పిట్ట కొంచెం కూత ఘనం అంటుంటారు.. అయితే.. ఈ పిట్ట కూత ఘనమే కాదు శ్రావ్యం కూడా. పదమూడేండ్ల జయస్ కుమార్ పాట పాడితే ఎలాంటి వాళ్లయినా వన్స్ మోర్ అంటారు. ఐదేండ్ల వయసు నుంచే పాటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ .
న్యూఢిల్లీకి చెందిన ఈ పిల్లగాడికి ఇప్పుడు పదమూడేండ్లు. అసలు పేరు జయేష్ కుమార్. కానీ.. అందరూ ‘జయస్’ అని పిలుస్తుంటారు. అమ్మానాన్నలు సురుచి, రాజీవ్ కుమార్. 2011లో పుట్టాడు. సంప్రదాయ సంగీతాన్ని మోడర్న్ మ్యూజిక్‌తో మిక్స్ చేసి పాడడం అతని ప్రత్యేకత. మొట్టమొదటి సింగిల్ కార్డ్ ఆల్బమ్‌ని 2018లో రిలీజ్ చేశాడు. దానికి మంచి స్పందన వచ్చింది. అతని ప్రత్యేక శైలి, వాయిస్ మిలియన్ల మంది అభిమానులను సంపాదించింది.
పదేండ్లకే గిటార్ పట్టి...
జయస్ చిన్నప్పటినుంచి భారతీయ సంప్రదాయ సంగీతం వింటూ పెరిగాడు. కానీ.. చిన్న వయసులోనే పాశ్చాత్య సంగీతం కూడా నేర్చుకున్నాడు. అయినా.. అతనికి ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టమట! జయస్ పదేండ్ల వయసులోనే గిటార్ నేర్చుకుని, వాయించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నుంచి పాటలు కూడా రాస్తున్నాడు. జయస్ మొదటి ఆల్బమ్ ‘ఉడ్ జా కాలే’తో కెరీర్ మొదలైంది.
అది సూపర్ హిట్ కావడంతో పాటు మిలియన్ల లో స్ట్రీమింగ్ అయ్యింది. అప్పటినుంచి హిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇండియాలోని కొంతమంది టాప్ మ్యూజీషియన్లతో కలిసి పనిచేశాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నాలుగు ఆల్బమ్స్ ‘ఉడ్ జా కాలే (2018), తుమ్ కహో తో (2019), ముజే మాఫ్ కర్నా (2020), ఆస్మాన్ కే పార్ (2021)’ సక్సెస్ అయ్యాయి. అవన్నీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి.
జయస్‌కి మెమరీ చాలా ఎక్కువ. ఏ పాట ఇచ్చినా ఈజీగా కంఠస్థం చేయగలడు. 2020లో ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో ‘‘బెస్ట్ మేల్ వోకలిస్ట్, బెస్ట్ మేల్ సాంగ్ రైటర్’ అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డ్‌లు అతని కెరీర్‌లో మైలురాళ్లని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఆ తర్వాత కూడా జయస్ చాలా అవార్డులు గెలుచుకున్నాడు.
సరేగమప...
ఢిల్లీలోని ‘అమిత్య్ గ్లోబల్ స్కూల్’లో చదువుకుంటున్నాడు జయస్. జీటీవీ 2017లో టెలికాస్ట్ చేసిన టెలివిజన్ షో ‘సరేగమప లిల్ చాంప్స్ సీజన్–6’తో అరంగేట్రం చేశాడు. అద్భుతంగా పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ షోకి గెస్ట్లుగా వచ్చిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ , రణబీర్ కపూర్, అనుష్క శర్మ లాంటివాళ్లంతా జయస్‌ని మెచ్చుకున్నారు. అంతేనా.. ఆ షోలో జయస్‌కు ‘మిరకిల్ బాయ్’ అనే ముద్దు పేరు పెట్టారు.
జయస్ స్టేజ్‌పై ఎప్పుడూ ఒక రకమైన పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసేవాడు. హిమేష్ రేషమ్మియా(సంగీత దర్శకుడు) కూడా జయస్‌ని ‘ఛోటే భగవాన్’ అని మెచ్చుకున్నాడు. టీవీ షో నుండి బయటకు వచ్చిన తర్వాత జయస్ చాలా ఫేమస్ అయ్యాడు. అప్పటినుంచి ఈవెంట్లలో పాడేందుకు అవకాశాలు వస్తున్నాయి. అంతెందుకు సౌతాఫ్రికా, దుబాయ్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ లైవ్ కాన్సర్ట్స్’లో కూడా పాల్గొన్నాడు. హిమేష్ రేషమ్మియా, షాన్, రూపాలి జగ్గా, సిమ్రాన్ కౌర్, కెనిషా అవస్థి లాంటి ప్రముఖులతో స్టేజ్ షేర్ చేసుకున్నాడు.
యూట్యూబ్ ఛానెల్
జయస్ కుమార్ పేరిట 2011లోనే ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. జయస్ మూడేండ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలుపెట్టాడు. అతను పాడుతుంటే.. వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు జయస్ అమ్మానాన్న. ఇప్పటివరకు ‘జయస్ కుమార్’ ఛానెల్‌లో 141 వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేసినా 3.42 మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు.
వాటిలో కొన్ని వీడియోలకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. జయస్ పాడిన ‘కైకే పాన్ బనారస్ వాలా’ పాట వీడియోకు 63 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు ఈ పిల్లగాడికి. మరో విషయం ఏంటంటే.. జయస్‌కి గుండె ఎడమవైపు కాకుండా కుడి వైపున ఉంటుంది.