యూట్యూబర్​..సక్సెస్‌‌ పాఠాలు చెప్పే వారికూ

‘డబ్బే మనిషికి ఫ్రీడం ఇస్తుంది’ అంటాడు అంకుర్ వారికూ. అందుకే డబ్బు ఎలా సంపాదించాలి? సంపాదించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల మీద విపరీతంగా రీసెర్చ్‌‌ చేశాడు. ఆ నాలెడ్జ్‌‌తో ఎంట్రప్రెనూర్‌‌‌‌గా మారాడు. సక్సెస్‌‌ అయ్యాడు. ఆ విజయ రహస్యాలు అందరికీ తెలియాలని యూట్యూబ్‌‌లో సక్సెస్‌‌ పాఠాలను ఫ్రీగా చెప్తున్నాడు.

అంకుర్‌‌‌‌ వారికూ.. ఫేమస్‌‌ పబ్లిక్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్, సక్సెస్‌‌ఫుల్‌‌ ఎంట్రప్రెనూర్‌‌‌‌, రైటర్‌‌‌‌, ఏంజెల్ ఇన్వెస్టర్, యూట్యూబర్, పాడ్‌‌కాస్టర్, కంటెంట్ క్రియేటర్‌‌‌‌. మోటివేషనల్ స్పీకర్‌‌గా యంగ్‌‌ జనరేషన్‌‌కు సుపరిచితుడు. ఆయన1980 ఆగస్టు 25న ఢిల్లీలో పుట్టాడు.

న్యూ ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్‌‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత హిందూ కాలేజీలో చేరి బీఎస్సీ ఫిజిక్స్ చేశాడు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి  ఆస్ట్రోఫిజిక్స్​లో ఎమ్మెస్​ పట్టా అందుకున్నాడు. దుబాయ్‌‌, అమెరికాల్లో ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ‘ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌‌’లో ఎంబీఏ  పూర్తిచేశాడు. ఇప్పుడు యూట్యూబ్‌‌లో కెరీర్ మొదలుపెట్టాడు.   

అంకుర్​ వారికూ ఒక సక్సెస్‌‌ఫుల్‌‌ ఎంట్రప్రెనూర్‌‌‌‌. అందుకే యువతకు స్టార్టప్ ఐడియాలు ఎక్కువగా ఇస్తుంటాడు. ఎక్కడ ఇన్వెస్ట్‌‌ చేస్తే లాభాలు వస్తాయో చెప్తుంటాడు. అంతేకాదు.. అతని ఫాలోవర్స్‌‌ కోసం బెస్ట్‌‌ స్టార్టప్‌‌ కోర్సులు కూడా అందిస్తున్నాడు. కొన్నేండ్ల నుంచి ఏంజెల్ ఇన్వెస్టర్‌‌గా కూడా ఉన్నాడు. 

కన్సల్టెంట్‌‌గా కెరీర్‌‌‌‌... 

వారికూ వాళ్ల నాన్న ఒక బిజినెస్‌‌మేన్‌‌. అందుకే అతనికి కూడా చిన్నప్పటినుంచి బిజినెస్‌‌ చేయాలనే కోరిక ఉండేది. కాలేజీ టైంలోనే బిజినెస్‌‌ గురించి లోతుగా తెలుసుకున్నాడు. అప్పట్లోనే ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్‌‌ సెమినార్లకు వెళ్లేవాడు. బిజినెస్‌‌లో విజయాలు సాధించిన వ్యక్తుల గురించి తెలుసుకునేవాడు. కాలేజీ రోజుల్లోనే  బిజినెస్‌‌ చేయడానికి చాలా ప్లాన్లు రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2004లో ఎన్‌‌.ఐ.ఎస్‌‌. స్పార్టాలో కన్సల్టెంట్‌‌గా కెరీర్‌‌ మొదలుపెట్టాడు.

