పెద్ద కళ్లు, ఒత్తయిన జుట్టు, చామనఛాయతో ఉన్న ఈ అమ్మాయిని చూస్తే అచ్చం పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. బుర్ఖా వేస్తే ముస్లిం అమ్మాయిలా, నుదుట బొట్టు పెడితే సంప్రదాయ భారతీయ ఆడపడుచులా కనిపించే ఈమె పేరు.. కని కుస్రుతి. థియేటర్ ఆర్ట్ చేసిన కుస్రుతి ఇంటర్నేషనల్ డ్రామాల్లో నటించింది.
ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. కష్టాల్లో, బాధల్లో ఉండే ఆడవాళ్ల రోల్స్ ఎక్కువగా చేసింది. కేరళలో పుట్టిన ఈ మలయాళీ అమ్మాయి ‘‘మలయాళ ఇండస్ట్రీలో నటించాలంటే ఆలోచించాల్సిందే’’ అంటోంది. ప్రస్తుతానికి హిందీలో వచ్చిన ‘కిల్లర్ సూప్’ వెబ్ సిరీస్‌లో ‘కీర్తిమ’ అనే రోల్లో కనిపించింది. ‘స్టార్ అవ్వడం నా గోల్ కాదు’ అంటోన్న కని పర్సనల్, ప్రొఫెషనల్ సంగతులు ఇవి.
‘‘నా పేరు కని కుస్రుతి. మలయాళీ అమ్మాయిని. మాది కేరళలోని తిరువనంతపురంలో చెరువక్కళ్ అనే చిన్న ఊరు. నా మతం లేదా కులం తెలిసేలా పేరు వెనకాల నాన్న పేరు పెట్టడం మా అమ్మానాన్నలకి ఇష్టంలేదు. కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అప్లికేషన్లో మాత్రం పేరు వెనకాల మరో పేరు ఉండాల్సిందే అన్నారు. అందుకని ‘కుస్రుతి’ అని పెట్టారు. అలా నా పదిహేనేండ్ల వయసులో నా పేరు పక్కన కుస్రుతి అనే పదం చేరింది. మలయాళంలో ఆ పదానికి ‘అల్లరి లేదా కొంటె’ అని అర్థం.
థియేటర్లో చేరి
టెన్త్ అయిపోయాక ‘అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్’లో చేరా. అక్కడే వేదిక్ ఇండియన్ సైంటిస్ట్, మ్యాథమెటీషియన్ బౌధాయనకి చెందినది అని చెప్పే హాస్యనాటకం ‘భగవదజ్జుకమ్’తో అరంగేట్రం చేశా. అందులో వసంత సేన అనే లీడ్ రోల్ చేశా. ఆ పాత్రను 2000 నుంచి 2006 వరకు నేను పోషిస్తూనే ఉన్నా. ఆ నాటకాన్ని థియేటర్ ఫెస్టివల్స్తోపాటు భారత్ రంగ్ మహోత్సవ్, కేరళ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ వంటి వాటిలో కూడా పర్ఫార్మ్ చేశా. ఆ తర్వాత ప్యారిస్‌లో డ్రామా స్కూల్లో చేరా. అక్కడ రెండేండ్ల కోర్సు పూర్తి చేసుకుని తిరిగి కేరళ వచ్చా.
సినిమాలతో పాటు..
ప్యారిస్ నుంచి వచ్చాక ‘కేరళ కెఫె’ అనే ఆంథాలజీ ఫిల్మ్‌లో ‘ఐలాండ్ ఎక్స్‌ప్రెస్’ అనే సెగ్మెంట్లో కనిపించా. ఆ తర్వాత 2010లో మోహన్‌లాల్ నటించిన ‘శిక్కర్’ అనే మూవీలో నక్సలైట్ పాత్ర చేశా. అదే ఏడాది ‘కాక్ టెయిల్’ అనే సినిమాలో కనిపించా. అందులో నన్ను ఆడియెన్స్ గుర్తించారు. అలాగే ఆ ఏడాది డిసెంబర్లో తెస్పియన్, ఇలియాజ్ కొహెన్ డైరెక్షన్లో ‘లాస్ ఇండియాస్’ అనే మెగా పర్ఫార్మెన్స్ ఈవెంట్ జరిగింది.
