ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించారు..స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

నల్లగొండ: ఫీజు కట్టలేదని.. ఇద్దరు నర్సరీ విద్యార్థులను స్కూల్లోనే బంధించిన దారుణ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగింది. దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం ఇద్దరు నర్సరీ విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించారు. 

ఫీజు చెల్లించలేదని నర్సరీ చదువుతున్న చైత్ర, యూకేజీ చదువుతున్న జాహ్నవిని యాజమాన్యం స్కూల్లోనే నిర్భంధించారు. స్కూల్ టైం అయిపోయినా విద్యార్థు లు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. 

స్కూల్ సిబ్బందిని ఆరాతీయగా ఫీజు చెల్లించకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నామని సమాధానం చెప్పారు. అంతేకాదు స్కూల్ ఫీజు చెల్లించిన తర్వాతే విద్యార్థు లను ఇంటికి తీసుకెళ్లాలని దబాయించారు. 

అనుకోని సంఘటను షాకైన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా..ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామని తెగేసి చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. 

ఇంత దారుణానికి పాల్పడిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.