శిథిలావస్థలో ఎస్సారెస్పీ ఉప కాలువలు

  •     చివరి ఆయకట్టుకు నీరందేనా
  •     అన్నదాతకు  ఏటా తిప్పలు

బాల్కొండ, వెలుగు :  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో సాగు నీటికోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాకతీయ కాలువ ఎల్ఎండీ కింద 4.60 లక్షల ఎకరాలు, సరస్వతీ కాలువ 35 వేలు, లక్ష్మీ కాలువ కింద 25 వేల ఆయకట్టు, అలీ సాగర్ ఎత్తిపోతల కింద 57 వేలు,గుత్ప 38 వేలు,చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల కింద 11600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. కానీ  కాల్వలు సరిగా లేక చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 

నిధులు మంజూరు చేసినా.. 

కాలువల ఆధునీకరణను గవర్నమెంట్ 2017లో 20 కోట్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఎక్కడిక్కడ పెండింగ్ లో ఉన్నాయి.  కాలువల లైనింగ్ పనులు ప్రారంభం అయినా వర్షాలు పడడంతో నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల సగం పనులు చేసి మధ్యలోనే ఆపేశారు. కాలువల్లో పూడిక నిండి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. కాలువలకు గండి పడితే  రైతులు వ్యయ ప్రయాసలతో మట్టి సంచులు వేసి సాగు చేసుకుంటున్నారు. పిచ్చి మొక్కలు పెరిగి ఆయకట్టుకు నీరందుతుందో  లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

యాసంగి, ఖరీఫ్ సీజన్లలో ఆయకట్టుకు నీరందించేందుకు వారబందీ పద్ధతి ప్రకారం నీటిని వదిలారు. ప్రస్తుత ఖరీఫ్ లో ఏడు రోజులు 3 వేల క్యూసెక్కులు, ఎనిమిది రోజులు 5 వేల క్యూసెక్కుల నీటిని వదిలేందుకు నిర్ణయించారు.ప్రాజెక్టు లో ఆశించినంతగా నీరు లేదు. అయినా రైతుల ప్రయోజనాల కోసం నీటిని వదిలేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల పాటు ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఖరీఫ్ భరోసా కల్పించింది.

జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం

కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేస్తే ప్రాజెక్టు దిగువ జలవిద్యుదుత్పత్తి కి అవకాశం ఉంది.నాలుగు టర్భయిన్ల ద్వారా 36 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా, కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీరు వదిలినా ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.