ఆ ఈవెంట్‌కి నేను కూడా పనిచేశా. దాని ప్రొడక్షన్ డిజైన్‌లో భాగంగా స్టేజ్‌ని బస్ మీద ఏర్పాటు చేశాం. ఆ తర్వాత మళ్లీ ‘సునామీ ఎక్స్‌ప్రెస్ : హైవే ఆఫ్ హోప్స్’ పేరుతో ఇంటరాక్టివ్ థియేటర్ రోడ్ షో చేశాం. షేక్ స్పియర్ ‘టెంపెస్ట్’లో చేసేందుకు 2011లో ‘ఫూట్స్బార్న్’ అనే టూరింగ్ థియేటర్ కంపెనీలో చేరా. దాంతో ‘ది ఇండియన్ టెంపెస్ట్’ నాటకంలో మిరిండా పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలాగే ఇండో – పోలిష్ నాటకం ‘బర్నింగ్ ఫ్లవర్స్– 7 డ్రీమ్స్ ఆఫ్ ఎ ఉమెన్’ స్క్రిప్ట్‌ని రీసెర్చ్ చేసి డెవలప్ చేయడంలో సాయపడ్డా. అందులో నటించా కూడా. 2015లో ‘ఈశ్వరన్ సాక్షియాయి’ టీవీ సీరియల్లో అడ్వకేట్ థెరెసా పాత్ర చేశా.
భాష రాదు కాబట్టి...
ప్యారిస్‌లో థియేటర్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే ‘ఓకే కంప్యూటర్’ అనే సైంటిఫిక్షన్ మూవీలో అవకాశం వచ్చింది. అందులో పోలీస్ కానిస్టేబుల్ మోనాలిసా పాల్ పాత్రలో నటించా. ఆ తర్వాత ఫిక్షన్ సిరీస్ అయిన ‘మహారాణి’లో మహిళా సీఎంకి సహాయకురాలి పాత్ర చేశా. అది సౌత్ ఇండియన్ క్యారెక్టర్. ‘ఓకే కంప్యూటర్’లో కూడా మోనాలిసా పాత్ర మలయాళీ. నిజానికి హిందీవి నేను చేయను. ఎందుకంటే నాకు ఆ భాష మాట్లాడటం రాదు. అయితే, ‘కౌంటర్ఫెయిట్ కున్కూ’లో హిందీ, మరాఠీ కొంచెం మాట్లాడా. డైలాగ్స్ నేర్చుకునేందుకు కొన్ని నెలలు పట్టింది. ‘మహారాణి’లో చేసేటప్పుడు మాటిమాటికీ ‘అదేంటి? ఇదేంటి?’ అని అడుగుతూ ఉండేదాన్ని.
ప్రాక్టీస్ కావాలి
‘‘చాలా ఈజీగా యాక్టింగ్ చేశావు. పెద్దగా కష్టపడలేదు’’ అని కొందరు అంటుంటారు. అలాగని కష్టం లేకుండా ఎలా ఉంటుంది? ప్రతి క్యారెక్టర్‌కి కష్టపడాల్సిందే. కాకపోతే కొన్ని పాత్రలు కొంచెం ఈజీగా అనిపిస్తాయంతే. ఎందుకంటే అవి ఎక్కడో విన్నవో, చూసినవో, చదివినవో అయి ఉంటాయి. అందుకని పాత్రలో ఒదిగిపోవడం సులువు అవుతుంది. అందుకే అంత కష్టపడినట్టు కనిపించదు. ఏ పాత్ర అయినా సరే అలాంటి మనుషుల్ని నిజ జీవితంలో చూస్తే వాళ్ల రిథమ్ పట్టేస్తా.
టాలెంట్ ఒక్కటే సరిపోదు. ప్రాక్టీస్ చాలా అవసరం. అప్పుడే కంట్రోల్ చేయడం తెలుస్తుంది. నన్ను ‘‘బోల్డ్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నావ’’ని కొందరు డైరెక్టర్స్ అంటుంటారు. అందుకు నా సమాధానం.. ‘‘లైఫ్‌లో ఎన్నో బాధలు అనుభవిస్తున్న ఆడవాళ్ల పాత్రలు చేస్తున్నా”అని. నాకు అలాంటి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. అందుకు కారణం నా స్కిన్ టోన్, అంతకు ముందే నేను చేసిన రోల్స్ కావచ్చు. నాకయితే ఒక యాక్టర్‌కి అవకాశం ఇవ్వాలంటే పర్ఫార్మెన్స్ చూడాలి. కానీ, మిగతావి చూడాల్సిన పనిలేదు అనిపిస్తుంది.’’