అక్కడ ఒక ఏడాది పనిచేశాడు. తర్వాత ఏటీ కెర్నీలో అసోసియేట్‌‌గా చేరాడు. ఏప్రిల్ 2007 నుండి సెప్టెంబరు 2010 వరకు అంకుర్ యాక్సెంటియం వెబ్‌‌లో కో– ఫౌండర్‌‌‌‌గా ఉన్నాడు. డిసెంబర్ 2010 నుండి ఏప్రిల్ 2012 వరకు రాకెట్ ఇంటర్నెట్ జీఎంబీహెచ్‌‌లో వెంచర్ పార్ట్‌‌నర్‌‌గా ఉన్నాడు. తర్వాత అంకుర్ గ్రూపాన్‌‌లో గ్రూపాన్‌‌ ఏపీఏసీ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్‌‌గా చేరాడు. గ్రూపాన్‌‌కు 2015 వరకు అంకుర్ సీఈవో కూడా. ఆగస్టు 2015లో కో –ఫౌండర్‌‌‌‌గా ‘నియర్‌‌‌‌బై.కామ్‌‌’ అనే కంపెనీ  మొదలుపెట్టాడు. 

సీఈవోగా.. 

నియర్‌‌‌‌బై.కామ్‌‌ పెట్టిన తర్వాత మొదటి నాలుగేండ్లు అంకుర్ సీఈవోగా పనిచేశాడు. 2017లో ‘నియర్‌‌‌‌బై. కామ్‌‌, లిటిల్ యాప్’ క్లబ్​ అయ్యాయి. అప్పుడు కూడా ఆయనే సీఈవోగా ఉన్నాడు. అక్టోబర్ 2019 నుండి అంకుర్ నియర్‌‌‌‌బై.కామ్‌‌ బోర్డు మెంబర్‌‌‌‌గా ఉన్నాడు. సీఈవో పదవి నుండి వైదొలిగిన తర్వాత వారికూ రాకెట్‌‌ ఇంటర్నెట్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌‌గా ఉన్నాడు. అంతేకాకుండా 2019 నుండి వారికూ విద్యావేత్త, కంటెంట్ క్రియేటర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. జులై 2014 నుంచే ఏంజెల్ ఇన్వెస్టర్‌‌గా ఉన్న అంకుర్ కొన్ని ఇంటర్నెట్ అండ్‌‌  టెక్నాలజీకి సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌ చేశాడు. 

సోషల్‌‌ మీడియాలో...

సక్సెస్‌‌ఫుల్‌‌ ఎంట్రపెనూర్‌‌‌‌ అయిన అంకుర్ ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్‌‌ ప్రోగ్రామ్స్‌‌ని మొదలుపెట్టాడు. తనలా సక్సెస్‌‌ కావాలి అనుకునే యువతకు ఉచితంగా విజయ రహస్యాలు చెప్తున్నాడు. అందుకోసం సోషల్‌‌ మీడియాను వాడుకోవడంతోపాటు ప్రత్యేకంగా ఒక వెబ్‌‌సైట్‌‌ కూడా మొదలుపెట్టాడు. 2017లోనే ‘‘వారికూ” పేరుతో ఒక యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ మొదలుపెట్టాడు. అందులో ఇప్పటివరకు1,220లకు పైగా వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. 

ఈ ఛానెల్‌‌కు 3.48 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్‌‌లో మోటివేషన్‌‌ స్పీచ్‌‌లు, బిజినెస్‌‌ ఐడియాలు, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ స్ట్రాటజీలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటాడు. అలా కొన్ని సోషల్‌‌ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో కూడా అంకుర్ యాక్టివ్‌‌గా ఉంటున్నాడు. వాటిలో కూడా కంటెంట్ పోస్ట్‌‌ చేస్తుంటాడు. అంకుర్ వారికూ రైటర్​ కూడా. 2021 డిసెంబర్ 27న ‘డు ఎపిక్ షిట్’ అనే తొలి పుస్తకాన్ని పబ్లిష్‌‌ చేశాడు. 2022లో ‘గెట్‌‌ ఎపిక్‌‌ షిట్‌‌ డన్‌‌’ పేరుతో మరో పుస్తకాన్ని తెచ్చాడు.