. అయితే.. ఆమె ఒక్క వారంలో అంచనాలకు మించి 116 కోట్ల రూపాయలు సంపాదించడంతో వార్తల్లో నిలిచింది.