యూట్యూబర్​: లీగల్​ నోటీసులు వచ్చినా..

అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు. కానీ.. ఆ మహాభాగ్యం దక్కించుకోవడం ఎలా? అనేది చెప్పేందుకే ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్‌‌‌‌ నడుపుతున్నాడు వివేక్‌‌. ఆరోగ్యంగా, ఫిట్‌‌గా ఉండాలంటే ఏం తినాలి? ఏం చేయాలి? జనాలు రెగ్యులర్‌‌‌‌ తినే శ్నాక్స్‌‌, ఫుడ్స్‌‌లో ఏముంది? అవి తింటే ఏం జరుగుతుంది? ఇలాంటి.. అనేక ప్రశ్నలకు తన వీడియోల్లో సమాధానం చెప్తున్నాడు. ఇలా మంచిని నలుగురికీ పంచినందుకే లక్షల మందికి దగ్గరయ్యాడు. 

వివేక్‌‌ మిట్టల్1989లో పంజాబ్‌‌లోని భటిండాలో పుట్టాడు. స్కూల్‌‌ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీలో బీటెక్ చేశాడు. వివేక్​ తండ్రి సివిల్ ఇంజనీర్, తల్లి ఎకనామిక్స్ లెక్చరర్. బీటెక్ పూర్తి చేశాక హైదరాబాద్‌‌ వచ్చి ఇన్ఫోసిస్‌‌లో మూడేళ్లు పనిచేశాడు. 

ఫిట్‌‌నెస్‌‌పై ఆసక్తి 

కాలేజీ రోజుల్లోనే వివేక్‌‌కి ఫిట్‌‌నెస్‌‌పై ఆసక్తి ఏర్పడింది. కానీ.. యూట్యూబ్ ఛానెల్‌‌ పెట్టాలనే ఆలోచన మాత్రం లేదు. ఫిట్‌‌నెస్, ఆయుర్వేదం మీద ఇష్టంతో వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. హెల్దీ లైఫ్​ స్టయిల్‌‌ గురించి తెలుసుకునేందుకు చాలా పుస్తకాలు చదివాడు. అలా.. వాటి గురించి కాస్త లోతుగా తెలుసుకున్నాక వివేక్‌‌కు వాటిని అందరితో పంచుకోవాలనే ఆలోచన వచ్చింది. అందుకు యూట్యూబ్‌‌ని వేదికగా ఎంచుకున్నాడు.  వెంటనే 2016లో ‘ఫిట్‌‌ట్యూబర్’ పేరుతో యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ పెట్టాడు. వివేక్‌‌ని చాలామంది ఆయన ఛానెల్‌‌ పేరుతోనే ఫిట్‌‌ ట్యూబర్‌‌‌‌ అని పిలుస్తుంటారు. ఈ ఛానెల్‌‌లో ఫిట్‌‌గా ఉండడం ఎలా అనేది సామాన్యుడికి అర్థమయ్యే ఇంగ్లిష్‌‌లో చెప్తుంటాడు. ఖరీదైన పరికరాలతో బాడీబిల్డింగ్ చేయడం కంటే.. హెల్దీ లైఫ్‌‌స్టయిల్‌‌తో ఫిట్‌‌గా ఉండాలి అంటాడు వివేక్‌‌. 

లీగల్‌‌ నోటీసులు 

ఈ ఛానెల్‌‌లో ఫుడ్ బ్రాండ్‌‌ రివ్యూలు కూడా చేస్తుంటాడు. అది ఎంత పెద్ద కంపెనీ ప్రొడక్ట్‌‌ అయినా సరే.. దాని లోపాలను ముక్కు సూటిగా చెప్పేస్తాడు. అంతేకాదు.. దానికి ఆల్టర్నేట్‌‌ బెస్ట్‌‌ బ్రాండ్‌‌ ఏంటనేది కూడా చెప్తాడు. అతను రివ్యూ చేసేది ఎక్కువగా జనాలు వాడే ప్రొడక్ట్స్‌‌ కావడంతో ఇంపాక్ట్‌‌ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలోని ఇంగ్రెడియంట్స్‌‌, వాటిని తింటే వచ్చే సమస్యల గురించి చెప్తుంటాడు. 

ఈ నిజాయితీ వల్ల అతను చాలాసార్లు చిక్కుల్లో కూడా పడ్డాడు. ప్రత్యేకించి అతను చేసిన ‘వరస్ట్‌‌ టు బెస్ట్‌‌’ సిరీస్ వల్ల మల్టీ నేషనల్‌‌ ఎఫ్‌‌.ఎమ్‌‌.సి.జి.(ఫాస్ట్​ మూవింగ్​ కన్జ్యూమర్​ గూడ్స్​) కంపెనీలు అతనికి చాలాసార్లు లీగల్ నోటీసులు పంపాయి. దాంతో వివేక్​ చేసిన వీడియోల్లో ఐదింటిని యూట్యూబ్‌‌ నుంచి తీసేయాల్సి వచ్చింది. బాంబే హైకోర్టు తీర్పుతో తన ఒక ఏడాది సంపాదనను పెనాల్టీగా కట్టాల్సి వచ్చింది. అంతేకాదు.. నాన్-హెల్దీ కంపోజిషన్స్‌‌ ఉన్నాయనే కారణంతో అతను చాలా బ్రాండ్ల స్పాన్సర్‌‌షిప్స్​ కూడా వదులుకున్నాడు. 

7.6 మిలియన్లు... 

ఛానెల్‌‌ పెట్టిన మొదట్లో వివేక్‌‌ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్‌‌లో వీడియోలు చేసేవాడు. అప్పట్లో అతని దగ్గరున్న ఐ–ఫోన్‌‌ 5ఎస్‌‌లోనే వీడియోలు తీసేవాడు. వారానికి ఒక వీడియో అప్‌‌లోడ్ చేసేవాడు-. శుక్రవారం సాయంత్రం వరకు ఆఫీస్‌‌ వర్క్ చేసి రాత్రి 7 నుంచి యూట్యూబ్‌‌ ఛానెల్​ పని మొదలుపెట్టేవాడు. కంటెంట్‌‌ క్వాలిటీగా ఉండడంతో సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఫిట్ ట్యూబర్‌‌‌‌ ఛానెల్‌‌ని ఇప్పటివరకు 7.6 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. 

ఇప్పటివరకు ఈ ఛానెల్‌‌లో 302 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. అతను చెప్పే విషయం ఇంకా ఎక్కువమందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో 2019లో ‘ఫిట్ ట్యూబర్ హిందీ’ పేరుతో రెండో ఛానెల్‌‌ని మొదలు పెట్టాడు. ఇది కూడా చాలా తక్కువ టైంలోనే సక్సెస్ అయ్యింది. ఈ ఛానెల్‌‌కు 3.39 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో 168 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. తెలుగు ప్రజలకు కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతో 2020లో తెలుగులో కూడా ‘ఫిట్‌‌ ట్యూబర్ తెలుగు’ పేరుతో ఒక ఛానెల్‌‌ పెట్టాడు. ఈ ఛానెల్‌‌లో అతను డబ్‌‌ చేసిన వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఛానెల్‌‌లో124 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. మూడు లక్షల 98 వేల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు.