ఇన్​స్పిరేషన్..మావెల్లి టిఫిన్ రూమ్..ప్యూర్ అండ్ పర్ఫెక్ట్

సుమారు వందేండ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ములు కలిసి, బతుకుదెరువు కోసం పల్లె నుంచి పట్నం వెళ్లారు. కొన్నిరోజులు వంటమనుషులుగా పనిచేశారు. ఆ తర్వాత చిన్న టిఫిన్ సెంటర్ ఒకటి పెట్టుకున్నారు. 

చాలా కష్టపడి దాన్ని డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కట్‌‌‌‌ చేస్తే.. అది వందల కోట్ల కంపెనీగా ఎదిగింది. ఆ కంపెనీయే మనందరికీ తెలిసిన ‘ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌’. 

ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ కథ1920 సంవత్సరంలో మొదలైంది. పరమేశ్వర మైయ్య, గణప్పయ్య మైయ్య, యజ్ఞనారాయణ మైయ్య అనే ముగ్గురు అన్నదమ్ములు కర్నాటకలోని ఉడిపి దగ్గర్లోని చిన్న పట్టణం పారంపల్లిలో ఉండేవాళ్లు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లు ఊళ్లో ఉపాధి దొరక్క బతుకుదెరువు కోసం బెంగళూరుకి వెళ్లారు. వాళ్లకు తెలిసింది వంట చేయడం ఒక్కటే.

అందుకే బెంగళూరులోని భూస్వాములు, ధనవంతుల ఇండ్లలో వంట వాళ్లుగా పని చేయడం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుని దాచుకునేవాళ్లు. అలా నాలుగేండ్లు గడిచిపోయాయి. ముగ్గురిలో పెద్దవాడైన పరమేశ్వర మైయ్య పనిచేస్తున్న ఇంటి యజమానికి పరమేశ్వర వంట బాగా నచ్చింది. దాంతో ‘‘చిన్న హోటల్‌‌‌‌ పెట్టుకోమ”ని సలహా ఇచ్చాడు. 

బ్రాహ్మిణ్​ కాఫీ క్లబ్‌‌‌‌

యజమాని ఇచ్చిన సలహాతో పరమేశ్వర మైయ్య తమ్ముడితో కలిసి అప్పటివరకు దాచుకున్న డబ్బుతో ఒక చిన్న హోటల్‌‌‌‌ పెట్టాలి అనుకున్నాడు. కొన్ని రోజుల్లోనే బెంగళూరులోని లాల్‌‌‌‌బాగ్ రోడ్​లో ఒక చిన్న రెస్టారెంట్‌‌‌‌ మొదలుపెట్టారు. దానికి ‘బ్రాహ్మిణ్​ కాఫీ క్లబ్’ అని పేరు పెట్టారు. మొదట్లో ఆ హోటల్‌‌‌‌లో ఇడ్లీలు, కాఫీ మాత్రమే అమ్మేవాళ్లు. ఇడ్లీల రుచి బాగుండడంతో కొద్ది రోజుల్లోనే ఆ ఏరియాలో హోటల్‌‌‌‌ చాలా ఫేమస్ అయ్యింది.

బ్రాహ్మిణ్​ కాఫీ క్లబ్‌‌‌‌లో టిఫిన్‌‌‌‌ చేసేందుకు జనాలు ‘క్యూ’ కట్టేవాళ్లు. కానీ.. 1936లో గణప్పయ్య మైయ్య తిరిగి సొంతూరు పారంపల్లికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు. దాంతో అతని తమ్ముడు యజ్ఞనారాయణ మైయ్య బ్రాహ్మణ కాఫీ క్లబ్‌‌‌‌లో చేరాడు. తరువాత కొన్నేండ్లు బిజినెస్‌‌‌‌ చాలా బాగా సాగింది. రెస్టారెంట్‌‌‌‌ ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడేది. దాంతో వాళ్లు మెనూని మార్చి అనేక రకాల ఇండియన్ వంటకాలను అందులో చేర్చారు. 

మరో సక్సెస్‌‌‌‌

యజ్ఞనారాయణ బిజినెస్‌‌‌‌ విస్తరించాలి అనుకున్నాడు. అందుకు కావాల్సిన నాలెడ్జ్‌‌‌‌ సంపాదించడానికి విదేశాల్లో హోటల్స్‌‌‌‌ ఎలా నడుపుతున్నారో తెలుసుకోవాలని1951లో యూరప్‌‌‌‌కు వెళ్లాడు. అతని పర్యటనలో రెస్టారెంట్‌‌‌‌ని డెవలప్‌‌‌‌ చేసేందుకు కావాల్సిన అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తిరిగి వచ్చాక కస్టమర్లకు హెల్దీ ఫుడ్‌‌‌‌ని అందించాలంటే.. రెస్టారెంట్ కిచెన్‌‌‌‌ నుంచే మార్పు మొదలవ్వాలి అనుకున్నాడు. అందుకే కిచెన్‌‌‌‌ హైజీన్‌‌‌‌ కోసం కొన్ని స్ట్రిక్ట్​ రూల్స్‌‌‌‌ పెట్టాడు. అందరూ ఆదరించాలంటే రెస్టారెంట్‌‌‌‌ పేరుని కూడా మార్చాలనే ఉద్దేశంతో ‘మావల్లి టిఫిన్ రూమ్స్’గా మార్చాడు. దాన్నే షార్ట్‌‌‌‌ కట్​లో అందరూ ‘ఎంటీఆర్‌‌‌‌’‌‌‌‌ అని పిలిచేవాళ్లు. 

రవ్వ ఇడ్లీ 

రెండో ప్రపంచ యుద్ధం టైంలో ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ పెరిగింది. దాంతో మన దగ్గర కూడా ధర పెరిగింది. కానీ.. ఎంటీఆర్‌‌‌‌ రెస్టారెంట్​లో ఇడ్లీలు చేయడానికి ఎక్కువగా బియ్యాన్నే వాడేవాళ్లు. బియ్యం ధర పెరగడంతో ఇడ్లీ రేట్​ కూడా పెరిగింది. అయినా.. యజ్ఞనారాయణ మాత్రం తక్కువ ధరకే ఇడ్లీ అమ్మేందుకు ఒక ప్లాన్‌‌‌‌ వేశాడు. ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌లో రవ్వతో ఇడ్లీలు చేయడం మొదలుపెట్టారు. వాటి టేస్ట్ కూడా చాలా బాగా ఉండడంతో ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌కు కొత్త కస్టమర్లు కూడా పెరిగారు. ఇప్పటికీ ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌లో రవ్వ ఇడ్లీ చాలా ఫేమస్‌‌‌‌.  

ఎమర్జెన్సీ 

సదానంద కూడా వాళ్ల పూర్వీకుల్లాగే బిజినెస్‌‌‌‌ డెవలప్‌‌‌‌ చేస్తున్న టైంలో1975లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. అప్పుడే దేశంలో ఫుడ్ కంట్రోల్‌‌‌‌ యాక్ట్ తెచ్చారు. దాని ప్రకారం.. దేశంలోని అన్ని రెస్టారెంట్లు ఫుడ్ ధరలు తగ్గించాల్సి వచ్చింది. దాంతో బిజినెస్‌‌‌‌ తగ్గిపోయింది. అన్ని హోటళ్లు ఫుడ్ ధరలతో పాటు క్వాలిటీ కూడా తగ్గించాయి. కానీ.. నష్టాలు వచ్చినా క్వాలిటీలో మాత్రం వెనక్కి తగ్గలేదు ఎంటీఆర్‌‌‌‌. ఆఖరికి క్వాలిటీ విషయంలో రాజీపడలేక పదహారు రోజుల్లోనే హోటల్‌‌‌‌ మూసేశారు.

దాంతో అందరూ ఎంటీఆర్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ.. అప్పటికే మరో బిజినెస్ ప్లాన్ రెడీగా పెట్టుకున్నాడు సదానంద మైయ్యా. ఎమర్జెన్సీ టైంలో  హోటల్‌‌‌‌లో వండిన ఫుడ్‌‌‌‌ కొన్నిసార్లు మొత్తం అమ్ముడుపోయేది. ఇంకొన్నిసార్లు చాలావరకు మిగిలిపోయి ఫుడ్‌‌‌‌ వేస్ట్ అయ్యేది. అలా వేస్ట్‌‌‌‌ కాకుండా దాన్ని స్టోర్‌‌‌‌‌‌‌‌ చేసుకునేలా ప్రాసెస్‌‌‌‌ చేసి, ప్యాక్‌‌‌‌ చేసి అమ్మాలి అనుకున్నాడు. 

ఎంటీఆర్ ఫుడ్స్‌‌‌‌ 

హోటల్‌‌‌‌ మూసేసిన కొన్ని రోజులకే రెస్టారెంట్ పక్కనే చిన్న డిపార్ట్‌‌‌‌మెంట్ స్టోర్‌‌‌‌ మొదలుపెట్టారు. అందులో ఇడ్లీలు, దోసెలు తయారు చేసుకునేందుకు కావాల్సిన ఇన్‌‌‌‌స్టంట్‌‌‌‌ మిక్స్​లను ప్యాక్‌‌‌‌ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. క్వాలిటీ, టేస్ట్‌‌‌‌ బాగుండడంతో అతి తక్కువ టైంలోనే వాటికి గిరాకీ బాగా పెరిగింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన వెంటనే ఎంటీఆర్ మళ్లీ రెస్టారెంట్‌‌‌‌ తెరిచింది. కానీ.. అప్పటికే ప్యాకేజ్డ్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ బాగా పెరిగింది. దాన్ని బెంగళూరు నుంచి దక్షిణ భారతం అంతటా విస్తరించారు. అన్ని కిరాణా దుకాణాల అల్మారాల్లో 1980ల నాటికి ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌స్టంట్ ఫుడ్స్‌‌‌‌ నిండిపోయాయి. 

ఉత్తరాదిన.. 

ఎంటీఆర్​ కంపెనీ1983 నాటికి మద్రాస్, హైదరాబాద్, విజయవాడ సహా పలు నగరాల్లో రిటైలర్ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ పెంచుకుంది. కానీ.. దక్షిణాదిన ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌కి డిమాండ్ ఉన్నా.. ఉత్తరాదిన మాత్రం అంతగా లేకుండా పోయింది. అందుకు కారణం.. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు ఒకేరకమైన ఫుడ్స్‌‌‌‌ ఇష్టపడతారు. కానీ.. ఉత్తరాదిన ఆ ఫుడ్స్‌‌‌‌ ఇష్టపడరు. అందుకే అప్పటినుంచి ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ ఏ రాష్ట్రంలో ప్రొడక్ట్స్ అమ్మాలన్నా ఆ రాష్ట్రంలో ఆహారపు అలవాట్లకు తగ్గట్టు ప్రొడక్ట్స్‌‌‌‌ తయారు చేస్తోంది. ఆ తర్వాత ఉత్తరాదిన కూడా సక్సెస్‌‌‌‌ అయ్యింది. 

విదేశాలకు 

మన దేశంతో పోలిస్తే.. విదేశాల్లో ఇన్‌‌‌‌స్టంట్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ ఎక్కువగా తింటారు. అందుకే విదేశాల్లో అమ్మకాలు మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా, సింగపూర్, ఆసియా, పసిఫిక్ దేశాలకు ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ని ఎగుమతి చేసింది. అక్కడ కూడా సక్సెస్‌‌‌‌ కావడంతో ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌కు తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌‌‌‌కి ప్రొడక్ట్స్‌‌‌‌ని ఎగుమతి చేస్తోంది. ఇంగ్లాండ్‌‌‌‌కు కుకింగ్‌‌‌‌ సాస్‌‌‌‌లను ఎక్స్‌‌‌‌పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. 

ఓక్లా చేతిలోకి 

నార్వే కంపెనీ ఓక్లా 2007లో ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ను వంద మిలియన్ల అమెరికాన్ డాలర్లకు కొనేసింది. అయినా.. మైయ్యా ఫ్యామిలీ పాటించిన స్ట్రాటజీలనే ఫాలో అవుతోంది. క్వాలిటీ తగ్గించకుండా ప్రొడక్ట్స్‌‌‌‌ అందిస్తోంది. ప్రస్తుతం ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, వడ మిక్స్, గులాబ్ జామూన్, స్వీట్ మిక్స్‌‌‌‌లు, ఉప్మా, పోహా, బనానా చిప్స్, కార్న్‌‌‌‌ఫ్లేక్స్ మిక్స్‌‌‌‌, సాంబార్ పౌడర్, రసం పౌడర్, మసాలా.. లాంటి ఎన్నో ప్రొడక్ట్స్ మార్కెట్​లో ఉన్నాయి.

స్టాండీ ప్యాక్‌‌‌‌ 

ప్యాకేజింగ్‌‌లో కొత్తదనం చూపిస్తేనే ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో ముందుంటామని గమనించింది ఎంటీఆర్‌‌‌‌. ప్యాకేజింగ్‌‌లో కూడా కొత్త పద్ధతులు పాటించింది. మొదటిసారిగా ఇండియాలో ప్యాక్డ్ ఫుడ్‌‌లో పాలిస్టర్ పాలీ స్టాండీ ప్యాక్‌‌ తెచ్చింది. ఈ ప్యాక్‌‌లను స్టోర్ షెల్ఫ్‌‌లో నిటారుగా పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రొడక్ట్స్‌‌ వివరాలు కస్టమర్లకు ఈజీగా కనిపిస్తాయి. దానివల్ల కూడా ఎంటీఆర్‌‌‌‌ సేల్స్ పెరిగాయి. 

చంద్రహారం స్వీట్ 

రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌లో ఫుడ్‌‌‌‌తోపాటు డిసర్ట్స్​ కూడా సర్వ్‌‌‌‌ చేయాలని యజ్ఞనారాయణ అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ఒక స్వీట్ తయారు చేసేందుకు కొన్నాళ్లపాటు కష్టపడ్డాడు. ఒక కొత్త స్వీట్‌‌‌‌ని తయారుచేశాడు. కానీ.. దాన్నెలా మార్కెట్‌‌‌‌ చేయాలి? దాన్ని జనాలకు ఎలా అలవాటు చేయాలి? అనుకుంటుండగా యజ్ఞనారాయణ మరో ప్లాన్‌‌‌‌ వేశాడు. 

అప్పట్లో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌, సావిత్రి నటించిన ‘చంద్రహారం’ సినిమా విడుదలై.. సూపర్ హిట్‌‌‌‌ అయ్యింది. దాంతో ఆ సినిమా పేరునే ఆ స్వీట్‌‌‌‌కి పెట్టి మార్కెటింగ్ చేశాడు. దాంతో ఆ సినిమాలాగే స్వీట్‌‌‌‌ కూడా సక్సెస్‌‌‌‌ అయ్యింది. ఇలాంటి స్ట్రాటజీలతో బెంగళూరుతో ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ని టాప్‌‌‌‌ రెస్టారెంట్ల లిస్ట్‌‌‌‌లో చేర్చిన తర్వాత యజ్ఞ నారాయణ చనిపోయారు. తర్వాత సదానంద మైయ్యా బిజినెస్‌‌‌‌ చూసుకోవడం మొదలుపెట్టాడు.