ఆ టైంలో సినిమాలు మానేశా!
ఫిల్మ్ మేకర్స్ నుంచి సెక్సువల్ డిమాండ్స్ ఎక్కువ అవడంతో 2019లో యాక్టింగ్ నుంచి తప్పుకున్నా. మళ్లీ నాటకాల్లో చేసేందుకు వెళ్లిపోయా. అక్కడేమో బతకడానికి సరిపడా జీతం ఉండేది కాదు. మలయాళంలో మాత్రం నటించకూడదు అనుకున్నా. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మా అమ్మతో మాట్లాడి కన్విన్స్ చేయాలని చూశారు. అందుకే మలయాళం ఇండస్ట్రీపై నాకు కంప్లయింట్స్ ఉన్నాయి. 2019లో నాతోపాటు దేశంలోని పేరున్న ఆర్టిస్ట్‌లు మరో48 మంది కలిసి ప్రధాని మోదీకి ఓపెన్ లెటర్ రాశాం.
ఆ తర్వాతే 2020లో మలయాళంలో నేను చేసిన ‘బిర్యానీ’ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాలో నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు చేసిన ‘కిల్లర్ సూప్’లో క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అందులో నా రోల్ చాలా చిన్నదే కావచ్చు. ఆ అవకాశం చాలా పెద్దది. యాక్టర్స్ అందరూ స్టార్స్ కాదు. నాకు స్టార్ అవ్వాలనే గోల్ లేదు. అందుకే చిన్న క్యారెక్టర్ అయినా నచ్చితే చాలు చేసేస్తా.
వాళ్లిద్దరు సోషల్ యాక్టివిస్ట్‌లు
అమ్మ డాక్టర్ జయశ్రీ ఎ.కె. కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. పరియారమ్ మెడికల్ కాలేజీలో లెక్చర్స్ ఇస్తుంటుంది. టాక్ షోలకు గెస్ట్‌గా వెళ్తుంటుంది. నాన్న మైత్రేయ మైత్రేయన్ కేరళలోని మానవ హక్కుల ఉద్యమాల్లో పాల్గొంటాడు. నా భర్త ఆనంద్ గాంధీతో కలిసి ముంబైలో ఉంటున్నా. ఆయన ఫిల్మ్ మేకర్, సైన్స్ కమ్యూనికేటర్.
మొదటి ఆఫర్.. పారిపోయా
నేను పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు నాకు మొదటి అవకాశం వచ్చింది. అప్పటివరకు నాకు స్కూల్ నాటకాల్లో చేసిన అనుభవం మాత్రమే ఉంది. అది దాటి బయట నాటకంలో నటించడం కొత్తగా అనిపించింది. అయితే అప్పుడు మనసులో ఆడపిల్లలు ఇలాంటివి చేస్తే బయటి వాళ్లు ఎలా చూస్తారో అనుకున్నా. అందుకే వచ్చిన అవకాశానికి ఓకే చెప్తే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో? అనిపించింది.
అలాగే ఆ విషయంలో అమ్మానాన్నలను కూడా ఒప్పించాలి అనిపించలేదు. ఎందుకంటే ఆ ఆఫర్ మా పేరెంట్స్ ఫ్రెండ్స్‌లో ఒకరి నుంచి వచ్చింది. అందుకని నేను మా అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లిపోయా. మా అమ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. ‘నీకు ఇష్టం లేనిది ఏదీ నువ్వు చేయకు. కాకపోతే ఒక అవకాశాన్ని రిజెక్ట్ చేసే ముందు ఆలోచించాలి. ఆ అవకాశాన్ని అన్వేషించాలి’ అని చెప్పింది. అలా నాటకాల్లోకి అడుగుపెట్టా. నటన నేర్చుకోవడానికి కాస్త టైం పట్టినప్పటికీ ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేశా. అప్పటి నుంచి ఏ ఛాలెంజ్‌కి భయపడలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని యాక్సెప్ట్ చేసేముందు కొంత టైం తీసుకున్నా.
బిర్యానీకి అవార్డ్లు
2019లో బెస్ట్ యాక్ట్రెస్‌గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్.
2020 బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ మలయాళంలో సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్.
మాస్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎ లీడ్ రోల్ ఫీమేల్ కేటగిరీలో బ్రిక్స్ అవార్డ్.
- ప్రజ్ఞ